సమాజంలో పేదలు, అట్టడుగు వర్గాలు, ఆర్థికంగా వెనుకబడ్డ వారు ప్రాథమిక చదువుల కోసం ఆధారపడే ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలంటూ, విద్యా మూలమిదమ్ జగత్ అనే నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోగానే కొన్ని వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. హఠాత్తుగా వారికి తెలుగు భాష గుర్తుకొచ్చింది. తమ కుటుంబ సభ్యుల్లో ఒక్కరినీ తెలుగు మీడియంలో చదివించని వీరంతా తెలుగు భాష గురించి పుంఖానుపుంఖాలుగా మాట్లాడుతున్నారు.
కడపలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడలేక, పూర్తి స్థాయి ప్రావీణ్యత లేక ఎన్నో అవకాశాలు కోల్పోయా. తప్పనిసరి పరిస్థితుల్లో గ్రాడ్యుయేషన్‌లో ఇంగ్లిష్ మీడియంలోకి వచ్చినా.. భాష పూర్తిగా రాకపోవడం వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా అమెరికా వచ్చిన నాకు ఇంగ్లిష్ భాషలో పట్టు లేకపోవడం వల్ల మొదట్లో నా కెరియర్‌కు ఎంతో నష్టం జరిగింది.
ఇంగ్లిష్ భాష గురించి నిజాయితీగా కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. మన మనస్సాక్షిని ప్రశ్నిం చుకుంటే నిజాలు బయటపడతాయని ఆశి స్తున్నా. 1. జాతీయంగా, అంతర్జాతీయంగా ఏ ముఖ్యమైన పని చేయాలన్నా, బిజినెస్ నిర్వహించాలన్నా ఇంగ్లిష్ అవసరం కాదా? 2. ఉన్నత కొలువులకు బాటలు వేసే ఏ చదువు చదవాలన్నా ఇంగ్లిష్ తప్పనిసరి కాదా? 3. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏ యూనివర్సిటీలో విద్య అభ్యసించాలన్నా ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం లేకుంటే నిరాశే మిగలదా? 4. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నా, ఇంటర్నెట్ నుంచి సమాచారం కావాలన్నా.. ఇంగ్లిష్‌పైన ఆధారపడడం లేదా? 5. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతో ఉండి కూడా ఇంగ్లిష్ సరిగా మాట్లాడలేక అమెరికా/యూకే వీసాలు తిరస్కరింపబడి మనకు తెలిసిన వాళ్లెందరో నిరాశకు గురి కావట్లేదా?
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. అన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియమే ఉంది. డబ్బున్న వారంతా తమ పిల్లలను ఇంగ్లిష్‌లోనే చదివిస్తున్నారు. అంటే ఇంగ్లిష్ మీడియం వ్యతిరేకించే వారి లక్ష్యం పేద, బడుగు, బలహీన వర్గాలా? వాళ్లు ఇంగ్లిష్ చదువుకోవడం వీరికి ఇష్టం లేదా? అణగారిన వర్గాలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోవడం వల్ల అప్పో సప్పో చేసి మరీ ప్రైవేట్ కాన్వెంట్‌లలో చదివించే వారి కష్టాలు ఎప్పుడు తీరాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎంతో మంది విద్యార్థులకు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించుకునే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో వీరందరికీ ఇంగ్లిష్ మీడియం వల్ల ఎంతో ప్రయోజనం జరగనుందని కచ్చితంగా విశ్వసిస్తున్నా. ఏపీ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు లభించేలా బాటలు వేస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్పూర్తిగా స్వాగతిద్దాం.
రత్నాకర్, నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment