బాధ్యతతోనే ఆన్‌లైన్‌ భద్రత | Divij Joshi Writes Guest Columns On Cyber Security | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 4 2019 2:06 AM | Last Updated on Fri, Jan 4 2019 2:06 AM

Divij Joshi Writes Guest Columns On Cyber Security - Sakshi

ఆన్‌లైన్‌ వేదికల్లో చట్టవిరుద్ధమైన క్రియాశీలక అంశాలను నియంత్రించడమే ప్రధాన అంశం. ఇందుకు ఆయా అంశాల చట్టబద్ధతను గుర్తించే స్థితిలో మధ్యవర్తులు ఉండాలి. దీనిపై అవగాహన లేకుండా ఆయా అంశాలను సెన్సార్‌ చేయడం అసాధ్యం.  అత్యాధునిక ఫిల్టరింగ్‌ సాంకేతికత కూడా చట్టసమ్మతమైన అంశాలను సెన్సార్‌ చేసి, చట్టవిరుద్ధమైనవాటిని వదిలేస్తూంటుంది. నియంత్రణ బాధ్యతను మధ్యవర్తులు స్వీకరించడం ప్రమాదకర స్థాయికి చేరుకుని మన ఆన్‌లైన్‌ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్రిమినల్‌ చర్యలకు గురవుతామనే ఉద్దేశంతో ప్రైవేట్‌ వ్యక్తి, ప్రభుత్వ అధికారిఅనే తేడాలేకుండా ఫిర్యాదు అందితే ఎటువంటి అంశాలనైనా తొలగించివేస్తున్నారు.

వివిధఇంటర్నెట్‌ సంస్థలు,ఫేస్‌బుక్,ట్విట్టర్‌ వంటి సామాజికమాధ్యమాలతో ‘రహస్య సంప్రదింపులు’ జరిపి సమాచార సాంకేతిక(ఐటీ) చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ముసాయిదా దాన్ని మరింత అస్పష్టతలోకి నెడుతోంది. టెలికాం సంస్థలు, ఆన్‌లైన్‌ వేదికలను ‘మధ్యవర్తులు’గా పేర్కొంటూ రూపొందిన ఐటీ చట్టం ఇప్పటికే సుదీర్ఘంగా, అస్పష్టతతో నిండి ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఐటీ శాఖ ముసాయిదా సవరణలు ఆమోదం పొందితే దేశంలో ప్రై వేటు సెన్సార్‌షిప్‌ మొదలవుతుంది. భావ ప్రకటనాస్వేచ్ఛపై ప్రై వేటు నిఘా పెరుగుతుంది. పైగా ఆన్‌లైన్‌ ప్రపంచం వాస్తవంగా ఎదుర్కొంటున్న అప్రజ్వామిక, అభద్రత సమస్యల జోలికి మాత్రం ఇది పోవడం లేదు. ఈ ముసాయిదాను వెనక్కు తీసుకోవడమేకాక ఆన్‌లైన్‌ వేదికల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూడమని ప్రభుత్వాన్ని అందరూ కోరడం తక్షణావసరం.  

టెలికాం కంపెనీలవంటి ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, ఆన్‌లైన్‌ వేదికలైన ఫేస్‌బుక్, ట్వీటర్‌వంటి ‘మధ్యవర్తుల’కు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79 రక్షణ కల్పిస్తోంది. కనుక ఈ సర్వీసుల్ని ఉపయోగించుకునే మూడో పక్షంవారు ఉపయోగించే పదాలకూ లేదా చర్యలకూ ఈ సంస్థలు నేరుగా బాధ్యులు కాకుండా ఆ నిబంధన కాపాడుతోంది. ఈ నిబంధనే లేకపోతే చట్టవిరుద్ధమైన అంశాల విషయంలో మధ్యవర్తి సంస్థలపై సివిల్‌ లేదా క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి పుష్కలంగా అవకాశం ఉంటుంది. దీని పర్యవసానమేమంటే అత్యంత నియంత్రిత ఇంటర్నెట్‌ వ్యవస్థ రూపొందుతుంది. ఆన్‌లైన్‌ వేదికలు, ఇతర సర్వీసులు విస్తతమైన సెన్సార్‌షిప్‌కు సిద్ధపడతాయి. ఆన్‌లైన్‌ వినియోగదారులు పోస్టు చేసే అంశాలపై నిఘా పెడతాయి. ఆ రకంగా ఒక ప్రై వేటు నిఘా వ్యవస్థ రూపొందుతుంది.  

ఎగ్జిక్యూటివ్‌ రూపొందించిన రూల్స్‌తో పోల్చి చూసి, చురుకుగా పరిశీలించి, వాస్తవాల ఆధారంగా చట్టవిరుద్ధమైన సమాచారాన్ని తొలగించినప్పుడే సెక్షన్‌ 79 మధ్యవర్తులకు రక్షణ కల్పిస్తుంది. మధవర్తులకు మార్గదర్శక సూత్రాలపేరిట 2011లో ఈ నిబంధనలను రూపొందించారు. ప్రమాదకరమైన, వేధింపులకు గురిచేసే, పరువు నష్టం కలిగించే, అశ్లీల, నగ్న, మరొకరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే, ద్వేషపూరితమైన, నైతిక విరుద్ధమైన, జూదాన్ని ప్రోత్సహించే లేదంటే మరేవిధంగానైనా చట్టవిరుద్ధమైన అంశాలు వేటినైనా తొలగించడానికి ఈ నిబంధనలు దోహదం చేస్తాయి.  

సెక్షన్‌ 79, 2011 నిబంధనల్లోని అస్పష్టత కారణంగా తాము ఎప్పుడు బాధ్యులమవుతామో తెలియక సెన్సార్‌ చేసే వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. క్రిమినల్‌ చర్యలకు గురవుతామనే ఉద్దేశంతో ప్రైవేట్‌ వ్యక్తి, ప్రభుత్వ అధికారి అనే తేడా లేకుండా ఫిర్యాదు అందితే చాలు ఎటువంటి అంశాలనైనా తొలగించివేస్తున్నారు. అయితే, శ్రేయా సింఘాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు దీనిని తోసిపుచ్చింది. న్యాయ ఆదేశం లేదంటే తగిన  ప్రభుత్వ నోటిఫికేషన్‌వంటి వాస్తవమైన ఆధారాలు సెక్షన్‌ 79 కింద అవసరమవుతాయని కోర్టు స్పష్టం చేసింది. గూగుల్, ఫేస్‌బుక్‌ వంటివి ఆయా అంశాల చట్టబద్ధతను నిర్ధారించడం, తమ వేదికలపై వాటిని వడబోయడంలో వుండే క్లిష్టతను, ప్రమాదాన్ని కోర్టు గుర్తించింది. 

ఇటీవలి అంశాలు మధ్యవర్తులను బాధ్యులను చేయడంపై భారత ప్రభుత్వం పునరాలోచించుకునేలా చేశాయి. ఫేస్‌బుక్‌లో కేంబ్రిడ్జ్‌ అనలైటికా ఎన్నికల వ్యవహారంలో వేలుపెట్టడం, వాట్సాప్‌ తప్పుడు సమాచారంవంటి అంశాలపై మాత్రమే ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. సుప్రీంకోర్టు చేతులు కట్టేయడంతో  చట్టవ్యతిరేక ప్రసంగాలను మధ్యవర్తులు తగ్గించాలని ప్రభుత్వం ముందుకొచ్చింది. మధ్యవర్తులు సాంకేతికతకమైన స్వయం నియంత్రిత సాధనాలు లేదా అందుకు తగినటువంటి విధానం, తగినటువంటి నియంత్రణల ఆధారంగా చట్టవిరుద్ధమైన సమాచారంగానీ, అంశాలను గానీ గుర్తించి, తొలగించడానికి నెలకొల్పాలని రూల్‌ 3(9)లో పేర్కొనడం జరిగింది. 

దీంతోపాటు సమాచారాన్ని ఇతరులు పొందే వీలులేకుండా వాట్సాప్‌ అనుసరిస్తున్న ఎండ్‌ టు ఎండ్‌ ఎన్క్రిప్షన్‌ను దృష్టిలో పెట్టుకుని సమాచారం మూలాన్ని తెలుసుకునే అవకాశం మధ్యవర్తులకు కల్పించే విధంగా నిబంధనలను సడలించాల్సి ఉంది. సమాచారం మూలాన్ని తెలుసుకునే వెసులుబాటును వ్యతిరేకించేప్పుడు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 69కింద ఇప్పటికే ఈ వెసులుబాటు మధ్యవర్తులకు కల్పించిన విషయాన్ని గుర్తించాలి. అయితే, సమాచారాన్ని డీక్రిప్ట్‌ చేయడంలో అస్పష్టత, సురక్షితం కాకపోవడం వంటి అంశాలు చాలా వరకు చట్టవిరుద్ధమైనవేగాక, ప్రాథమిక గోప్యతా హక్కుపై సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకమైనవి.  

చట్టవిరుద్ధమైన క్రియాశీలక అంశాలను నియంత్రించడమే ప్రధాన అంశం. ఇందుకు మొదట ఆయా అంశాల చట్టబద్ధతను గుర్తించే స్థితిలో మధ్యవర్తులు ఉండాలి. ఇది పూర్తిగా న్యాయపరిధిలోని అంశం. దీనిపై అవగాహన లేకుండా ఆయా అంశాలను సెన్సార్‌ చేయడం అసాధ్యం. అలాగే న్యాయపరమైన అవగాహన అవసరం లేని నిగ్రహంతో కూడిన అంశాల చట్టబద్ధతను నిర్ణయించడం కూడా ప్రైవేట్‌ సెన్సార్షిప్‌లో భాగంగా రాజ్యాంగ విరుద్ధమవుతుంది.అంతేగాక, స్వయం నియంత్రిత సాధనాలు కేవలం చట్టవిరుద్ధమైన అంశాలను మాత్రమే నియంత్రించగలవని విశ్వసిస్తాం. కానీ, వాస్తవం వేరుగా ఉంటుంది. అత్యాధునిక ఫిల్టరింగ్‌ సాంకేతికత కూడా చట్టసమ్మతమైన అంశాలను సెన్సార్‌ చేసి, చట్టవిరుద్ధమైనవాటిని వదిలేస్తూంటుంది. 

భారత్‌లో మధ్యవర్తులు బాధ్యతవహించాలనే అంశంపై రూపొందించిన నిబంధనలు కొంత ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆ నిబంధనలపై అటు ప్రభుత్వం, ఇటు కోర్టులు పెనుగులాడుతున్నాయి. శ్రేయా సింఘాల్‌ కేసు అనంతరం కోర్టు ఆదేశాలతో మాత్రమే ఆయా అంశాలను తొలగించాల్సి ఉంది. అయితే సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ కారణంగా మధ్యవర్తులు తమ వేదికలపై నుంచి చట్టవిరుద్ధమైన అంశాలను తొలగించడంలో అలసత్వం చూపడంతో అవి వినియోగదారులపైకి వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ యాక్ట్‌లోని అంశాలను పక్కనబెట్టి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆటో బ్లాకింగ్‌ను సుప్రీంకోర్టు అనుమతించింది. కొత్త ముసాయిదా నిబంధనల్లో ఉన్న ఈ అంశం ఇవే కారణాల వల్ల ప్రమాదకరమైనది.  

ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్‌లు తమను తాము నిష్పాక్షికమైన మధ్యవర్తులుగా చూపుకుంటున్నప్పటికీ ఆయా అంశాల సెన్సార్, వడబోత, ప్రాధాన్యత, తొలగింపు అనేవే వాటి ప్రాథమిక అంశాలు.  ఈవిధంగా చట్టపరమైన నిబంధనలు అడ్డుపడకపోవడంతో వినియోగదారుల అంశాలను నియంత్రించే బాధ్యతను మధ్యవర్తులు స్వీకరించడం ప్రమాదకర స్థాయికి చేరుకుని మన ఆన్‌లైన్‌ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాజకీయ ప్రకటనలతో తప్పుదారి పట్టించడానికి ఫేస్‌బుక్‌ ప్రాధాన్యతనిస్తుంటే, అట్టడుగు వర్గాలవారిపై జరుగుతున్న హింసపై స్పందించడంలో ట్విట్టర్‌ విఫలంకావడం ఆన్‌లైన్‌ వేదికలను మరింత ప్రజాస్వామికీకరించాల్సిన ఆవశ్యకతను, వాటిని బాధ్యులుగా చేయాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి.  

ఆన్‌లైన్‌ వేదికలను బాధ్యులను చేసే, పారదర్శకతను పెంచే విషయంలో ఐటీ రూల్స్‌ ముసాయిదా ఎటువంటి పరిష్కారం చూపకపోవడంతోపాటు; పబ్లిక్‌ అంశాలపై వారి ప్రైవేట్‌ సెన్సార్షిప్‌ను మరింత బలోపేతం చేసే విధంగా ఉన్నాయి. మధ్యవర్తుల ప్రైవేట్‌ సెన్సార్‌పై చట్టపరమైన జోక్యమైనా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఆయా అంశాలను నియంత్రించడంపై వారు తీసుకుంటున్న చర్యలు మరింత పారదర్శకంగా వుండేలా, నివేదికలు వెల్లడించేలా చేయడానికి చట్టం జోక్యం చాలా అవసరం.

తమ వేదికలపై ఆయా అంశాలను నియంత్రించడంలో వారిని బాధ్యులను చేయడం ద్వారా వారు ఒక విధానాన్ని అనుసరించేలా చేయొచ్చు. అసంబద్ధమైన, చట్టవిరుద్ధమైన ప్రవర్తన గురించి వినియోగదారులకు తెలియజేయడం, దాన్ని నియంత్రించడానికి తీసుకున్న చర్యలను వివరించడం వంటి ఒక విధానాన్ని వారు రూపొందించుకునే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడే సురక్షితమైన, ప్రజాస్వామికమైన ఆన్‌లైన్‌ స్పేస్‌ వినియోగదారులకు లభిస్తుంది. అంతేగానీ, ప్రభుత్వమో, ఆన్‌లైన్‌ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లో ముందు నిలబడి చట్టవిరుద్ధమైన అంశాలను అడ్డుకోవడం వల్ల కాదు.  

ఈ విషయమై మీ అభిప్రాయాలను కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు ఈ నెల 15లోగా తెలియజేయవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని సెన్సార్షిప్‌ను వ్యతిరేకిస్తూ సురక్షితమైన, ప్రజాస్వామికమైన ఆన్‌లైన్‌ కమ్యూనిటీని పొందవచ్చు.  


వ్యాసకర్త: దివిజ్‌ జోషి, రీసెర్చ్‌ ఫెలో, విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ, బెంగళూరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement