శత్రుసైన్యాలపై ఉపయోగించాల్సిన మారణాయుధాలను మావోయిస్టులపై, ఆదివాసీలపై ప్రయోగిస్తారా? పౌరులపై అఘాయిత్యానికి పాల్పడటం యుద్ధ నేరాల్లో భాగం కాదా? సరిహద్దుల్లోపల ప్రభుత్వాలు సాగిస్తున్న ఈ యుద్ధం ఎవరి ప్రయోజనం కోసం?
మోసపూరితంగా విషం పెట్టి ఉన్నపళాన డజన్ల కొద్దీ మావోయిస్టు కార్యకర్తలను, వారికి ఆశ్రయం ఇస్తున్న ఆదివాసులను చంపటం, శత్రుదేశ సైనికులపై ప్రయోగించాల్సిన మారణాయుధాలను సొంత దేశవాసులపై విచ్చలవిడిగా ప్రయోగించి ఆత్మరక్షణకోసం కాల్చాం అంటూ సమర్థించుకోవడం భారత పారామిలటరీ బలగాలకు, రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు వ్యతిరేక సాయుధ పోలీసు బలగాలకు మాత్రమే చెల్లింది. అంతర్జాతీయ విధానం ప్రకారం యుద్ధనేరాల కింద పరిగణించదగిన సైనిక చర్యలను మావోయిస్టుల ఏరివేతగా లెక్కించి ప్రచారం చేయడం దశాబ్దాలుగా ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. మార్చి 22న లెనిన్ జయంతి, ఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినాన్ని లక్ష్యంగా చేసుకుని దండకారణ్యంలో మూడు రాష్ట్రాల సాయుధ బలగాలు చేస్తున్న మారణ కాండ ఏప్రిల్ చివరకు పరాకాష్టకు చేరింది.
రోజుల వ్యవధిలో రెండు, మూడు ఘటనల్లో దాదాపు 60 మంది మావోయిస్టులను, సానుభూతిపరులను కాల్చిచంపిన ఘటన వీరత్వానికి నిదర్శనమో, మోసపూరిత హత్యాకాండకు నిదర్శనమో యావత్ సమాజమూ నిర్ధారించాల్సిన విషయం. ఈ ఘాతుక చర్యలన్నింటి లక్ష్యం ఒక్కటే. అపారమైన ఖనిజవనరులకు నిలయమైన దండకారణ్య ప్రాంతం నుంచి ఆదివాసులను, వారికి అండదండగా ఉన్న మావోయిస్టులను ఏరిపారేయడం. ఈ దేశాన్ని ఎంఎన్‌సీలకు, బడా కంపెనీలకు ధారాదత్తం చేయడానికి దళారీ పాలకులు సాగిస్తున్న మంద్రస్థాయి యుద్ధ తంత్రంలో భాగంగానే దీన్ని పరిగణించాలి.
నేడు భారత ప్రభుత్వం తన బిడ్డల్ని తానే చంపుకోవడం సరైందేనా అని ఒక కేసు సందర్భంగా లోగడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది చట్టపరంగా ప్రభుత్వాలు ఏ చర్యలైన చేపట్టవచ్చు కాని అందుకు విరుద్ధమైన మార్గాల్లోకి వెళ్లి నిర్మూలనకు దిగడం తగని పని . కేంద్రప్రభుత్వం ఇవాళ తన సొంత ప్రజలపైనే కార్పెట్ బాంబింగ్‌కు అనుమతించింది.
అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధపద్ధ్దతులను దేశంలోనే నిస్సహాయులు, నిరుపేదలు, నిరక్ష్యరాస్యులు అయిన ఆదివాసీలపైన ప్రయోగిస్తోంది. వాయుసేన హెలికాప్టర్లను దండకారణ్య యుద్ధ క్షేత్రంలో వినియోగిస్తోంది. విలువైన ప్రకృతి సంపదలు, ఆదివాసులు ఉన్న చోటే భద్రతాబలగాలు దాడులు జరుపుతున్నాయి. కొత్త గనులు తవ్వేచోట ఆ కంపెనీల రక్షణ కోసం సీఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పడటం దీనికి రుజువు. గ్రామాల్లో ఇళ్లలో, పంటపొలాల్లో, అడవిలో ఉన్న 8 ఏళ్ల బాలుడి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు పట్టుకొచ్చి కాల్చిచంపి ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని ప్రకటిస్తున్నారు. జీవించే హక్కును కాలరాసి చేస్తున్న హత్యలను ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు అనే కట్టుకథలల్లి ఈ హత్యలకు పాల్పడిన జవాన్లకు అవార్డులు, రివార్డులు, ప్రమోషన్లు ఇస్తున్నారు.
మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోని గడ్చిరోలి, ఇంద్రావతిలో ఏప్రిల్ చివరలో సాయుధ బలగాలు జరిపిన మారణ కాండకు సమర్థనగా కథలు చెప్పడం మాని మావోయిస్టు దళాలను పూర్తిగా తుడిచి పెట్టేశామని ఆ రాష్ట్ర యాంటీ నక్సల్ ఐజీ ప్రెస్ మీట్ పెట్టి మరీ సమర్థించుకున్నాడు. ఈ రెండు చర్యల్లోనే 50 మందికిపైగా మావోయిస్టులు, వారి సానుభూతి పరులను అత్యాధునిక ఆయుధాలు ప్రయోగించి మరీ కాల్చి చంపారు. ఏప్రిల్ 22, 23 తేదీల్లో బామ్రాఘడ్ ఏరియా కర్నసూర్ అడవిలో, రాజారాం ఖాండ్లా అడవిలో వరుసగా 16 మంది, ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసు బలగాలు ప్రదర్శించాయి. 24వ తేదీన ఇంద్రావ తి నదిలో కొట్టుకొచ్చాయంటూ మరో 15 శవాలను బహిరంగపరిచారు. నదిలో మొసళ్లు పీక్కుతినగా మిగిలిన మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది.
మావోయిస్టులైనా, ఆదివాసులైనా మొదటగా వాళ్లు ఈ దేశ పౌరులు, సాటిమనుషులు, మన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, మన బిడ్డలు. మృతుల్లో సగంమంది మహిళలున్నారు. ఇంత సామూహిక మానవ హననం భారత విప్లవోద్యమ చరిత్రలోనే మొదటిది కావచ్చు. ఎన్‌కౌంటర్ జరిగితే పోలీసులకు గాయాలవ్వవా వంటి ప్రశ్నలకు కూడా తావు లేకుండా అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంఛర్లను ఉపయోగించి మావోయిస్టులను మట్టుబెట్టామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయక యుద్ధాల్లో కూడా ఉపయోగించకుండా దశాబ్దాల క్రితం నిషేధం విధించిన మారణాయుధాలను భారత్‌లో ప్రభుత్వ బలగాలు ఉపయోగించడం నేరపూరిత చర్య.
శత్రుసైన్యాలపై కూడా ఆలోచించి వేయవలసిన గ్రెనేడ్ లాంచర్లను సొంత ప్రజలపై పథకం ప్రకారం ప్రభుత్వబలగాలు ఎలా ప్రయోగిస్తాయి? దండకారణ్యంలో మావోయిస్టులు నడుపుతున్న జనతన్ సర్కార్ తన చేతికి బందీలుగా చిక్కిన కలెక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు తిండిపెట్టి వైద్యం చేసి చంపకుండా వదిలిపెడుతున్న కథనాలు ఎన్నోసార్లు వార్తలకెక్కాయి. కానీ జనతన్ సర్కార్ మీద యుద్ధం ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారణహోమం తప్ప తమకేమీ అక్కర్లేదని ప్రకటిస్తున్నారు. దోపిడీపాలనను ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్న భారతప్రజలను కార్పెట్ బాంబింగ్, ఏరియల్ బాంబింగ్ ద్వారా తుదముట్టించాలని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చూస్తున్నాయి.
ఇంద్రావతి ప్రాంతంలో 50 మందికి పైగా విప్లవకారులను, సానుభూతిపరులను కాల్చి చంపడం ఎక్కడికి దారి తీస్తుందో యావత్ సమాజం ఆలోచించాలి. ప్రశ్నించడం, జీవించడం, పోరాడటం అన్నీ మనుషులు సాధించుకోవల్సిన హక్కులే. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ హైకోర్టులు సుమోటోగా గడ్చిరోలి ఎస్పీ, మహారాష్ట్ర ఐజీలపై హత్యానేరం కింద కేసులు పెట్టాలని, వరుస ఎన్‌కౌంటర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరటం కనీస మానవీయ డిమాండుగా ఉంటుంది.
బల్ల రవీంద్రనాథ్
వ్యాసకర్త హైకోర్టు న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment