విజయాలు కూడా వెక్కిరిస్తాయి!
నాలుగేళ్లలో నలుగురు రక్షణ మంత్రులను దేశం చూసింది. మన మాజీ సైనికుల పింఛను బడ్జెట్ వచ్చే రెండేళ్లలో జీతాల బడ్జెట్‌ను మించిపోనున్నది. ఈ రెండూ కేపిటల్ బడ్జెట్‌ను దాటిపోయే విధంగా ఉన్నాయి. కానీ మన సైనిక శక్తి కాలదోషం పట్టిందే తప్ప, శక్తివంతమైనదీ, వ్యూహాత్మకమైనదీ కాదు. చైనా వారు సంవత్సరానికి మూడు యుద్ధనౌకలను తయారుచేస్తున్నారు. అయితే మనం మూడేళ్లలో ఒకటి నిర్మించుకోవడానికే కష్టపడుతున్నాం. అందులో క్షిపణులు, సెన్సార్ల అమరికకు మరో రెండేళ్లు పడుతోంది. మేక్ ఇన్ ఇండియా, ప్రైవేట్ రంగం అంటూ హడావిడి చేసిన తరువాత మనం సాధించినదేమిటో అర్థం కాకుండా ఉండిపోయింది.
భారత్ విదేశ వ్యవహారాల, వ్యూహాత్మక వాతావరణ పరిస్థితిని చూస్తూ ఉంటే రైలు ప్రమాదాన్ని తలపిస్తున్నది. ఇది అమెరికా ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి మాదిరిగా స్వొత్కర్షతో టు ప్లస్ టు చర్చలను మూడోసారి వాయిదా వేయడం వంటిది కాదు. భారత్ విదేశీ వ్యవహారాల పరిస్థితి ఒక సంవత్సరం క్రితం మనం చూసిన చిత్రానికీ ఇప్పటి దృశ్యానికీ అసలు పోలికే లేదు. అప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక దేశ రాజధాని నుంచి ఇంకో దేశ రాజధానికి ఉరుకుతూ ఆయా దేశాల నేతలను ఆలింగనం చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు భారత్ వేగంగా ఎదుగుతున్న శక్తి. మోదీ అంటే భారతదేశానికి నాయకత్వం వహిస్తున్న శక్తిమంతమైన, కలుపుగోలుతనం కలిగిన, అవిశ్రాం తంగా శ్రమపడగలిగిన నాయకుడు. అంతర్జాతీయ రాజకీయ రంగంలో ఒక తార. పారిస్‌లో జరిగిన వాతావరణ సదస్సులో తన నిర్ణయాత్మక, సానుకూల జోక్యంతో ఆయన ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే ఇందుకు మంచి ఉదాహరణ. ఈ అభిప్రాయమంతా గడచిన ఆరు మాసాలలో చెదిరిపోయింది. సున్నితమైన, స్థిరమైన భారత్ ఎదుగుదల మాదిరి గానే మన మీద ఉన్న అంతర్జాతీయ దృష్టి కూడా అవమానకరంగా అధోముఖం పట్టింది.
మోదీ మద్దతుదారులు దీనికి నిరసన ప్రకటిస్తారు. కానీ పక్షపాత ధోరణి కలిగిన రాజకీయులు మతిలేనివారిగా ఉండిపోతే, శక్తిమంతమైన వ్యవస్థ అన్న స్థాయిని ఊహించుకుంటున్న దేశం వాస్తవాలను గమనించలేదు. పెద్ద ప్రయాణం ఇలా క్రమంగా ఎందుకు బలహీనపడిందో మనం పరీక్షిం చాలి. కొన్ని వాస్తవాలు మాత్రం భారత్ అదుపు చేయగలిగిన స్థితిలో లేవు. అందులో డొనాల్డ్ ట్రంప్ ఆవిర్భావం ఒకటి. అదే సమయంలో ఇటీవల చొరవ తీసుకుని మరీ చేసినట్టు ఉన్న కొన్ని ఘోర తప్పిదాలు భారత అంతర్జాతీయ సంబంధాలను మానవ తప్పిదాలన్నట్టు చూపుతున్నాయి. నాయకులు తాము ఎంచుకున్న విధానాన్ని దౌత్యంలో ప్రవేశపెడతారు. మోదీ దౌత్య విధానం లావాదేవీలతో కూడినదన్న వాస్తవాన్ని సౌత్ బ్లాక్‌లోని ఆయన ఔత్సాహికులు పండుగలా జరుపుకుంటూ ఉంటారు. ఈ విధానానికి బీజేపీ ఆమోదం ఉంది. అలాగే బీజేపీకి అనుకూలంగా ఉండే అంతర్జాతీయ సంస్థలలోని బృందాలలో కూడా దానికి అనుకూలత ఉంది. అయితే ఏ కొద్దిమంది విషయంలో తప్ప మిగిలిన వారందరికీ నేడు దాని ఎడల నమ్మకం లేదు. మోదీ మొదటి మూడేళ్ల పాలనలో గొప్ప దౌత్య విజయాలంటూ ఒకదాని తరువాత ఒకటిగా విజయోత్సవాలు జరుపుకోవడం దీని ఫలి తమే.
బాధ్యత కలిగిన శక్తులుగా మూడు అంతర్జాతీయ క్షిపణి అణు సాంకేతిక వ్యవస్థలను భారత్ అంగీకరించింది. ఉపఖండంలో అమెరికా విధానం పూర్తిగా ఎటూ మొగ్గని రీతిలోనే ఉంది. వ్యూహాత్మక బంధాలే వాస్తవికంగా కనిపిస్తున్నాయి. బిల్ క్లింటన్ రెండో దఫా పదవీకాలం నుంచి భారత్ విదేశీ వ్యవహారాలు మెరుగుపడడం మొదలైంది. విధానాల కొనసాగింపు, ఆర్థికవృద్ధి దిశలను నిర్దేశించాయి. మోదీ తన శక్తితో, వ్యక్తిగత శైలిలతో, పూర్తి మెజారిటీ ఉండడంతో దీనిని మరింతగా విస్తరించారు. అయితే రైలును పట్టాలు తప్పించినదేమిటి? అంతర్జాతీయంగా రెండు ప్రతికూలతలు సంభవించినా అవి మోదీ ప్రభుత్వ తప్పిదాల వల్లకాదు. అవి– అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఎదుగుదల, చైనా కొత్త ప్రకటన. ట్రంప్ చర్యలు, మరీ ముఖ్యంగా ఇరాన్ సంబంధాలలో మార్పు దరిమిలా చమురు ధరలు పెరగడానికి ప్రత్యక్షంగా దోహదం చేశాయి. ఇదే భారత్ దేశీయ ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను అనిశ్చిత స్థితిలోకి నెట్టివేశాయి. భారత్ అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా చైనా–పాకిస్తాన్ ఆర్థిక నడవా పథకాన్ని డ్రాగన్ ముందుకు తోస్తున్నది. శ్రీలంక, నేపాల్, మాల్దీవులలో, బంగ్లాదేశ్‌లో చైనా వేస్తున్న అడుగులు కూడా మరొక అంశం.
అంటే ఉపఖండంలో భారత్‌కు ఉన్న పూర్వ వైభవాన్ని యథాతథంగా కొనసాగించడానికి చైనా అనుకూలంగా లేదన్న సంగతి కూడా వాటితో స్పష్టమవుతుంది. అణు సరఫరాదారుల బృందం నుంచి భారత్‌ను తప్పించవలసిందంటూ జార్జి డబ్లు్య బుష్ ఫోన్ లోనే హు జింటావోను ఆదేశించిన రోజులు కావు ఇవి. ప్రస్తుత అధ్యక్షుడు జింగ్‌పింగ్ అలాంటి మాటలు వినడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే అలా ఫోన్‌లో చెప్పే పనికి ట్రంప్ కూడా పూనుకోడు. ఎందుకంటే, మోదీ లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తారు. ట్రంప్ వాటికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మోదీ ప్రభుత్వం పాల్పడిన దారుణమైన తప్పిదం ఒకటి ఉంది. అది– దేశీయ రాజకీయాల కోసం సున్నితమైన అంతర్జాతీయ సంబంధాలను ఉపయోగించుకోవడం. చరిత్రలో విజయవంతమైన నాయకులుగా చలామణీ అయినవారికి ఉన్న మొదటి లక్షణం వ్యూహాత్మక సహనం. వ్యూహాత్మక బంధాలను నిర్మించే క్రమంలో మంచి నాయకులు సునీల్ గావస్కర్ వలే బ్యాటింగ్ చేస్తారు గానీ వీరేంద్ర సెహ్వాగ్ వలె కాదు. కీలకమైన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అన్నింటి ప్రచార కార్యక్రమంలోను మోదీ విదేశాంగ విధానంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. అది విజయానికి ఉపయోగపడింది కూడా.
కానీ దౌత్య విజయాల గురించి వెను వెంటనే వెల్లడించడం వల్ల ప్రమాదం ఉంది. మీకున్న వ్యూహాత్మక అవకాశాలు దానితో సన్నగిల్లిపోతాయి. ఇలాంటి వాటి విషయంలో ఇందిరాగాంధీ మూడో కంటికి తెలియనిచ్చేవారు కాదు. అలా అని ఆమె మూర్ఖురాలు కాదు. రాజకీయాలు తెలియనివారు కూడా కాదు. తక్షణ రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి వ్యూహాత్మక చర్యలను ఉపయోగించుకుంటే, ఆ విషయంలో ముందుకు వెళ్లడానికి మనకున్న మార్గాలు మూసుకుపోతాయి. ఇంకా దారుణమేమిటంటే– వాటి గురించి మీ శత్రువులకు అవగాహన పెరుగుతుంది. డోక్లాంతో, తరువాత జరిగిన పరిణామాలతో చైనా ఒక విషయం స్పష్టం చేసింది. భారత సైనిక పాటవానికి తాము భయపడేది లేదని ప్రకటించింది. ఇప్పుడు పాకిస్తాన్ చైనా నీడకు చేరింది. గడచిన నవంబర్ 13న మనీలాలో మోదీ, ట్రంప్ సమావేశ వ్యవహారం కూడా దౌత్య వర్గాలలో ఏమాత్రం దాగకుండా బయట ప్రపంచం దృష్టికి వచ్చింది. ఆ సమావేశంలో ట్రంప్ హావభావాలు, ప్రవర్తన గతంలో మాదిరిగా లేవు. ఆనాటి మర్యాద లేదు. మోదీని అనుకరిస్తూ ట్రంప్ మాట్లాడినట్టు ఉన్న వీడియో బయటపడడంతో మోదీ పట్ల అతడికి ఉన్న అమర్యాద కూడా బయటపడింది.
ఆ తరువాతే భారత వాణిజ్య ప్రయోజనాల మీద ట్రంప్ దెబ్బ కొట్టారు. అదే సమయంలో వీసాల విషయంలో బ్రిటన్ కూడా దెబ్బ కొట్టింది. ఇండియా పాస్‌పోర్టుకు విలువ పెరిగిందంటూ చెబుతున్న మాట ఈ పరిణామాలతో భంగపడినట్టు ఉంటుంది. నాలుగేళ్లలో నలుగురు రక్షణ మంత్రులను దేశం చూసింది. మన మాజీ సైనికుల పింఛను బడ్జెట్ వచ్చే రెండేళ్లలో జీతాల బడ్జెట్‌ను మించి పోనున్నది. ఈ రెండూ కేపిటల్ బడ్జెట్‌ను దాటి పోయే విధంగా ఉన్నాయి. కానీ మన సైనిక శక్తి కాలదోషం పట్టినది తప్ప, శక్తివంతమైనదీ, వ్యూహాత్మకమైనదీ కాదు. చైనా వారు సంవత్సరానికి మూడు యుద్ధనౌకలను తయారుచేస్తున్నారు. అయితే మనం మూడేళ్లలో ఒకటి నిర్మించుకోవడానికే కష్టపడుతున్నాం. అందులో క్షిపణులు, సెన్సార్ల అమరికకు మరో రెండేళ్లు పడుతోంది. మేక్ ఇన్ ఇండియా, ప్రైవేట్ రంగం అంటూ హడావిడి చేసిన తరువాత మనం సాధించినదేమిటో అర్థం కాకుండా ఉండిపోయింది. నేనిలా అంటున్నందుకు మీరు నన్ను ఉరిమి చూడవచ్చు. కానీ ఇది ప్రపంచం మొత్తానికీ తెలుసు.సైనిక శక్తి పతనం అనేది ఆర్థిక వ్యవస్థ క్షీణతతో ముడిపడి ఉంటుంది. మీ స్థూల దేశీయోత్పత్తి –జీడీపీ–ని లెక్కించే పద్ధతిని మార్పు చేయడం ద్వారా మీరు మీ ప్రజలను సులువుగా ఏమార్చవచ్చు. దాన్ని విశ్వసించడం మీరు ప్రారంభించినప్పుడు అది ప్రమాదకరంగా మారుతుంది.
భారత్ వికాసం గురించి, మన విజ్ఞానాన్ని, దిశను యావత్ ప్రపంచమే ఎలా అబ్బురంగా తిలకిస్తోంది అనేదాని గురించి, క్రిస్‌మస్ పండుగకు పోటీగా యోగా దినోత్సవం ప్రస్తుతం భారత ఆధ్యాత్మికతా శక్తిని స్ఫురించే అంతర్జాతీయ వేడుకగా ఎలా మారింది అనే అంశం గురించి నిరంతరాయంగా చర్చిస్తున్నారు. ఆరెస్సెస్ అధిపతి మోహన్ భాగవత్ ఇటీవలే భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ సమక్షంలో చేసిన అలాంటి ఒక ప్రసంగాన్ని చూడండి. భారత్ విశ్వగురువుగా మారే క్రమంలో ఉందని విజయగర్వంతో ప్రకటించారు కూడా. అలాంటప్పుడు అన్ని కాలాల్లోనూ మన ఉత్తమమైన మిత్రదేశం అమెరికాతో మన సంబంధాలు ఎందుకు దిగజారుతున్నట్లు? బంగ్లాదేశ్ మినహాయిస్తే చైనా కౌగిలిలో ఉన్న మన పొరుగుదేశాలన్ని మనతో శత్రువైఖరితో, అనుమానాస్పదంగా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు? ఈ విశ్వగురు దేశానికి చెందిన ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంత అనాగరికంగా ఎలా వ్యవహరిస్తారు? ట్రంప్ పాలనాయంత్రాంగంలో అసాధారణ వ్యక్తిగా ఉన్న నిక్కీ హేలీ నేరుగా భారత్‌కి వచ్చి ఇరాన్‌తో మన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలని ఎలా ఆదేశి స్తారు? అలాగే చైనా అధ్యక్షుడు గ్జిని కలిసినప్పుడు మన మోదీ శరీరభాష పూర్తిగా ఎందుకు మారిపోయినట్లు? పాక్ అక్రమిత కశ్మీర్లోని భారతీయ భూభాగం గుండా సిపిఇసి రహదారిని నిర్మిస్తుండటంపై మన నాయకులు నిరనస తెలిపి ఎంతకాలమైంది?అందుకే ఊపిరి సలపకుండా మనం చేసుకుంటున్న వేడుకలకు మంగళం పాడాల్సిన సమయం ఇదే మరి. ఇప్పుడు గాఢంగా ఊపిరి పీల్చుకుని వాస్తవ పరిస్థితిని అంచనా వేసుకుని అంతర్మథనం చేసుకోవడమే ఉత్తమం.
శేఖర్ గుప్తా
వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
Comments
Please login to add a commentAdd a comment