దేశ విభజనకు బీజాలు నాటిన నాటి నుంచి భారత్–పాక్ మధ్య కశ్మీర్‌లో ఘర్షణ రావణ కాష్టంగా మండుతూనే ఉంది. ఇది కార్గిల్‌తోనో, ‘ఉడీ’తోనో పుల్వామా లేదా మరో ‘కుల్గాం’ హింసాకాండతోనో ముగింపునకు వచ్చే పరిణామంగా కన్పించడం లేదు. అన్నిటికీ మించి ఇరుగు పొరుగు దేశాలతో పటిష్ట బంధంలేని సమస్య భారత్‌ను వెంటాడుతోంది. ఇరుగుపొరుగుతో నిత్యం తగాదాలవల్ల, యుద్ధాలవల్ల సమస్యలు పరిష్కారం కావు. సమస్యలపట్ల విశాల దృక్పథం, ఇచ్చిపుచ్చుకునే తత్వం, ఉపఖండ విభజనకు దారితీసిన రాజకీయ పరిణామాల పూర్వ రంగంలో నవ శకానికి తెరతీసే కృత నిశ్చయం పాలకులకు ఉంటే– పరిష్కారం కాని సమస్య ఉండదు.
జమ్మూ–కశ్మీర్‌లో పుల్వామా వద్ద భారత సీఆర్‌పీఎప్ సైనికులపై ఉగ్రవాదులు దాడి జరిపి 49 మంది సైనికుల్ని పొట్టన పెట్టుకున్నందున సైనిక కుటుంబాల, దేశ ప్రజల మనస్సులు రగిలిపోతున్నాయి. అలాగే నా రక్తమూ మరిగిపోతోంది. ఉగ్రవాదం ఒక కార్ఖానా (ఫ్యాక్టరీ). అది నడు స్తున్నంత కాలం ప్రపంచంలో శాంతి ఉండదు. ఆ ఫ్యాక్టరీని నేనే అంతం చేయాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. ఇది సరికొత్త ఇండియా. మన కొత్త కొత్త విధానాలవల్ల పాకిస్తాన్ కష్టాలను ఎదుర్కొంటోంది. మేం నోరుమూసుకుని కూర్చునే బాపతు కాదు. మా పోరాటం కశ్మీర్ కోసమే గానీ కశ్మీరీలపైన కాదు.
– ప్రధాని నరేంద్రమోదీ (23–02–2019)
ఉగ్రవాద చర్యల్నిఎదుర్కోవడంతోపాటు అదే సమయంలో కశ్మీర్‌లో శాంతి స్థాపనకు అక్కడి ప్రజలతో ముఖాముఖి సంప్రదింపులు జరు పుతూ వారిలో విశ్వాసం నెలకొల్పగల చర్యలను కూడా పాలకులు తక్షణం చేపట్టాలి. తద్వారా తిరిగి భారత్–పాకిస్తాన్‌ల మధ్య చర్చలు ప్రారంభం కావాలి. రక్తపాతాన్ని ఆపివేయాలి.
– భారత్–పాకిస్తాన్ శాంతి సంఘం (15–02–2019)
కనీసం మహాభారతంలో యుద్ధం ముగిసి శాంతి సంప్రతింపుల ద్వారా నైనా ఒక కొలిక్కి వచ్చి శాశ్వతంగా నిలిచిపోయింది కానీ, భారత ఉప ఖండాన్ని కృత్రిమంగా విభజించిన దాని ఫలితంగా గత 70 ఏళ్లకుపైగా భారత–పాకిస్తాన్‌ల మధ్య రగడ మాత్రం ముగింపునకు రాని ఫలితంగా ఉభయదేశాల పాలకుల సంగతేమో కానీ ప్రజలు మాత్రం సుఖశాంతు లకు దూరమైపోయారు. ఇది ‘ఏలినాటి శని’ కాదు, ప్రస్తుతం ‘ఏలేనాటి’ శని గానే ఉండిపోయింది. ఈ రావణ కాష్టానికి కారకులు ఎప్పటికప్పుడు అధికార పదవీ తాపత్రయం ఉన్న ఉభయదేశాల పాలకులా లేక ప్రజలా? ఈ చర్చ ఈ వేళది కాదు. దేశ విభజనకు బీజాలు నాటిన నాటి నుంచీ కొనసాగుతూనే ఉంది. ఇది ఒక కార్గిల్‌తోనో, ఒక ‘ఉడీ’తోనో ఒక పుల్వామా లేదా మరో ‘కుల్గాం’ హింసాకాండతోనో ముగింపునకు వచ్చే పరిణామంగా కన్పించడం లేదు.
ఈ పరిణామాలకు మనం శత్రు దేశంగా భావించి ప్రకటించుకున్న ఉపఖండ విభజనలో అంతర్భాగాన పాకిస్తాన్ పాలకులతోపాటు మన దేశ రాజకీయ పాలనా శక్తులు కూడా కారణమేనని మరచిపోరాదు. ఎందుకంటే ఏ ఖండంలోనైనా ఇరుగు పొరుగు దేశాలతో శాంతి స్థాపనకు కీలక నిర్ణయాలు కుల, మత, వర్గా తీత, సెక్యులర్, సామాజిక, ప్రజాస్వామ్య ఆర్థిక, రాజకీయ వ్యవస్థల సుస్థిరత మాత్రమే బలమైన ప్రాతిపదిక కావాలి. ఆ దారి నుంచి ఉప ఖండ దేశాలైన భారత్–పాక్ పాలక శక్తులు తప్పుకొని జారుడుబండ రాజకీయాలను ఆశ్రయించినందుననే ప్రజలను సుఖసౌఖ్యాలనుంచి, శాంతి నుంచి దూరం చేయడం జరుగుతోంది.
కాంగ్రెస్ యూపీఏ హయాంలోనూ, బీజేపీ ఎన్డీఏ పాలనాకాలం లోనూ హింసాకాండకు ఆటవిడుపు లేకుండా పోయింది. గతాన్ని చూస్తే, 1983 ఫిబ్రవరి 18న అస్సాంలోని నెల్లిలో ఆశ్రయం పొంది బతుకు తున్న బంగ్లాదేశ్ మైనారిటీలు 2,191 మందిని ఊచకోత కోసేశారు. అలాగే బీజేపీ హయాంలో గుజరాత్‌లో 2002–2003లో సుమారు 2,000 మంది మైనారిటీలు ఊచకోతలకు బలయ్యారు. అలాగే ప్రజా స్వామ్య వ్యతిరేక పాలక విధానాల ఫలితంగా 2000–2008 సంవత్స రాల మధ్య మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఒరిస్సా, కేరళ, అస్సాం జమ్ము–కశ్మీర్ రాష్ట్రాల్లో జరిగిన మతఘర్షణల ఫలితంగా మొత్తం 6,414 మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని మరవరాదు. ఇక ఉభయదేశాల సరిహద్దులకు ఆవల, ఈవల ఉన్న భారత–పాకిస్తాన్ పాలకుల హయాంలో నిరంతరం ముఖ్యంగా ఉభ యత్రా ఎన్నికల సీజన్‌లో రాజకీయ లబ్ధి కోసం వినిపించే యుద్ధ కాహ ళులకు నియమ నిబంధనలే లేవు.
పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నా సరిపెట్టుకుని సర్దుకుపోవ చ్చేమో గానీ, అణ్వస్త్రధారులై ఉన్న ఇరుగుపొరుగు దాయాదుల మధ్య చిల్లర తగాదాలు ముదిరిపోతే నష్టపోయేది కోట్లాదిమంది ఉభయ దేశాల అమాయక ప్రజాబాహుళ్యమని పాలకులు మరిచిపోరాదు. అదీకా కుండా మనకు ఇరుగు–పొరుగుతో బలీయమైన స్నేహ సంబంధాలు లేకుండా అగ్రరాజ్య, వలస సామ్రాజ్య పెత్తందారీ శక్తులను ఎదుర్కో వటం సాధ్యం కాదని కూడా గుర్తించవలసిన సమయం వచ్చింది. అసలు మన పాలక శక్తుల విదేశాంగ విధానానికి నిర్దిష్టమైన విధానం ఇరుగు–పొరుగు దేశాల పట్ల లేనందుననే చైనా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, భూటాన్‌లతో మనం గర్వించదగిన రీతిలో పూర్తి స్థాయి మైత్రీ సంబంధాలు ఈ రోజుకీ లేవంటే అతిశయోక్తి కాబోదు!
ఈ అలుసుతోనే భారత్–పాకిస్తాన్‌ల మధ్య పొరపొచ్చాలను మరిం తగా పెంచేందుకే అమెరికా తాజాగా ఇరుదేశాల పాలకుల మధ్య వీలూ –వాలూ చూసుకుని ‘నెగళు’్ల (నిప్పు) పెట్టజూస్తోంది. అందులో భాగం గానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ఆయాచిత ప్రకటన విడుదల చేస్తూ ‘పుల్వామా ఉగ్రదాడి దృష్ట్యా పాకిస్తాన్‌పై ప్రతిచర్యకు దిగాలని భారత్ యోచిస్తోందని, కశ్మీర్‌లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందనీ’ హెచ్చ రించాడు. ‘నేను ప్రపంచంలో ఎవరిని ఉగ్రవాది అని ప్రకటిస్తానో అతనిపై ప్రపంచ దేశాలన్నీ నాతోపాటే గొంతు కలిపి అతణ్ణి ఉగ్రవాదే నని ప్రకటించి తీరాలని’ లోగడ బుష్ శాసించాడు. అదే ఉపఖండ దేశాల్లో కూడా కొందరికి శాసనమై కూర్చుంది. ఫలితంగా మన ఇరుగు– పొరుగుతో సంబంధాల్ని ఈ ‘శాసనం’ తక్కెట్లో తూచడానికి ప్రయత్నిస్తే సమస్యలకు పరిష్కారం దొరకదని భారత్–పాక్ నాయకులు గుర్తించా ల్సిన సమయం వచ్చింది. మనకు అఫ్గానిస్తాన్‌తో సంబంధాలు కూడా అమెరికా తక్కెడలో పెట్టి తూచడానికి ప్రయత్నించకూడదు. ఇరాక్‌పై అమెరికా దురాక్రమణ యుద్ధాన్ని కూడా మనం అలాగే అమెరికా కళ్లద్దా లనుంచే చూసి, భంగపడ్డామని మరచిపోరాదు.
అంతేగాదు, ‘ఉగ్రవాదం’ మిషపైన అఫ్గానిస్తాన్‌లో కూడా తిష్ట వేసిన అమెరికా క్రమంగా పక్కనే కూతవేటు దూరంలో ఉన్న కశ్మీర్‌లోకి ప్రవేశించి దాని ప్రతిపత్తిని భంగపరచదన్న గ్యారంటీ కూడా ఏమీలేదని మన పాలకులు గుర్తించాలి. అమెరికా ఖండాంతరం దాటి ఆరబ్ భూ ఖండంలోని ఇరాక్, ఇరాన్‌లపై కాలు దువ్వగా లేనిది మన ఇరుగు పొరుగు అఫ్గానిస్తాన్ పక్కన డజన్ల కిలోమీటర్ల కూతవేటు దూరంలో ఉన్న కశ్మీర్‌లోకి తన సైన్యాన్ని నడపటం నల్లేరుమీద నడక అని మరచి పోరాదు. ఎందుకంటే, ఒక వైపున పాకిస్తాన్‌కు ‘పీక మొయ్యా’ సైనిక ఆయుధ సహాయం చేసి ఈ స్థితికి చేర్చిన అమెరికా దక్షిణాసియాలోని భారత్ ప్రయోజనాలకన్నా తన ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని గుర్తించాలి. పుల్వామా దాడి నేపథ్యంలో బీజేపీ పాలకులు భారత్– పాకిస్తాన్‌ల మధ్య సింధూనదీ జలాల పంపిణీ గురించి అమెరికా ఆధ్వ ర్యంలోని ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందాన్ని (1960) ఉల్లంఘించడానికి తాత్కాలిక ఉద్రేకంలో సిద్ధంకావడం ఉభయ దేశాల ఉమ్మడి ప్రయోజనాలతో చెలగాటం ఆడటమే అవుతుంది.
ఈ ఆలోచనకు పాదులు తీసిన మంత్రి గడ్కారీ ప్రతిపాదనను ప్రస్తావిస్తూ సింధూనదీ జలాల ఒడంబడికను అధ్యయనం చేసిన విశ్లేషకురాలు ప్రొఫెసర్ మాయామశ్చీందరి (అశోకా యూనివర్సిటీ) వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు: ‘నీరు అనేది మంటల్ని, అగ్నికీలల్ని ఆర్ప డానికి ఉద్దేశించిన సహజ వనరు. కానీ దురదృష్టవశాత్తు ఈ సహజ వనరును ప్రపంచ ఘర్షణలకు తరచూ ఒక కారణంగానో లేదా శత్రు రాజ్యాలు పరస్పర విజయావకాశాల కోసం వినియోగించే ఆయుధం గానో వాడటం జరుగుతోంది’. భారత్–పాకిస్తాన్ పాలకుల విధానాల ఫలితంగా, ఉభయ దేశాల ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు వినియోగ పడాల్సిన సిం«ధూనదీ జల వ్యవస్థలోని ఆరు నదుల జీవ ధారల ఉనికి ప్రమాదంలో పడుతుందని గ్రహించాలి. ఈ నదులు ఇరుగుపొరుగు చైనాలోని టిబెట్ గుండా ప్రవేశిస్తున్నాయని గ్రహించాలి. అందువల్ల ప్రస్తుతం నిద్రావస్థలోని భారత్–చైనా సరిహద్దు తగాదా కూడా పరి ష్కారం కానందువల్ల ఈ సింధూనదీ జల వ్యవస్థను (సింధు/జీలం/ చీనాబ్ మూడు పశ్చిమ నదులు పాక్‌కు, రావి/బియాస్/సట్లెజ్‌లు ఇండి యాకు) ప్రజా ప్రయోజనకరంగా ఉపయోగించుకోడానికి తరచూ ఆటం కాలు ఏర్పడవచ్చు.
కనుకనే భారత్–పాక్ పాలకులు సంవత్సరానికి రెండుసార్లు విధిగా సమావేశమై వ్యవస్థలోని సాంకేతిక పరంగా ప్రాజెక్టు ప్రాంతాల్ని సందర్శించి నదుల ప్రవాహ వైనం తాలూకు వివరాల్ని, వాడకంలో నీటి పరిమాణాన్ని గురించి చర్చించాలని, ఇందుకోసం తగిన యంత్రాం గాన్ని నియమించాలనీ వరల్డ్ బ్యాంక్ ఆదేశించింది కూడా. 2016లో ‘ఉడీ’ ఘటన పేరిట ఈ ద్వైవార్షిక చర్చలకు పాలకులు ‘సున్న’ చుట్టి కూర్చున్నారు. బంగ్లాదేశ్‌వి 54 నదులు, మరి 230 నదులు ఇండియా నుంచి ప్రవహిస్తుంటాయి. ఇండియాకు సంబంధం ఉన్న బ్రహ్మపుత్ర నది ఆధారంగా చైనా అనేక ప్రాజెక్టులు తలపెట్టింది. ఇవన్నీ– ఇరుగు పొరుగుతో నిత్యం తగాదాలవల్ల, యుద్ధాలవల్ల పరిష్కారం కావు. సమ స్యలపట్ల విశాల దృక్పథం, ఇచ్చిపుచ్చుకునే తత్వం, ఉపఖండ విభజ నకు దారితీసిన రాజకీయ పరిణామాల పూర్వ రంగంలో నవ శకానికి తెరతీసే కృత నిశ్చయం పాలకులకు ఉంటే– పరిష్కారం కాని సమస్య ఉండదు. ‘గిల్లికజ్జాలతో’ నిర్మించేది నవ భారతానికి సంకేతం కాదు. అలాగే నిరంతరం ఇండియాతో ఘర్షణవల్ల పాకిస్తాన్ బాగుకునేది లేదు.
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
ఈ-మెయిల్: abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment