ఇంటర్‌ విద్య విలీనంతో ఇక్కట్లే అధికం | Article On Intermediate And School Education | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్య విలీనంతో ఇక్కట్లే అధికం

Published Wed, May 8 2019 3:08 AM | Last Updated on Wed, May 8 2019 3:08 AM

Article On Intermediate And School Education - Sakshi

తెలంగాణలో ఇంటర్‌  పరీక్షల ఫలితాల ప్రకటనలో జరిగిన లోపాలను సాకుగా తీసుకుని, ఇంటర్‌ బోర్డునే రద్దుపర్చి, పాఠశాల విద్యలో విలీనం చేయాలని చర్చలు జరగడం విచారకరం. యాభై ఏళ్ల క్రితం నాటి రాష్ట్ర విద్యామంత్రి పీవీ నరసింహారావు అంకురార్పణ చేసిన ఇంటర్మీడియట్‌.. పాఠశాల, కళాశాల విద్యకు వారధిగా ఉంటూ విద్యార్థి జీవితంలో భవిష్యత్తు ప్రణాళికలకు రహదారిలా మారింది. జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షల్లో ఎన్ని మార్పులు వచ్చినా రాష్ట్ర విద్యార్థుల జయకేతనాన్ని ఆపలేకపోయాయి అంటే దానికి ఇంటర్‌ విద్యామండలి పాఠ్యప్రణాళికలే కారణం. ఇంటర్‌ విద్యను మరింత బలోపేతం చేయాలి. ఇంటర్‌ విద్యను రద్దు చేస్తే విద్యా వ్యవస్థను 50 యేళ్లు వెనక్కి నెట్టినట్లే అవుతుంది.  30 ఏళ్లుగా పాలకుల  నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యా సంస్థలని, ప్రభుత్వం భుజానికి ఎత్తుకోవాలి.

మార్చి 2019 ఇంటర్‌ ఫలితాల ప్రకటన తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు ప్రతిష్ట దిగజారడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఈ సమస్య పరిష్కారం ఒక జటిల సమస్యగా మారింది. ఇది 50 ఏళ్ళ ఇంటర్‌ విద్యా మండలి ప్రయాణంలో జరిగిన అతి భారీ ప్రమాదం. అయితే ఇది ప్రమాదమే గాని సంక్షోభం కాదు. దీన్ని ఆధారంగా చేసుకొని ఇంటర్‌ విద్యావ్యవస్థను రద్దు పరచి పాఠశాల విద్యలో విలీనం చేయాలనే చర్చలు మొదలయ్యాయి. కొఠారి కమిషన్‌ సిఫార్సుల మేరకు నాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యామంత్రి పి.వి.నర్సింహారావు, ఇంటర్‌ విద్యకు 1969–70 విద్యా సంవత్సరంలో అంకురార్పణ చేశారు. పాఠశాల, కళాశాల విద్యకు వారధిగా ఉంటూ విద్యార్ధి జీవితంలో భవిష్యత్తు ప్రణాళికలకు ఇది ఒక రహదారి (గేట్‌వే) అయింది. ఆంధ్రప్రదేశ్‌ ఇంట ర్మీడియట్‌ విద్యాచట్టం 1971 ద్వారా ఏర్పడిన ఇంటర్‌ విద్యామండలి ఒక స్వతంత్ర సంస్థగా ఆవిర్భవించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడం, ఎప్పటికప్పుడు పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడం సాగిస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షల్లో ఎన్ని మార్పులు వచ్చినా రాష్ట్ర విద్యార్థుల జయకేతనాన్ని ఆపలేకపోయాయి అంటే దానికి ఇంటర్‌ విద్యామండలి పాఠ్యప్రణాళికలే కారణం.  

ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఇంటర్‌ విద్యావ్యవస్థ ప్రారంభంలో ప్రభుత్వ రంగంలో దినదినాభివృద్ధి చెందింది. అదే సమయంలో గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌జేసీ)తోపాటు ప్రతిష్టాత్మక ఎయిడెడ్‌ విద్యాసంస్ధలను ప్రారంభించడంతో అనేక మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడ్డారు. 1983 వరకు ఇంటర్‌ విద్య ప్రభుత్వ అధీనంలోనే కొనసాగింది. 1983లో ఆంధ్రప్రదేశ్‌ విద్యాసంస్థల ప్రవేశాలు, క్యాపిటేషన్‌ ఫీజు రద్దు చట్టం (యాక్టు 5/1983) ద్వారా నాటి సీఎం ఎన్‌.టి.రామారావు, ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలకు తెరలేపారు. దీనితో గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మొదలైన ప్రాంతాల్లో ఎంసెట్‌ కోచింగ్‌ సెంటర్లు ప్రారంభమయ్యాయి. క్రమంగా ఇవి రూపాంతరం చెందుతూ జూనియర్‌ కళాశాలలుగా, రెసిడెన్షియల్‌ కళాశాలలుగా, కార్పొరేట్‌ కళాశాలలుగా మారాయి. ఇప్పుడు శ్రీచైతన్య, నారాయణ అనే అనకొండలు రెండు తెలుగు రాష్ట్రాల ఇంటర్‌ విద్యను శాసిస్తున్నాయి. 

ఈ క్రమంలో కలిసి వచ్చిన ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్‌ పరీక్షలు ఈ రెండు విద్యా సంస్థలు అడ్డంగా బలవడానికి ఉన్న బలమైన కారణాలు. 1969లో ప్రారంభమైన ఇంటర్‌ విద్యకు పట్టని ఈ కార్పొరేట్‌ చీడ 1983లో ప్రారంభమైన ఎంసెట్‌ పరీక్ష, ఆ తరువాత మొదలైన జాతీయ, జాతీయ సంస్ధల ప్రవేశ పరీక్షలతో ఉనికిలోకి వచ్చింది. మూడు దశాబ్దాలుగా ఏపీఆర్‌జేసీలను, పేరు పొందిన ఎయిడెడ్‌ విద్యా సంస్థలతో సహా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి, ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థల పల్లకీలను మోసింది ప్రభుత్వ విధానాలే అని మరువరాదు. రాష్ట్రంలో ఇంటర్‌ విద్య ఉన్నత ప్రమాణాలతో కొనసాగడం వల్లే జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఏవైనా (ఐఐటీ, నీట్, జిప్మెర్, ఎయిమ్స్, బిట్స్‌) రాష్ట్ర విద్యార్థుల విజయ దుందుభి కొనసాగుతుంది. దేశంలోని ఏ ఐఐటీలలో చూసినా సగంమంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుండి ఉన్నారంటే అతిశయోక్తి కాదు, ఈ ఐఐటీలు, నీట్‌లో రాశి, వాసితో పాటు బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల వాటాను కూడా ప్రత్యేకంగా చర్చించాలి. అనేక శతాబ్దాలుగా చదువుకు దూరమైన బడుగు, బలహీన వర్గాలు ఇప్పుడు ఐఐటీలలో ప్రవేశిస్తున్నారంటే దానికి ఇంటర్‌ విద్యే కారణం.

దేశవ్యాప్తంగా లేని ఇంటర్మీడియట్‌ విద్యా వ్యవస్థను ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు అమలు చేస్తున్నారు అని ప్రశ్న. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, బిహార్, హరియాణా వంటి రాష్ట్రాలలో మినహాయిస్తే దేశ వ్యాప్తంగా పాఠశాల విద్యలోనే +2 విద్య కొనసాగుతున్న మాట వాస్తవం. మన రాష్ట్రంలోనూ +2 విద్యనందిస్తున్న విద్యాసంస్థలు అనేకం. అయితే భారతీయ విద్యాభవన్, హెచ్‌పీఎస్, డీపీఎస్, నవోదయ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో చదువుతున్న విద్యార్థులతో పాటు ఒడిశా, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి 10వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం 70 వేలకు పైగా విద్యార్థులు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఇంటర్‌ విద్యలో చేరుతున్నారంటే ఇంటర్‌ విద్య ప్రాధాన్యతను తెలుసుకోవచ్చు. 1969లో తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ రాష్ట్రంలో కూడా ప్రత్యేక ఇంటర్‌ విద్యకు అంకురార్పణ జరిగింది. కానీ అధ్యాపకుల కోరిక మేరకు అక్కడ +2 విద్యావ్యవస్థను రద్దు పరచారు. అది కేరళ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. 2017–18 ఐఐటీ ఫలితాలలో కేరళ రాష్ట్రం సాధించిన సీట్ల సంఖ్య అక్షరాలా 181, కాని తెలంగాణ రాష్ట్రం సాధించినది 833 సీట్లు.  అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సాధించినవి 882 సీట్లు. ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా తెలుగు రాష్ట్రాల రికార్డును బద్దలు కొట్టలేకపోయింది.

పాఠశాలల్లోనే ఇంటర్‌ విద్య కొనసాగాలన్న చర్చకు తెరలేపిన విద్యావేత్తలకు ఒక సంఘటనను గుర్తు చేస్తున్నాను. సుప్రీం కోర్టు ఆదేశాలతో భారత ప్రభుత్వం 2017 నుండి వైద్యవిద్య ప్రవేశాలకు జాతీయ అర్హత, ప్రవేశపరీక్ష (నీట్‌)ను తప్పనిసరి చేసింది. నీట్‌ను వ్యతిరేకించిన రాష్ట్రాలలో తమిళనాడే మొదటిది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఒక దళిత విద్యార్థిని ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  షణ్ముగం అనిత అనే ఈ దళిత విద్యార్థిని రోజువారీ కూలి చేసుకునే కుటుంబానికి చెందినది. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సరైన సంరక్షణ లేకున్నా 2017లో, 12వ తరగతి మార్చి పరీక్షలలో 1200కు గాను 1176 మార్కులు సాధించింది. ఈ విద్యార్థిని ప్రతిభను గుర్తించి, మద్రాసు సాంకేతిక సంస్థ (ఎమ్‌ఐటీ) ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో సీటును కేటాయించింది. కానీ తన తల్లి మరణంతో డాక్టర్‌ కావాలనే ఆకాంక్షను తన జీవితాశయంగా పెట్టుకుంది. 2017 నీట్‌ పరీ క్షలో ఎలాంటి శిక్షణ లేకపోవడంతో అనిత 720 మార్కులకు గాను 86 మార్కులు సాధించి కనీస అర్హత (288) కూడా పొందలేక పోయింది. దీనితో ఆవేదనతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతిభాపాటవాలు ఉన్నా నీట్‌ శిక్షణ లేకపోవడం తనకు శాపంగా మారింది. తమిళనాడులో ప్రస్తుతం 6362 ప్రభుత్వ అధీనంలో నడిచే +2 విద్యాసంస్థలు ఉంటే కేవలం 179 మాత్రమే ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ కోరల్లో తమిళనాడు విద్యావ్యవస్థ చిక్కుకోకపోవడానికి ప్రధాన కారణం అక్కడ ప్రవేశ పరీక్షలు లేకపోవడం. అంతే కానీ +2 విద్య కారణం కాదు. నీట్‌ పరీక్ష ప్రారంభమైన తర్వాత తమిళనాడు అనేక జాతీయస్థాయి కోచింగ్‌ సెంటర్లకు కేంద్రంగా మారింది ఎప్‌ఐటీజేఈఈ, కెరీర్‌ పాయింట్, ఎలెన్, రిసోనెన్స్‌ లాంటి సంస్థలు కొలువుతీరాయి. ఇది సరిగ్గా 1983 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గుంటూరు, ఒంగోలు, నెల్లూరు లాంటి ప్రాంతాలలో ఏర్పడిన కోచింగ్‌ సెంటర్ల ప్రారంభరూపం. త్వరలోనే జాతీయ విద్యాసంస్థలతోపాటు మన కార్పొరేట్‌ విద్యాసంస్థలు కూడా తమిళనాడు  తీరాన్ని తాకనున్నాయి. దీంతో తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యా వ్యవస్థ ధ్వంసం ఖాయం. 

ఇంటర్‌ విద్య ఆవిష్కరణ తర్వాత ఇంటర్‌ విద్యామండలి చట్టంతో పాటు 1982 విద్యాచట్టం, 1998 రాష్ట్ర ఉన్నత విద్యామండలి చట్టం, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇంటర్‌  విద్య, ఉన్నత విద్యలో ఒక ప్రత్యేక విభాగం. కాని 1994లో, 2009లో వేర్వేరు జీవోల ద్వారా ఇంటర్‌ విద్యను పాఠశాల విద్యలో భాగం చేయడానికి ప్రయత్నించినా విద్యావేత్తలు, శాసనమండలి సభ్యులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నాలను విరమించుకున్నది. కానీ ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న పాఠశాల విద్యలో ప్రస్తుతం ఇంటర్‌ విద్యను చేర్చి మరో సర్వీసు వివాదానికి తెరలేపడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొరివితో తలగోక్కున్నట్లే.  

కొంతమంది విద్యావేత్తలు సూచించినట్లుగా తెలంగాణలో ఇంటర్‌ విద్యను రద్దు పరిచి, పాఠశాల విద్యలో విలీనం చేస్తే ప్రతి ఏటా లక్ష మంది విద్యార్థులు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వలస వెళ్లడం ఖాయం. గతంలో రాష్ట్ర విభజన కంటే ముందు నాగార్జున సాగర్‌ పరివాహక ప్రాంతం, సింగరేణి ప్రాంతాల నుండి వేల సంఖ్యలో విద్యార్థులు విజయవాడ కేంద్రంగా విద్యనభ్యసించడం మరిచిపోరాదు. అందుకే ఇంటర్‌ విద్యను తెలంగాణ ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలి. ఇంటర్‌ విద్యను రద్దు చేస్తే విద్యా వ్యవస్థను 50 ఏళ్లు వెనక్కి నెట్టినట్లే అవుతుంది. ఇలాంటి హానికరమైన ఆలోచనల్ని మానుకుని  30 ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యా సంస్థలను, ప్రభుత్వం భుజానికి ఎత్తుకోవాలి. ప్రతి జిల్లాలో కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ని స్థాపించి, సామర్థ్యం, అభిరుచి, ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్ర, జాతీ యస్థాయి పోటీ పరీక్షలను సిద్ధం చేయాలి. అదే సమయంలో కార్పొరేట్‌ విద్యాసంస్థల కఠినమైన నియంత్రణ నిబంధనలను అమలు చేయాలి. తద్వారా ఇంటర్‌ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలి. అన్ని కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలి. ఇంటర్‌ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలనే సూచనను తిరస్కరించాలి. ఆ విధంగా ఇంటర్‌ విద్య ఔన్నత్యాన్ని కాపాడాలి.
 

పి. మధుసూదన్‌రెడ్డి

వ్యాసకర్త అధ్యక్షులు, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం 
తెలంగాణ రాష్ట్రం ‘ మొబైల్‌ : 98495 39252

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement