
భారత రాజ్యాంగ నిర్మాతగా పేరొందిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. భారతదేశంలో నెలకొన్న సామాజిక అసమానతల్ని చక్కదిద్దడానికి వివిధ రాజ్యాంగ హోదాల్లోనే కాదు, పాత్రికేయాన్ని సైతం ఆయుధంగా వాడిన ఆచరణశీలి. డాక్టర్ అంబేడ్కర్ పాత్రికేయునిగా బహిష్కృత కులాలను విముక్తి చేసి ప్రబుద్ధ భారతాన్ని ఆవిష్కరించేందుకు ఎనలేని కృషి చేశారు. అందుకు ఆయన సొంతంగా పత్రికలు స్థాపించారు. దేశవిదేశీ పత్రికల్లో రచనలు చేశారు. 1920 జనవరి 31న ప్రారంభించిన ‘మూక్‌నాయక్’ పత్రికకు శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్రారంభంలో అంబేడ్కర్ జర్నలిజం మీద దేశవ్యాప్తంగా చర్చ మొదలయింది. బెంగాల్ కేంద్రంగా రాజారామ్మోహన్‌రాయ్ బ్రహ్మసమాజ్ ద్వారా చేపట్టిన సంఘసంస్కరణ మీద ఆయన నిర్వహించిన పత్రికల మీద అంబేడ్కర్ అధ్యయనం చేశారు. మహారాష్ట్ర కేంద్రంగా జ్యోతిరావ్‌ఫూలే సత్యశోధక్ సమాజ్ ద్వారా చేపట్టిన సామాజిక పునర్నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. కృష్ణారావు బాలేకర్ సంపాదకత్వంలో 1877లో ఫూలే స్థాపించిన ‘దీనబంధు’ పత్రిక ఎజెండాను తదనంతర కాలంలో కొనసాగించింది అంబేడ్కరే.
మహర్, మాంగ్, చారుదర్, భంగీ, థేచ్ తదితర అంటరానికులాలను బాహ్యసమాజంలోకి తీసుకురావడానికి ఫూలే చేసిన కృషిని అంబేడ్కర్ తలకెక్కించుకున్నారు. ఇంకా ప్రపంచవ్తాప్తంగా జరిగిన అనేక సామాజిక ఉద్యమాలను ఆయన సుస్పష్టంగా అధ్యయనం చేశారు. తాను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివిన రోజుల్లో బ్రిటిష్ పత్రికలన్నింటినీ పరిశీలించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో అమెరికా పత్రికలతో పాటు ఇతర విదేశీ పత్రికలన్నింటినీ తన పరిశోధనలో భాగంగా అధ్యయనం చేశారు. డాక్టర్ అంబేడ్కర్ 27 సెప్టెంబర్ 1951న కేంద్ర మంత్రిగా రాజీనామా చేశారు. అక్టోబర్ 10న పార్లమెంటు బయట పాత్రికేయులకు తన రాజీనామాకు గల కారణాలను చదివి వినిపించారు. ఆయన ముఖ్యంగా మూడుకారణాలను చెప్పారు. వీటిలో రెండు సామాజిక, రాజకీయకారణాలు కాగా, మూడోది పత్రికల వ్యవహారశైలి. తన రాజీ నామా విషయంలో అవాస్తవాలను ప్రచురించిన పత్రికల తీరుపట్ల ఆయన విస్మయం చెందారు. ఈ సందర్భంలోనే అణగారిన కులాల విమోచన కోసం నాలుగు పత్రికలకు సంపాదకత్వం వహించిన అనుభవంతో అప్పటి పత్రికలకు కొన్నిసూచనలు చేశారు.
డాక్టర్ అంబేడ్కర్ తన ‘మూక్‌నాయక్’ పత్రిక తొలిసంపాదకీయంలో బొంబాయి ప్రెసిడెన్సీలో నడుస్తున్న పత్రికల తీరుతెన్నులను విశ్లేషించారు. ఇవి అణగారిన కులాల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని ఆయన నిరసించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ దేశంలోని నిమ్నకులాలకు పత్రికలు అవసరమని తాను భావించానన్నారు. నిమ్నకులాలకు న్యాయం జరగాలన్నా, భవిష్యత్‌లో చేపట్టబోయే హక్కులపోరాటాలకు గొంతుగా పత్రికల అవసరం ఎంతైనా ఉందన్నారు. అంటరానివారిపై జరుగుతున్న అన్యాయాలను ప్రపంచానికి తెలియజేయడానికి, వారి విముక్తి సాధనకు ‘మూక్‌నాయక్’ పత్రిక ప్రారంభిస్తున్నట్టు ఆయన వెల్ల డించారు. ఈ సందర్భంలో కులవ్యవస్థకు అండగా నిలుస్తున్న పత్రికలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక్కడ సమాజాన్ని ఒకనావతో పోల్చారు. నావకు చిల్లుపడితే నావ మొత్తం మునిగిపోతుంది.
కారకులు ఎవరైనాగాని మునిగి పోతారు. అలాగే పత్రికలు స్వలాభం కోసం స్వార్ధంతో వ్యవహరిస్తే మొత్తం సమాజం మునిగిపోతుందన్నారు. డాక్టర్ అంబేడ్కర్ 3 ఏప్రిల్, 1927న ‘బహిష్కిృత్ భారత్’ పత్రికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాసిన సంపాదకీయంలో పత్రికారంగం అంతా నిమ్నకులాల ఆకాంక్షలకు తలుపులు మూసేసిందని ఎద్దేవా చేశారు. ఇక్కడ పత్రికారంగంలో వార్తలు విశేషాలు అవుతాయని, ఆలోచనలు ఆవేశాలకు దారితీస్తాయని, బాధ్యతగల పౌరులకు విజ్ఞప్తి చేస్తే బాధ్యతలేనివారు భావోద్వేగానికి గురవుతున్నారన్నారు.
తన మూడవపత్రికగా అంబేడ్కర్ 29 జూన్ 1928న ‘సమత’ పత్రికను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొన్నివిషయాలను సభాముఖంగా ఆయన పేర్కొన్నారు. బహిష్కృతకులాలకు ఏ చిన్నప్రచారం కల్పించాలన్నా కాంగ్రెస్ అవకాశం లేకుండా చేయడాన్ని అంబేడ్కర్ నిరసించారు. పత్రిక పెట్టడానికి ఆర్ధిక స్తోమత లేని, ఎటువంటి వనరులులేని మనుషులుగా వీళ్ళు మిగలడం బాధాకరమన్నారు. పత్రికావ్యవస్థ ఒకే సామాజికవర్గం చేతిలో బందీ అయిపోయిందనన్నారు. దీనికి ‘అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా’లో మొత్తం ఉద్యోగులంతా మద్రాస్ బ్రాహ్మణులే ఉండటాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.
డాక్టర్ అంబేడ్కర్ 25 నవంబర్ 1930న ‘జనతా’ పత్రికను ప్రారంభించారు. దీని తొలిసంపాదకీయంలో వ్యవస్థీకృతమైపోయిన అసమానతల గురించి చర్చించారు. ‘ఏవ్యక్తి అయినా భారతదేశ భౌతికసమాజాన్ని పరిశీలిస్తే నిస్సంకోచంగా ఈ దేశం అసమానతలకు పుట్టినిల్లుగా కనిపిస్తుంది. ప్రపంచంలో తెల్లవాళ్ళు, నల్లవాళ్ల మధ్యే వివక్ష కనిపిస్తుంది. కానీ ఇక్కడ చాలా రూపాల్లో అది మనిషిని మనిషిగా జీవిం చనీయడానికి తగిన అనుకూల పరిస్థితుల్లేవని స్పష్టం చేస్తుంది’ అని వివరించారు. డాక్టర్ అంబేడ్కర్ 1920 నుంచి 1956 వరకు 36 ఏళ్ళు పాత్రికేయం చేశారు. ఆయన అయిదు మరాఠీ పక్షపత్రికల్ని నడిపారు. 1920 జనవరి 31న ‘మూక్‌నాయక్’, 1927 ఏప్రిల్ 3న ‘బహిష్కిృత్ భారత్’, 29 జూన్ 1928న ‘సమత’, 25 నవంబర్ 1930న ‘జనతా’ పత్రికను ప్రారంభించారు. 4 ఫిబ్రవరి 1956న డాక్టర్ అంబేడ్కర్ బౌద్ధం వైపు పయని స్తున్న నేపథ్యంలో ‘ప్రబుద్ధభారత్’ పత్రికను ప్రారంభిం చారు. అదే ఏడాది డిసెంబర్ 6న అంబేడ్కర్ మరణించారు. మూక్‌నాయక్ నుంచి ప్రబుద్ధభారత్ వరకూ ఆయన ప్రస్థానం ఎన్నో ఆలోచనలు, పోరాటాలతో సాగింది. పాత్రికేయునిగా ఎన్నోవిజయాలతో తన సామర్థ్యాన్ని చాటారు. ఆయన సామాజిక చింతన చిరస్మరణీయం, ఆచరణీయం.
(నేడు డాక్టర్ అంబేడ్కర్ 129వ జయంతి)
డాక్టర్ జీకేడీ ప్రసాద్
వ్యాసకర్త ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
మొబైల్ : 93931 11740