శతాబ్దాల సంబంధాలకు సవాలు | Atul K Thakur Guest Column On India And Nepal Bilateral Relation | Sakshi
Sakshi News home page

శతాబ్దాల సంబంధాలకు సవాలు

Published Sat, Jul 11 2020 1:54 AM | Last Updated on Sat, Jul 11 2020 1:56 AM

Atul K Thakur Guest Column On India And Nepal Bilateral Relation - Sakshi

భారత్, నేపాల్‌ మధ్య సంబంధాలు వేడెక్కడానికి చైనా ప్రమేయం ప్రధాన కారణం కాదు. శతాబ్దాలుగా ఇరుదేశాల ప్రజల మధ్య ఏర్పడిన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, వ్యాపార బంధాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడంతో ఇరుదేశాల మధ్య సాంప్రదాయిక వ్యాపారం గిడసబారిపోతోంది. సరిహద్దులకు రెండువైపులా ప్రజలు శతాబ్దాలుగా ఏర్పర్చుకుంటూ వచ్చిన సరళ వ్యాపార సంబంధాల స్థానంలో ప్రభుత్వాల మధ్య వ్యాపార సంబంధాలు ప్రబలమవుతూ వస్తున్నాయి. దీంతో వ్యాపార నిబంధనలు, కస్టమ్స్‌ అధికారుల ఒత్తిడి ఇరుదేశాలకు కీలకమైన చిరువ్యాపారంపై దెబ్బతీశాయి. నేపాల్‌ యువతరం ఆకాంక్షలు అలాగే ఉంటున్నాయన్న స్పృహకు అనుగుణంగా ఆధునీకరణను మల్చుకుంటే మళ్లీ ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు చివురించే అవకాశం ఉంది.

అనేక శతాబ్దాల పర్యంతం భారత్, నేపాల్‌ దేశాల మధ్య  ప్రగాఢమైన సామాజిక, సాంస్కృతిక, వ్యూహాత్మక, రాజకీయ, ఆర్థిక సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. కాలం గడిచేకొద్దీ ఇరుదేశాల మధ్య మౌలిక సూత్రాలు మారుతున్న క్రమంలో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంటోంది. అభివృద్ది చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రతిపాదించిన అవకాశాలను నేపాల్‌ అందిపుచ్చుకోవడం రానురాను తగ్గిపోయింది. పైగా సాధారణ నేపాలీలకు ఇవి అసందర్భంగా మారిపోయాయి. ఇరు దేశాలమధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సరిహద్దు సమస్య పాత సంబంధాలను మరింత ఆధునికరూపంలోకి మల్చుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తోంది. సరిహద్దు సమస్యకు మించి భారత్, నేపాల్‌ కలిసి ఎంతో సాధించవచ్చు. 

అదృశ్యమవుతున్న  పాతబంధాలు
భారత్, నేపాల్‌ దేశాలకు చెందిన వేలాదిమంది పౌరులు పనికోసం, వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాల కోసం, వ్యాపార లావాదేవీల కోసం ప్రతిరోజూ సరిహద్దులు దాటుతుంటారు. ఈనాటికీ నేపాల్‌ అతి ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా భారత్‌ కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా చైనా వంటి ఇతర దేశాలు నేపాల్‌ వాణిజ్యంలోకి చొరబడినప్పటికీ నేపాల్‌తో భారతీయ వాణిజ్యం ఇప్పటికీ 60 నుంచి 65 శాతం వరకు ఉంటోంది. ఇరుదేశాల ప్రజలు సరిహద్దులు దాటి మరీ సంబంధాలు ఏర్పర్చుకుంటున్నారు.

వ్యాపార సంస్థలు సైతం ఇరుదేశాల కుటుంబాల్లోని కుమారులు, కుమార్తెలకు పరస్పర వివాహ సంబంధాలు కుదుర్చుకుంటున్నాయి. కుటుంబాలను ప్రాతిపదికగా తీసుకుని విక్రేతలు, సరఫరాదారులు సులువుగా అప్పులు ఇస్తున్నారు. అన్నిటికంటే మించి సరిహద్దుల్లో నగదు అతిసులువుగా పరస్పరం మార్పిడి అవుతోంది. ఇలాంటి హద్దుnజ nటని సంబంధాలు, సాంప్రదాయికంగా ఇరుదేశాల వ్యాపార సంస్థల మధ్య ఇన్నాళ్లుగా నెలకొన్న సరళత, నిష్కాపట్యం అనేవి ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నాయి. చైనా భారత్‌ను పోటీలోంచి తప్పిస్తుండటం వల్ల ఇదంతా జరగటం లేదు. దీనికంటే భారత్‌తో వాణిజ్య సంబంధాలను వ్యాపార నిబంధనలే అధికంగా దెబ్బతీస్తున్నాయి.

కాలం చెల్లుతున్న వ్యాపార ఒప్పందాలు
భారత్, నేపాల్‌ మధ్య వ్యాపార ఒడంబడికలు ఇప్పటికీ పాత నిబంధనలపైనే కొనసాగుతున్నాయి. ఉదాహరణకు, భారత్‌లో తయారవుతున్న ఉత్పత్తులను నేపాలీ వ్యాపారులు తమ దేశంలోకి దిగుమతి చేసుకోరు. మరోవైపున నేటి భారత్‌లో బహుళజాతి కంపెనీలను మిక్కుటంగా ఏర్పాటు కావడమే కాకుండా అవి తమ మొత్తం దక్షిణాసియా ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను భారత్‌లోని కార్యాలయాల నుంచే నిర్వహిస్తున్నాయి. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను నిర్మూలిస్తూ బడా వాణిజ్య సంస్థలు తమ కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరింపచేస్తున్నాయి.

సరిహద్దులను బార్లా తెరిచినప్పటికీ, సంక్లిష్టమైన రెగ్యులేటరీ అవసరాలు ఇరుదేశాల మధ్య ఎగుమతి, దిగుమతులను క్లిష్టంగా మలుస్తున్నాయి. చిన్నతరహా వ్యాపారాన్ని ఇది విశేషంగా ప్రభావితం చేస్తోంది. ఎగుమతి, దిగుమతి కోడ్స్‌ నుంచి ఉత్పత్తి కోడ్‌ల, ఇన్వాయిస్‌ క్లియరెన్స్‌ వరకు వ్యాపార కార్యకలాపాల్లో వాస్తవంగా ఉంటున్న సంక్లిష్టత కారణంగా స్థానిక కస్టమ్స్‌ అధికారులకు విశేష అధికారాలను కట్టబెడుతున్నాయి. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మాత్రమే వ్యాపారం చేసుకునే చిన్న తరహా వ్యాపారులకు కస్టమ్స్‌ అధికారుల బారినుంచి తప్పించుకోవడం కష్టమైపోతోంది. దీంతో ఇరుదేశాల చిన్న తరహా వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీలకు చాలా సమయం తీసుకుంటున్నందున తప్పుకుంటున్నారు. 

సుదీర్ఘకాలంగా లాంచనప్రాయంగా కొనసాగుతూ వచ్చిన ఆర్థిక చట్రం భారత్, నేపాల్‌ మధ్య వాణిజ్యానికి కీలకంగా ఉంటూ వచ్చింది. మారుతున్న పరిస్థితుల్లో ఈ సులభ వ్యాపార పరిస్థితి తనదైన ఆధునికీకరణకు సిద్ధం కావడం లేదు. అయితే ఈ ప్రాచీన తరహా వ్యాపార బంధాలు ఇప్పుడు రద్దు కావడానికి అంగీకరించకూడదు. ఈ పాత సంబంధాలను విధాన నిర్ణేతలు మెరుగుపర్చి, ఆధునీకరించి ప్రజలకు మరింత ప్రయోజనకరంగా, లాభదాయకంగా వాటిని మార్చాలి. ఒకప్పుడు నేపాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఏకైక, అతిపెద్ద వనరుగా ఉంటూవచ్చిన భారత్‌ పెరుగుతున్న చైనా పెట్టుబడుల కారణంగా తన స్థానాన్ని కోల్పోతోంది.

దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి. భారత్, నేపాల్‌ మధ్య సామాజిక, ఆర్థిక బంధాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వేగంగా మార్పు చెందడంలో వెనుకబడిపోయాయి. గతంలో ఇరుదేశాల మధ్య అవకాశాలను గుర్తించి, పెట్టుబడులకు భద్రత కలిగించి, వాటి సులభ చలనానికి వీలు కల్పించిన నిర్దిష్ట సామాజిక, ఆర్థిక అనుసంధానం ప్రస్తుతం వెనుకపట్టు పట్టింది. ఆధునీకరణకు కొత్త మార్గం చేపట్టలేకపోవడమే నేపాల్‌లో భారత్‌ పెట్టుబడుల క్షీణతకు కారణమైంది. రెండు, భారత్‌ ప్రభుత్వం నేరుగా నేపాల్‌లో భారత పెట్టుబడులలో జోక్యం చేసుకోవడం పెరిగేకొద్దీ ఇరుదేశాల ప్రజల మధ్య మధ్య చారిత్రకంగా కొనసాగిన ఆర్థిక బంధాలు మరింతగా క్షీణించిపోయాయి.

నియత, అనియత యంత్రాంగాల ప్రాతిపదికన గతంలో నేపాల్‌లో ప్రవహించిన భారతీయ పెట్టుబడులు భారత ప్రభుత్వ జోక్యంతో గిడసబారిపోయాయి. సరిగ్గా ఈ పరిస్థితే భారత్, నేపాల్‌ మధ్య సంబంధాలను కూడా సంక్లిష్టంగా మార్చివేసింది. ప్రజలు మధ్య సంబంధాలు, సంస్కృతి పరంగా సాగాల్సిన వ్యాపార బంధాలు తప్పుకుని ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాల దిశగా ప్రాధాన్యత పెరిగింది. ఇరుదేశాల మధ్య ప్రభుత్వాల తరపున పెట్టుబడుల తరలింపుకు, లావాదేవీలకు భారత్‌ ప్రాధాన్యమివ్వగా, మరోవైపు చైనా నేరుగా నేపాల్‌ ప్రజలతో తమ సంస్థలను అనుసంధానించగలిగింది. అనేక చిన్న తరహా చైనా సంస్థలు ఇప్పుడు నేపాల్‌లోకి చొరబడ్డాయి. ఇవి స్థానిక భాగస్వాములను తమలో చేర్చుకుని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా బలపడుతూ వస్తున్నాయి.

నేపాల్‌కు సంబంధించినంత వరకు ఇది మారుతున్న యుగం. కొత్త ఆకాంక్షలు, జాగరూకతలు బలం పుంజుకుంటున్నాయి. ఇతర ప్రభుత్వాల లాగే భారత్‌ కూడా నేపాల్‌ నూతన ప్రభుత్వ వ్యవహారాల్లో పాలుపంచుకోవాడానికి ప్రయత్నించింది కానీ మొదటి నుంచి నేపాల్‌తో భారత్‌ సంబంధాలు ప్రభుత్వాల ప్రాతిపదికన మాత్రమే కాకుండా విశాల ప్రాతిపదికన కొనసాగేవి. దీనివల్లే నేపాల్‌ వ్యాప్తంగా అనేకమంది యువతీయువకులతో, సామాజిక బృందాలతో భారత్‌ నేరుగా సంబంధాలు నిర్వహించగలిగింది.

విషాదకరంగా నేపాలీలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడంలో భారత్‌ గతంలో చూపిన చొరవ ఇప్పుడు క్షీణించిపోయింది. భారతీయ ఉన్నత విద్యాసంస్థల్లో నేపాలీ విద్యార్థులకు స్కాలర్‌ షిప్పులు ఇవ్వడం అనేది ప్రతిభ ఆధారంగానే సాగినప్పటికీ నేపాల్‌ రాజకీయ పార్టీల సిఫార్సుల మేరకు ఈ స్కాలర్‌షిప్పులను అందించడం అలవాటుగా మారింది. దీంతో నేపాలీ యువత రాజకీయ ప్రాపకంతో స్కాలర్‌ షిప్పులు సాధించే యంత్రాంగం బలపడిపోయింది. అదేసమయంలో భారత్‌లో అభివృద్ధిని నేపాలీలు అందుకోవడం సంక్లిష్టమైపోయింది.

ఇకపోతే పాఠశాల భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం, అంబులెన్సులు అందించడం వంటి అభివృద్ధి కార్యకలాపాలన్నింటిలో భారత్‌ నేరుగా నేపాలీ స్థానిక సంస్థలు, కమ్యూనిటీలతో సంబంధం పెట్టుకుని భాగం పంచుకునేది. కానీ ఈ ప్రాజెక్టులన్నీ రాజకీయ సంబంధాలతో ప్రభావితమై మంజూరయ్యేవి. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల సాధారణ నేపాలీలకంటే స్థానిక రాజకీయ నేతలు అధిక ప్రయోజనం పొందసాగారు. దీనివల్ల కూడా నేపాలీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు భారత్‌కు దూరమైపోయాయి. అదే సమయంలో నేపాలీల ఆకాంక్షలు చెక్కుచెదరలేదు.

భారత్‌ దీన్ని తప్పక గుర్తించాలి. ప్రథమ ప్రాధాన్యత కింద నేపాల్‌ పట్ల తన భౌగోళిక, రాజ కీయ, ఆర్థిక దృక్పథాన్ని భారత్‌ పునర్నిర్వచించుకోవాల్సి ఉంది. భారత్‌లోని ఆర్థికాభివృద్ధి అందించే అవకాశాలను సాధారణ నేపాలీలు సులువుగా పొందే మార్గాన్ని అన్వేషించాలి. భారతీయ ఆవిష్కరణలతో కనెక్ట్‌ అయ్యే యువ నేపాలీలకు అందుబాటులో ఉండేలా ఆధునిక వాణిజ్య హబ్‌లను భారత్‌ సృష్టించగలగాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నప్పుడే శతాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన విశిష్ట బంధాలు బలంగా ఉంటాయి. భారత, నేపాలల్‌ ప్రభుత్వాలు దీనికి అనుగుణంగా మారి తమ విధానాలను ఆధునీకరించాలి. ప్రజల మధ్య సంబంధాలు తిరిగి బలపడేందుకు దారితీసే అన్ని మార్గాలను ఇరుదేశాలు అన్వేషించాలి.

- అతుల్‌ కె ఠాకూర్, కాలమిస్టు, రచయిత
   విశాల్‌ థాపా, కాలమిస్టు, ఆర్థికవేత్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement