‘నాకు జూన్ 8 వరకు సమీక్షలు చేసే అవకాశం ఉంది’ అని ఈసీని అభ్యర్ధిస్తున్న చంద్రబాబులో ఆ తరువాత నేను ముఖ్యమంత్రిని కాను అనే అభద్రత తొంగిచూస్తోంది. సీఎం కాకపోతే ప్రతిపక్షం నాయకుడవచ్చు, లేకపోతే అసలు తానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. ఇదంతా ప్రజాస్వామ్య దేశంలో సామాన్యమే అని చంద్రబాబు భావించకపోవడం ఆశ్చర్యం. ఆయనకు 2018 డిసెంబర్‌లోనే తాను దిగిపోతున్న కథ అర్థ మయ్యింది. ఆయన మనసులో లేని అనేకమైన చర్యలు ఈ నాలుగు నెలల్లో హడావుడిగా చేశారు. ఇందులో కొన్ని కేసీఆర్‌ని అనుకరించినవి కాగా, కొన్ని వైఎస్ జగన్ పాదయాత్రలోని ఒప్పందాలను పూర్వపక్షం చేయాలని చేశారు. నిజానికి వృద్ధాప్య పెన్షన్ 2 వేలు చేయడంలో వృద్ధుల్లో ఉత్సాహం వచ్చిన మాట నిజం. చంద్రబాబు ఇంకా మిగిలిన అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ. సామాజిక పింఛన్లకు సంబంధించి 2018–19 బడ్జెట్‌లో పెట్టకుండా ఎలా ప్రకటించాడు? ఈనాడు రూ.14,400 కోట్ల మేరకు పెండింగ్ బిల్లులు ఎందుకున్నాయి. నిజానికి వృద్ధులు, వితంతువులు నిరాధారులు అవడానికి కారకుడు చంద్రబాబు కాదా? తమ పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించుకొని ఏదో ఒక ఉద్యోగ మొస్తుందని ఆశపడ్డవారు తాము వృద్ధులైనా తమ పిల్లలు ఉద్యోగస్తులు కాలేకపోయారు.
బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన బాబు మొత్తం ప్రభుత్వోద్యోగ వ్యవస్థను ధ్వంసం చేశారు. దానికితోడు నారాయణ, చైతన్య సంస్ధల దోపిడీకి ద్వారాలు తెరిచాడు. రెండు సంస్థలు భిన్నమైన బినామీ సంస్థల పేరుతో సుమారు 8 వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఏకంగా నారాయణకు మంత్రి పదవి ఇచ్చాడు. ఎందరో విద్యార్థినీ విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొన్నా నారాయణ సంస్థల మీద ఈగ వాలకుండా చూశారు. ప్రభుత్వ విద్య గుండెను నులిమేశాడు. మెదడును తొలిచివేశాడు. సొంత కుల సంస్థగా ప్రభుత్వాన్ని నిర్వహిం చాడు. తెలుగు నేలలో సామాజిక సాంస్కృతిక విద్యా ఆర్థిక వ్యవస్థలనన్నింటినీ ధ్వంసం చేశాడు. అందుకు గాను బూకరింపు భాష నేర్చుకొన్నాడు. తన అసత్యాల ప్రచారానికి కోట్లు ఖర్చుపెట్టి ప్రచార వ్యవస్థను నిర్మించుకొన్నాడు. బాబు ఇటీవల ఎన్నికల నిర్వహణాధికారుల మీద ధ్వజమెత్తడం ప్రారంభించాడు. తన ఓటమికి రేపు ఈసీని సాకుగా చూపాలనేది తన వ్యూహం. ఎన్నో అంశాల్లో ఈసీ తనను నిలదీయవలసి ఉండగా, బాబే ఈసీని నిలదీయడం ఆయన అభద్రతలోని మూడవ అంశం. పైగా చంద్రబాబు రాజకీయంగా తప్ప రాయలసీమకు, ఉత్తరాంధ్రకు పరిపాలనా క్రమంలో పయనించలేదు. ఈనాడు రాయలసీమలో మంచినీళ్ళకు, గంజి నీళ్ళకు అల్లాడడానికి కారకులు బాబు కాదా! బాబుది దయాహీనమైన స్వభావం. రాష్ట్రంలో పిల్లతల్లులు, శిశువులు పౌష్టికాహారలోపంతో కునారిల్లుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 10 శాతం మందికే అందుతుంది. వందకి 58% మంది స్త్రీలు రాష్ట్రంలో రక్తహీనతతో బాధపడుతున్నారు. మరోపక్క వ్యవసాయదారుల్లో జూదం, తాగుడును బాబు పెంచాడు. యువతలో జ్ఞాన సంపదను పెంచవలసిన పాలకుడు తాగుడుకు బానిసలను చేశాడు. ఆహారోత్పత్తిని దెబ్బతీశాడు.
రాష్ట్రంలో సబ్‌ప్లాన్ నిధులను తన సొంత కార్యక్రమాలకు చంద్రబాబు తరలించారు. సబ్‌ప్లాన్ నిధులతో దళితులకు భూమి కొని ఇవ్వడంకాని, ఇళ్ళ స్ధలాలు, శ్మశాన భూములు ఇవ్వలేదు. దళితులు గ్రామాల్లో విశాలంగా ఉండడానికి వీలు లేదని నిర్దేశించాడు. దళితులు చనిపోతే పూడ్చడానికి çశ్మశాన భూములు రాష్ట్రంలో 80 శాతం దళితవాడలకు లేవు. అంతరానితనం స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో నిరంతరాయంగా కొనసాగుతోంది. 18,000 బ్యాక్‌లాగ్‌లు పూరించకపోవడంలోనే ఆయన కుల వివక్ష కొనసాగుతుంది. చంద్రబాబు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఆత్మాశ్రయం రాష్ట్ర ప్రజల ఊపిర్లను పీల్చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పాలిం చని చంద్రబాబు వంటి పాలకులను ప్రజలు గద్దె నుంచి దించేస్తారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా జనం చైతన్యవంతంగానే వుంటారు. చంద్రబాబు ఈ వాస్తవాన్ని గుర్తించలేదు. ఆయన ఇప్పుడు అవినీతి అభద్రత ఊబిలో వున్నారు. అందుకే అస్థిరంగా అపవాక్యాలు మాట్లాడుతున్నారు. ప్రజలు సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక, రాజకీయ పునరుజ్జీవనం కోసం నియంతలైన పాలకులపై నిరంతరం పోరాటం చేయాలి. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కుల్ని కాపాడుకోవాలి. పాలకులు విసిరే ఏ మాయాజాలానికీ లొంగిపోని వ్యక్తిత్వాన్ని ప్రజలు కలిగివుండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం భారతదేశంలో మనగలుగుతుంది. ఆ దిశగానే పయనిద్దాం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త సామాజిక తత్వవేత్త,
నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ 98497 41695
అభద్రత, అవినీతి ఊబిలో చంద్రబాబు
Published Tue, Apr 30 2019 12:55 AM | Last Updated on Tue, Apr 30 2019 12:55 AM
Comments
Please login to add a commentAdd a comment