తెలుగు భాషా సంస్కృతులు కాపాడండి! | Doctor GV Purnachand Article On Telugu Language And Culture | Sakshi
Sakshi News home page

తెలుగు భాషా సంస్కృతులు కాపాడండి!

Published Wed, Jun 19 2019 2:45 AM | Last Updated on Wed, Jun 19 2019 2:45 AM

Doctor GV Purnachand Article On Telugu Language And Culture - Sakshi

2004 నుండీ తెలుగునేల నలుమూలలా భాషోద్యమం విస్తరించేందుకు నాటి ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారి సానుకూల స్పందన గొప్పది. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ప్రభృతులతో అప్పటికప్పుడు ఒక సాధన సమితిని ఏర్పాటుచేసి, ఆనాటి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తెలుగు భాషకు ప్రాచీనతా హోదా సాధించి ఇచ్చారాయన. భాషోద్యమ స్ఫూర్తిని తరువాతి ప్రభుత్వాలు అందుకోలేక పోవడంవల్ల తెలుగు భాషాసంస్కృతులకు తీరని అన్యాయం జరిగింది. ఆధునిక సాంకేతిక ఉపకరణాలను ఇంగ్లిష్‌తో సమానంగా ఉపయోగించే విధంగా తెలుగును ‘ప్రపంచ తెలుగు’ గా తీర్చిదిద్దే కార్యాచరణ వైఎస్సార్‌ కాలంలోనే ప్రారంభమైంది. తెలుగు భాషపట్ల రాజశేఖరరెడ్డిగారు చూపించిన మమకారం చిరస్మరణీయం.  

‘సాంకేతిక తెలుగు’, ‘ప్రపంచ తెలుగు’ అనేవి భాషోద్యమ చిరకాల స్వప్నాలు. భాషోద్యమ ప్రముఖులు గట్టి ఒత్తిడి తేవటంతో 2016లో నాటి ప్రభుత్వం తెలుగు భాషాపరిరక్షణకు సూచనలు చేసేందుకు ఒక కమిటీని నియమించింది. భాషకు అవమానం చేసేవారిని శిక్షించే అధికారాలతో తెలుగు ప్రాధికార సంస్థను ఏర్పాటుచేయవలసిందిగా ఆ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. అలాగే 7 అకాడమీల పునర్నిర్మాణాన్ని కూడా ఈ కమిటీ ప్రతిపాదించింది. మూడేళ్ల కాలంలో ఈ కమిటీ సూచనలు ఆచరణకు నోచుకోలేకపోయాయి.  

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, గ్రంథాలయ సంస్థ, తెలుగు అభిలేఖ భాండాగారం (ఆర్కయివ్స్‌), ప్రాచ్యలిఖిత భాండాగారం లాంటి సంస్థ లను, వాటి ఆస్తులను, వాటి సంపదను ఆంధ్రప్రదేశ్‌ తన వాటాగా తెచ్చుకోలేకపోవటం వలన అవి ఎవరికో పుట్టిన బిడ్దలుగా నిరాదరణ పాలయ్యాయి. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాల విషయంలో ఆంధ్రప్రదే శ్‌కు చెందినవారికి అన్యాయం జరుగుతుంటే ఊరక చూస్తూనే ఐదేళ్లూ గడిచిపోయాయి. 

భాషాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలన్నీ ‘తెలుగు  ప్రాధికార సంస్థ’ అధీనంలో వివిధ విభాగాలుగా ఒకే గొడుగు కింద ఏర్పరిస్తే, పరస్పర సమన్వయంతో పని చేయటం సాధ్యం అవుతుంది. అధికార భాషగా తెలుగు అమలు, తెలుగు అకాడ మీని భాషాభివృద్ధి విభాగంగా ప్రాధికార సంస్థ పరిధిలోకి తెచ్చి తెలుగు పాఠ్యాంశాల నిర్ణయంలో కీలక పాత్ర వహించేలా చూడటం, ‘ఇ–తెలుగు’ సాంకేతిక విభాగం, తమిళ వర్చువల్‌ అకాడమీ పద్ధతిలోనే ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగువారికి తెలుగు నేర్పించి, ప్రాథమిక, మాధ్యమిక పద్ధతిలో సర్టిఫికేట్‌ కోర్సులు నిర్వహించే విభాగం, తెలుగులోంచి ఇతర భాషల్లోకి, ఇతర భాషల్లోంచి తెలుగులోకి అనువాద విభాగం, ప్రచురణల విభాగం, గ్రంథాలయ వ్యవస్థలను కూడా ఈ ప్రాధికార సంస్థ పరిధిలోకి తీసుకురావాలనే సూచనలను గత ప్రభుత్వం మౌలికంగా ఆమోదించింది. వాటిని ఆచరణలోకి తేవలసిందిగా ప్రార్థన. 

తెలుగు భాషోద్యమం ప్రా«థమిక విద్యను తప్పనిసరిగా విద్యార్థుల మాతృభాషలోనే బోధించాలని, పై చదువుల కొచ్చేసరికి, తెలుగు నేలమీద నడుస్తోన్న ప్రతీ విద్యాలయంలోనూ, హైస్కూలు స్థాయి నుండీ ఉన్నత స్థాయి వరకూ, ఇంజనీరింగ్, మెడిసిన్లతో సహా అన్ని కోర్సులలోనూ తెలుగును ఒక బోధనాంశం చేయాలని తెలుగు భాషా పరిరక్షణ కమిటీవారు సూచించారు. ఇది యునెస్కో వారు సూచిస్తున్న ప్రమాణం. ప్రభుత్వాలు, విద్యాలయాలు కూడా దీనికి బద్ధులు కావాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ వెబ్‌సైట్లను తెలుగులోకి అనువదించే పని చేపట్టాలి. వాటిలోని సమాచారం మొత్తాన్ని తెలు గులో పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్‌ చేయాలి.  

అంతర్జాలంలో తెలుగు వ్రాయటానికి, చదవటానికి, చూడటానికి తగిన రీతిలో బ్రౌజర్లు తయారు కావాలి. ప్రాంతాలకతీతంగా తెలుగు ప్రజలందరూ మాట్లాడే ప్రతీ మాటనీ, దాని ఆంగ్లార్థం, ప్రయోగాలతో సహా ఒక మహానిఘంటువు(లెక్సికాన్‌)ని రూపొందించటం, దానిని డిజి టలైజేషన్‌ చేయటం తక్షణ అవసరం. 1985 నుండీ అకాడమీల పునరుద్ధరణకోసం చేసిన పోరాటాల ఫలితంగా పుట్టిన ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ, సంగీత నాట్య అకాడమీ, గ్రామీణ కళల అకాడమీ, సైన్సు అకాడమీలు పుడు తూనే అనాథలయ్యాయి. ఒక్క నాటక అకాడమీ తప్ప తక్కిన అకాడమీలకు కార్యవర్గాలను ఏర్పరచిన మర్నాడే ఎన్నికల కోడ్‌ రావడంతో వాటి కాళ్లూ చేతులు కట్టేసి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టయ్యింది. భాషా సంస్కృతులకు సేవచేసినవారే చరితార్థులై నిలిచారు. తెలుగులోనే పాలించండి తెలుగు వెలుగై జీవించండి! తెలుగుతల్లిని మనం కాపాడితే తెలుగుతల్లి మనల్ని కాపాడుతుంది.
-వ్యాసకర్త : డా. జి. వి. పూర్ణచందు, ప్రముఖ వైద్యులు, సాహితీవేత్త

మొబైల్‌ : 94401 72642

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement