ప్రైవేట్‌ విద్య నాగరికతకే ప్రమాదం | Guest Column By Haragopal Over Study | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ విద్య నాగరికతకే ప్రమాదం

Published Fri, Sep 21 2018 1:38 AM | Last Updated on Fri, Sep 21 2018 1:41 AM

Guest Column By Haragopal Over Study - Sakshi

హరగోపాల్‌, చుక్కా రామయ్య తదీతరులు

విశ్లేషణ

విద్యారంగానికి పునాది, మూలస్తంభం పాఠశాల విద్య. కేజీ టు పీజీ అని కేసీఆర్‌ అన్నప్పుడు స్కూల్‌ విద్య పూర్వవైభవాన్ని పొందుతుందని ఆశించాం. విద్యారంగం ప్రక్షాళన చెంది ప్రభుత్వ పాఠశాలలు కొత్త భవనాలతో, అన్ని ఆధునిక హంగులతో అర్హులైన ఉపాధ్యాయినీఉపాధ్యాయులతో కళకళలాడుతాయని అనుకున్నాం. కార్పొరేటు స్కూళ్లను రద్దుచేసి లేదా ప్రభుత్వపరం చేసి, ప్రభుత్వ స్కూళ్లను పరిపుష్టం చేస్తారని భావించాం. ఇవేవీ జరగలేదు. గత నాలుగేళ్లలో కార్పొరేటు స్కూళ్ల సంఖ్య పెరిగిందే తప్ప తరగలేదు. ప్రైవేటు స్కూళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్య ప్రైవేటీకరణ మానవ నాగరికత పరిణామానికే ప్రమాదం అని మనందరం గ్రహించాలి.

విద్యను ప్రభుత్వరంగం నుంచి తప్పించి ప్రైవేట్‌పరం చేయడం ప్రపంచీకరణలో భాగం. దేశ వ్యాప్తంగా ఈ ధోరణి ప్రబలిపోయిన నేపథ్యంలో తెలంగాణలో కేజీ టు పీజీ దాకా ఉచిత విద్య అనే భావనను ప్రవేశపెట్టడం నిజంగానే సాహసోపేతమైన చర్య. ఇది విద్యను సంపూర్ణంగా ప్రభుత్వరంగంలోకి తీసుకువచ్చే చర్య. అయితే ప్రభుత్వ విద్యకు జీవం పోసే కొత్త ప్రయోగం అనుకున్న కేజీ టు పీజీ భావన వాస్తవానికి ప్రభుత్వ విద్యను కళకళలాడించటానికి బదులుగా కార్పొరేట్‌ విద్యను, ప్రైవేట్‌ స్కూళ్లను పెంచడానికే ఉపయోగ పడింది. ప్రభుత్వ విద్యకు పట్టం కట్టాలని తెలంగాణలో విద్యాపోరాట యాత్రను మొదలెడితే వేలాదిమంది విద్యార్థులను, అధ్యాపకులను అరెస్టు చేశారు. ప్రభుత్వ విద్యకు పట్టం కట్టడం అనేది సమానత్వ భావనకు, ప్రజాస్వామ్య భవి ష్యత్తుకు, నాగరికత ముందుకు పోవడానికి, సామాజిక పరిణామానికి సంబంధించిన సమస్య.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అంటే 2014లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ విద్యాపోరాట యాత్రను అప్పట్లో పదిజిల్లాల్లో నిర్వహించింది. తెలంగాణ ఉద్యమకాలంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ నేత కేసీఆర్‌ కేజీ టు పీజీ ఉచిత విద్య అనే నినాదాన్ని ఇవ్వడమే కాక దానిని గత ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో కూడా చేర్చారు. రాజకీయ అర్థశాస్త్రం తెలిసిన వారికెవ్వరికైనా ఇపుడున్న పరిస్థితిలో విద్య సంపూర్ణంగా ప్రభుత్వ రంగంలోకి తీసుకురావడం అనేది చాలా సాహసోపేతమైన చర్య. ఆయన వాగ్దానాన్ని అందరం ఆహ్వానించాలి. వాస్తవానికి నూతన ఆర్థిక వ్యవస్థ పుణ్యమా అని సేవారంగం వ్యాపారీకరణ చెందిన నేపధ్యంలో ప్రభుత్వ సేవలను ఉచితంగా అందించటం అనేది ప్రపంచీకరణ విధానంలో ఇమడదు.

సేవలను వ్యాపారీకరించి వాటిని ప్రపంచ వ్యాప్తంగా అమ్మడం అమెరికా అవసరంగా మారింది. ఇందులో విద్యారంగం చిక్కుకుపోయింది. ఆయా దేశాల్లోని సేవారంగాలను ప్రైవేటీకరించాలని అంతర్జాతీయ ద్రవ్యసంస్థల ద్వారా ఒత్తిడిపెట్టి, ప్రైవేటీకరణ, ఉదారీకరణ, ప్రపంచీకరణను ప్రోత్సహించారు. అందుకే మన దేశంలో 1980ల వరకు ప్రభుత్వ రంగంలో ప్రధానంగా ఉన్న విద్యను తర్వాత ప్రైవేటీకరించడం ప్రారంభమైంది. అంతర్జాతీయ పెట్టుబడిని ఈ రంగంలోకి ఆహ్వానించడం కూడా అప్పుడే ప్రారంభమైంది. దీంతో భారత రాజ్యాంగపు ఆదేశిక సూత్రాలను కూడా కాదని విద్యారంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులను అనుమతించారు. లాభాలు చేసుకోవడానికి విద్య సులువైన మార్గాన్ని తెరిచింది.

దాని పేరిట ఇంజనీరింగ్‌ కాలేజీలో పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చాయి. ఈ ప్రైవేటీకరణ సునామీలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రభాగాన ఉండేది. మొత్తం 700 నుంచి 800 ఇంజనీరింగ్‌ కాలేజీలు 4 మాత్రమే ప్రభుత్వం రంగంలో ఉన్నాయి. ఇంజనీరు కావాలని ప్రతి యువతీయువకుడికి కోరిక కలిగింది. ఈ విద్య మొదట సంపన్న కుటుంబాలకు చెందిన యువతీయువకులకు చేరితే తర్వాత మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి అంటే వెనుకబడిన తరగతులు.. అలాగే షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ కుటుంబాలకు చెందిన పిల్లలు అందిపుచ్చుకున్నారు. కానీ వీరి తల్లిదండ్రులకు మాత్రం ప్రైవేట్‌ కాలేజీలలో ఫీజులు భరించే పరిస్థితి లేదు. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం ఒక మార్గం. 

అయితే ప్రభుత్వమే రీయింబర్స్‌మెంట్‌ పేరిట కోట్లాది రూపాయలను ఈ కాలేజీలకు ఇచ్చే ఒక కొత్త పద్ధతి రావడంతో ప్రభుత్వ రంగ విద్య మీద చేయవలసిన ఖర్చును ప్రైవేట్‌ రంగానికి పీపీపీ అనే పేరుతో తరలించడం ప్రారంభమైంది. దీంతో ప్రైవేట్‌ రంగానికి విశ్వవిద్యాలయాల మీద కన్నుపడి అది ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు దారులు తెరి చింది. వీటిలో ఫీజులు లక్షల రూపాయలు కావడంతో తల్లిదండ్రులు అప్పులు చేయడంతోపాటు నానా చాకిరీ చేసి తమ కష్టార్జితాన్ని ప్రైవేట్‌ పాలు చేసే ఒక పాడు సంప్రదాయం ప్రారంభమయింది. ఇలా లక్షలు, కోట్లు ఫీజులు కట్టి చదువుకొన్న యువతీయువకులు వ్యాపారస్తుల్లా మారతారే తప్ప సామాజిక స్పృహ కలిగిన బాధ్యతాయుత పౌరులుగా ఎదగరు.

దేశంలో అవినీతి పెరిగిందని గగ్గోలు పెట్టే వాళ్లకు, అవినీతి వ్యతిరేక పోరాటం చేపట్టిన అన్నాహజారేకు ఈ సంక్లిష్టత అర్థం కాలేదు. ఎంతసేపటికీ లోక్‌పాల్‌ వ్యవస్థను స్థాపిస్తే అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని అమాయకంగా ఆలోచించాడు తప్ప, అవినీతి మూలాలు మనం తయారు చేసే విద్యాప్రక్రియలో కూడా ఉంటాయనే విషయాన్ని ఆలోచించలేదు. విద్య ప్రైవేటీకరణ మానవ నాగరికత పరిణామానికే ప్రమా దమని అర్థం చేసుకుంటే తప్ప విద్యా పోరాట ఉద్దేశం అర్థం కాదు. విద్యారంగానికి పునాది, మూలస్తంభం పాఠశాలవిద్య. కేసీఆర్‌ కేజీ టు పీజీ అన్నప్పుడు స్కూల్‌ విద్య పూర్వ వైభవాన్ని పొందుతుందని ఆశించాం. విద్యారంగం ప్రక్షాళన చెంది ప్రభుత్వ పాఠశాలలు కొత్త భవనాలతో, అన్ని ఆధునిక హంగులతో సరిపోయినంతమంది అర్హులైన ఉపాధ్యాయినీఉపాధ్యాయులతో కళకళలాడుతాయని అనుకున్నాం.

కార్పొరేటు స్కూళ్లను రద్దుచేసి లేదా ప్రభుత్వపరం చేసి ప్రైవేటు స్కూళ్లను నియంత్రించి, ప్రభుత్వ స్కూళ్లను పరిపుష్టం చేస్తారని భావించాం. ఇవేవీ జరగలేదు. గత నాలుగు ఏళ్లలో కార్పొరేటు స్కూళ్ల సంఖ్య పెరి   గిందే తప్ప తరగలేదు. ప్రైవేటు స్కూళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫీజులు విపరీతంగా పెరగడంతో తల్లిదండ్రులు ఫీజుల తగ్గింపు కోసం ఉద్యమించి ప్రభుత్వం ఒక కమిటీని నియమించేలా ఒత్తిడి పెట్టారు. ఈ కమిటీ తల్లిదండ్రుల వైపునుంచి కాక యాజమాన్యాల తరఫున ఆలోచించి, ఫీజులు నియంత్రించే బదులు వాటిని కొంత పెంచాలని సూచిం చారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విశ్వాసం తగ్గి మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు సతమతమౌతున్నారు. ఈ పరి స్థితిలో దిగువ మధ్యతరగతి పడుతున్న బాధ వర్ణించడం కష్టం.

విద్యా పరిరక్షణ కమిటీ అలాగే అఖిల భారత విద్యా హక్కు ఫోరం కామన్‌ స్కూల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని రాజీలేని పోరాటం చేస్తున్నది. ఆర్థికంగా, సామాజికంగా అంతరాలున్న సమాజంలో ఒక ఆవాస ప్రాంతంలోని పిల్లలందరూ ఒకే స్కూలుకు వెళ్లడం వలన పిల్లల మధ్య పరస్పర అవగాహనే కాక కొఠారి కమిషన్‌ చెప్పినట్లు సంపన్నుల పిల్లలకు పేదలపట్ల ఏర్పడే సానుభూతి అలాగే పేద పిల్లలకు సంపన్నుల పట్ల ఏర్పడే సానుకూల దృక్పథంవల్ల పేదరికం, సంపద సహజీవనం చేయడానికి పరోక్షంగా తోడ్పడుతుంది.

వర్గ సమాజంలో ఇంత దూరదృష్టితో సలహా ఇవ్వడం సంపన్నులకు ఎంతో శ్రేయోదాయకం. కానీ దూరదృష్టి కోల్పోయిన పాలక వర్గానికి కొఠారి ప్రతిపాదనలోని అంతరార్థం పూర్తిగా అవగాహన కాలేదు. కామన్‌ స్కూల్‌ స్థానంలో తెలంగాణలో గురుకుల స్కూళ్లను తెరిచారు. గురుకుల స్కూళ్లకు డిమాండ్‌ బాగానే పెరిగింది. దాదాపు రెండు, రెండున్నర లక్షలమంది పిల్లలు స్కూళ్లలో చేరారు. మొత్తం 60 లక్షల మంది పిల్లల్లో ఒక్క శాతం మందికి నాణ్యమైన విద్య ఇస్తే సరిపోతుందా? మరి మిగతా పిల్లల సంగతేమిటి అనే ప్రశ్న గురించి గతంలోనే చర్చ మొదలైంది. 

ఈ నేపథ్యంలో అఖిల భారత విద్యా హక్కు పోరాట వేదిక వంద రోజుల పోరాట యాత్రకు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు తెలం గాణ విద్యా పరిరక్షణ కమిటీ మొత్తం 15 డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా 14 నుంచి డిసెంబర్‌ 6 వరకు నిర్వహించాలని తలపెట్టింది. ఈ ఉద్యమానికి పోలీసులు అడ్డం వస్తారని ఊహించలేదు. ఇది పోలీసు పిల్లలకు కూడా సంబంధించిన సమస్య. ఈ నెల 14న విద్యా పరిరక్షణ కమిటీ గన్‌ పార్క్‌లోని అమరవీరుల స్తూపం దగ్గర ప్రారంభించడానికి నిర్ణయించి ఆ మేరకు సంబంధిత పోలీసు కమిషనర్‌ ఆఫీసుకు ఒక వారం ముందే సమాచారం ఇవ్వడానికి వెళితే సంబంధిత సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు కూడా సమాచారం ఇవ్వమని కమిషనర్‌ ఆఫీసు ఇచ్చిన సలహా మేరకు సమాచారం ఇవ్వడం జరిగింది.

పోలీసులు ఈ యాత్రకు అభ్యంతరం చెప్పరని, చెప్పలేదని భావించి పరిరక్షణ కమిటీ సభ్య సంఘాల బాధ్యులుగా సమావేశమయ్యాం. అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అది రొటీన్‌ వ్యవహారం అని భావించి పోరాట యాత్రలో ప్రారంభ ఉపన్యాసం చుక్కా రామయ్యకు ఇచ్చారు. ఆ తర్వాత నేను ప్రొ‘‘ చక్రధర్‌ రావు, ప్రొ‘‘ లక్ష్మీనారాయణ మాట్లాడిన తర్వాత పీఓడబ్ల్యూ సంధ్య, సాంబశివరావుగారు మాట్లాడుతున్నప్పుడు కొంత పోలీసు హడావుడి ప్రారంభమయ్యింది. ఎవరో వచ్చి అరెస్టులు చేస్తారని చెబితే నేను నమ్మలేదు. విద్యా పోరాట యాత్రకు అదీ ఇంత శాంతియుతంగా జరుగుతున్న సమావేశాన్ని ఎందుకు అడ్డుకుంటారని భావించాం. అంతలో ఒక పోలీసు అధికారి నన్ను పోలీసు వాహనంలో కూర్చోమని చెప్పడంతో నేను అటువైపు నడుస్తున్నప్పుడు విద్యార్థులు, కార్యకర్తలు అడ్డుకొనడంతో పోలీసులు బలప్రయోగం ప్రారంభించారు. దీన్ని ఊహించలేదు. 

తెరాస పార్టీ నాలుగు ఏళ్ల పాలనలో ఎంత మారిందో ఊహించు కుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరగడానికి ఇతర కారణాలతో బాటు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న నిర్బంధం ఒక ప్రధాన కారణం. ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణ రాజకీయ నాయకులకు కొన్ని ప్రజాస్వామ్య విలువలుంటాయని అనుకున్నాను. కానీ పాలకులు మారలేదు. పోలీసులు మారలేదు. పోరాటయాత్రను భగ్నం చేయడం దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలకు పరాకాష్ట. విద్యా పోరాట యాత్రలో ప్రజలు విస్తృతంగా పాల్గొనాలి. ఇది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిందే కాదు, తెలంగాణ రాష్ట్రానికే సంబంధించిన సమస్య కాదు. ఇది దేశంలో సమానత్వ భావనకు, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు, నాగరికత ముందుకుపోవడానికి, సామాజిక పరిణామానికి సంబంధించిన సమస్య.


వ్యాసకర్త 
ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌
విజిటింగ్‌ ప్రొఫెసర్, ఎన్‌ఎల్‌ఎస్‌ఐయు, బెంగళూరు
ఈమెయిల్‌ : profharagopal@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement