‘మీ మిత్రులెవరో చెప్పండి, మీరేంటో నే చెబుతాన’ని ప్రఖ్యాత రచయిత బెర్నార్డ్ షా అన్నారని ప్రతీతి. ‘మీరేం తింటున్నారో చెప్పండి, మీ ఆరోగ్య భవితవ్యం మేం చెబుతాం’ అంటున్నారిప్పుడు పౌష్టికాహార నిపుణులు. మన తిండి మన ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నిర్దారిస్తుంది. దేశ సౌభాగ్యాన్ని కూడా తేలుస్తుంది. నూరేళ్ల కింద, ‘... తిండి కలిగితె కండ కలదోయ్, కండ కలవాడె మని షోయ్!’ అన్న మహాకవి గురజాడ కూడా ఈ రోజున ఉండుంటే, తిండి అన్న మాటను ‘సరైన తిండి’ అని సవరించి ఉండేవాడే! ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న సామెతను మరింత విస్తృత పరచి చూస్తే, ఒక దేశంలో తిండి, ఆహార పద్ధతులు, పరిస్థితులు ఆ దేశ సౌభాగ్యాన్ని నిర్ణయిస్తాయనొచ్చేమో! ఆయా దేశాల్లో నెలకొన్న ఆరోగ్యపరిస్థితు లను వారి ఆహార స్థితిగతులతో పోల్చి పరిశీలించినపుడు అదే నిజమ నిపిస్తుంది. భారతదేశ ప్రజల ఆరోగ్య–అనారోగ్య స్థితుగతుల్ని కాస్త లోతుగా విశ్లేషించినపుడు ఇక్కడి ఆహార సంపద, పౌష్టికాహార లభ్యత, అవకాశాల్లో అసమానత, తిండి అలవాట్లు... తీవ్రమైన ప్రభా వకాలే అని స్పష్టమౌతోంది. అందుకే ఈ అంశాల పట్ల దేశప్రజల్లో నెమ్మదిగా స్పృహ పెరుగుతోంది. ప్రభుత్వాలూ ప్రత్యేక కార్యక్రమా లతో శ్రద్ధ పెంచుతున్నాయి. మూడేళ్లుగా దేశంలో అమలు పరుస్తున్న ‘పోషణ్ అభియాన్’ అటువంటిదే! తాజాగా నిన్నటి కేంద్ర బడ్జెట్లో ఈ అభియాన్ కింద ప్రత్యక్షంగా రూ.3700 కోట్లు కేటాయిస్తే, పౌష్ఠికా హార సమృద్ధి కోసం పరోక్షంగా వివిధ శాఖల ద్వారా రూ.35,600 కోట్లు వ్యయం చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో చెప్పారు.
ఇప్పుడు చైనాలో అల్లకల్లోలం సృష్టించి ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్, వారి విపరీత ఆహారపు అలవాట్ల వల్లే వచ్చిందన్న అభిప్రాయం విశ్వమంతా వినిపిస్తోంది. ఈ వైరస్ ఒక రకపు గబ్బిలాలు, పాముల్లోనూ ఉన్నందున, అవే ద్వితీయ వాహకా లుగా వైరస్ జనానికి వ్యాపించిందేమోనని సదరు అనుమాన మున్న మాట నిజమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) అంగీకరిం చింది. కానీ, ఆహారపు అలవాట్లవల్లే వ్యాధి ఖచ్చితంగా వచ్చి ప్రబలుతోందని నిర్దారించే ఆధారాలేమీ లేవని కూడా స్పష్టం చేసింది. ఆహారం, తిండి అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయన్న దాంట్లో ఎవరికీ సందేహం లేదు.
తిండి విషయంలో అతిచిన్న అంశాల్లోనూ సరైన అవగాహన దేశ ప్రజల్లో లేకపోవడం దురదృష్టకరం! పౌష్టికా హార లోపం దేశ ప్రజల ఆరోగ్యస్థితికే కాకుండా భవిష్యత్తరాలకు కూడా ఓ పెనుసవాల్ విసు రుతోంది. ఈ లోపం వల్ల బాల్యం బలిపశువుగా మారింది. తల్లులు అనారోగ్యంతో తల్లడిల్లుతున్నారు. దేశంలో రికార్డుస్థాయి మాతా–శిశు మరణాలకు పౌష్ఠికాహార లోపమే ప్రధాన కారణం. ‘ఇది న్యూట్రీషన్ బడ్జెట్’ అని కేంద్ర ప్రభుత్వం జబ్బలు చరుస్తున్నా... అతి సాధారణ విషయాల పట్లా సగటు పౌరుల్లో గూడుకట్టుకున్న అవగాహనా లేమి పాలకులను, ప్రణాళికా నిపుణుల్ని ఇంకా వెక్కిరిస్తూనే ఉంది.
అసమానతలు తగ్గి, అవకాశాలు పెరగాలి
మేటి పారిశ్రామికవేత్త రతన్ టాటా ఓ ఆంగ్ల దినపత్రికలో బుధవారం ఒక వ్యాసం రాశారు. దేశంలో ఈ దశాబ్ది (2020–30) అన్ని లోపా లను అధిగమించేదిగా నిలవాలని, అందుకీ దేశాన్ని పౌష్టికాహార సమృద్ధంగా తీర్చిదిద్దితేనే అది సాధ్యమని అభిప్రాయపడ్డారు. అంత రాలు తగ్గాలని, ముఖ్యంగా సమాజపు వివిధ స్థాయి పౌరుల మధ్య ఆహారపు అవకాశాల అంతరం ప్రమాదకరంగా ఉందనీ ఆయన న్నారు. ఫలితంగా లక్షలాది శిశువుల్ని కోల్పోవడం, గర్భిణుల్ని పోగొ ట్టుకోవడం, తల్లులు ఆరోగ్యవంతమైన పిల్లల్ని కనలేని దుస్థితి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తినాల్సిన ఆహారం తగినంత తినకపోవడం, మోతాదుకు మించి తినడం, ఒంటికి సరిపడని ఆహారం తినడం. అసలేమీ తినకపోవడం... వీటివల్లే పౌష్టికాహార లోపమని చెబుతారు. మన దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఈ దుస్థితిలో ఉన్నారు. ఇది ప్రపంచంలోని పౌష్టికాహార లోప జనాభాలో మూడో వంతు! ఈ కారణంగానే ఏటా 25 లక్షల మంది అర్ధాం తరంగా తనువు చాలిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో చూసిన పుడు తక్కువ బరువు, తక్కువ ఎత్తు, తక్కువ స్వస్థత, తక్కువ మెదడు వికాసంతో పుట్టే పిల్లల సంఖ్య దేశంలో పెద్ద మొత్తంలో ఉంటోంది. ఈ రకం పిల్లల్లోనే అత్యధికులకు అయిదేళ్లలోపు ఆయువు తీరుతోంది. అయిదేళ్ల తర్వాత కూడా సరైన పౌష్టికాహారం లభించక జరిగే బాల్య మరణాలెన్నో! దేశం యువ భారత్ అని మనం గంభీరంగా చెప్పు కుంటున్నా... దేశంలో బాలల సంఖ్య ఏయేటి కాయేడు తగ్గిపోతోంది.
దేశంలో 6–15 సంవత్సరాల మధ్య వయస్కుల్నే (ప్రాథ మిక–ఉన్నత విద్యా స్థాయి) తీసుకుంటే, ఈ సంఖ్య ఏటా తగ్గిపోతు న్నట్టు విద్యా శాఖ గణాంకాల్లో ఉంది. మొత్తం జనాభాలో 14 ఏళ్లలోపు వయస్కుల సంఖ్య 29.5 శాతం ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఇదే వయస్కులు 1971లో, నాటి మొత్తం జనాభాలో 41.2 శాతంగా ఉన్నారు. అప్పట్నుంచి ప్రతి పదేళ్ల జన గణనలోనూ ఇది తగ్గుతూ వస్తోంది. వృద్ధి రేటును నియంత్రించి జనాభా కట్టడిలో మనం సాధించిన సత్ఫలితాల వల్ల ఇలా జరిగి ఉండొచ్చు! పుట్టకపోతే అదో పద్ధతి. కానీ, పుట్టి నేలపైకి వచ్చిన అరు దైన, అపురూపమైన మానవవనరుల్ని పౌష్టికాహారం అందించలేక కోల్పోవడం కన్నా దురదృష్టకర పరిస్థితి ఇంకోటుండదు.
చిత్తశుద్ధితోనే అవగాహన వృద్ధి
ఆహారం సరిపోని పరిస్థితి వేరు! కానీ, ఏ ఆహారం ఏ పాళ్లలో తినాలో తెలియక ప్రాణాలమీదకు తెచ్చుకోవడం ఆందోళన చెందాల్సిన అంశం. పిల్లలు, తల్లుల్లోనే కాకుండా అన్ని వయస్కుల్లోనూ నేటి అనారోగ్య పరిస్థితులకు ప్రధాన కారణం పౌష్టికాహార లోపమే! తిండి, అందులో ఉండాల్సిన పోషక విలువలు, వాటి సమతుల్యతపై కనీస అవగాహన లోపించడం వల్లే ప్రమాద పరిస్థితులు. అందుకే, ‘కరోనా’ ఉపద్రవ నేపథ్యంలో డబ్లుహెచ్‌వో ఓ హెచ్చరిక చేస్తోంది. సరైన ఆహారం, ముందు జాగ్రత్తలకు కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తే సరిపోయే దానికి, నిర్లక్ష్యం చేసి తర్వాత వైద్యారోగ్యం కోసం వేల, లక్షల కోట్లు వ్యయం చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి అన్నది ఆ హెచ్చరిక సారాంశం. ఏ వైద్య పరీక్షలు చేయకుండానే ఈ దేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఇద్దరికి రక్త హీనత ఉందని చొప్పొచ్చు. ఏ ప్రమాణాలతో లెక్కించినా మహిళల్లో 65 శాతానికి తగ్గకుండా రక్తహీనత (సాధారణ, మధ్య, తీవ్ర స్థాయి)తో బాధపడుతున్నట్టు వైద్య గణాంకాలు చెబుతాయి.
రోజుకు ఒక మైక్రోగ్రామ్ ఇనుము (అంటే 50 గ్రాములకు తగ్గకుండా ఏ ఆకు/కాయ కూరలో) తీసు కుంటే జీవితంలో రక్తహీనత వచ్చే ఆస్కారమే ఉండదు. ఈ విషయాన్ని గ్రహించలేని స్థితిలో సగటు పౌరులుంటారు. ప్రజల్లో కనీస అవగాహన కలిగించే వాతావరణం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారి ఆర్థిక పరిస్థితికి లోబడి సమృద్ధ పౌష్టికాహారాన్ని తీసుకునే వీలున్నా ప్రాధాన్యతలు తెలియవు. ఆశా, అంగన్‌వాడీ కార్య కర్తలు చేయాల్సిన ప్రధాన విధి ఇదే! కానీ, అది ఆశించిన స్థాయిలో జరగదు. సర్వత్రా అవినీతి, నిర్లక్ష్యం, నియం త్రణ లోపం తాండ విస్తుంది. తినొద్దని వైద్యులు, ఆహార నిపుణులు చెప్పే ‘జంక్‌ఫుడ్’ తినండని చేసే కార్పొరేట్ ప్రచారం కొన్ని కోట్ల రూపాయలతో జరుగుతుంది. సంప్రదాయ మీడియా, సోషల్ మీడియా వేదిక నుంచి కుమ్మేసే ఈ ప్రచారం ముందు మన ప్రభు త్వాలు చేసే పౌష్టికాహార ప్రచార కార్యక్రమాలు ఎల్యీడీ బల్పుల ముందు కొవ్వొత్తి దీపాల్లా వెలవెలబోతాయి.
ప్రణాళికాబద్ధ కార్యక్ర మాలతో ఈ దేశంలో 27 కోట్ల మందిని దారిద్య్రరేఖ దిగువనుంచి పైకి తెచ్చి పేదరిక నిర్మూలన చేయడం ఘన విజయమే! పౌష్టికాహార లోపాన్ని అధిగమించే కృషి కూడా వ్యూహం, చిత్తశుద్దితో జరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో రూ. 344 కోట్ల అదనపు నిధుల్ని కేటాయించి బడి పిల్లల మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యం, సమృద్ధం చేసింది. అంగన్ వాడిల ద్వారా పిల్లలు, గర్భిణిలకు పౌష్టికాహారం అందించే కార్య క్రమాన్ని మెనూ మార్చి మరింత పకడ్బందీగా నిర్వహిస్తోంది. ఆహ్వానించదగ్గ ఈ చొరవను ఇతర రాష్ట్రాలూ అందిపుచ్చుకోవాలి. కేంద్రం, రాష్ట్రాలు పరస్పర సహకారం, అవగాహనతో బాధ్యతగా ఈ కృషి చేపట్టాలి. భారత రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాల (అధికరణం 47) ప్రకారం పౌష్టికాహార ప్రమాణాలను పెంచడం ప్రభుత్వ నిహిత బాధ్యత. తద్వారా పౌరుల ఆరోగ్య రక్షణ, జీవన ప్రమాణాల వృద్ధి ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం. ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాలు, పానీయాలు, డ్రగ్స్ వంటి వాటిని నిషేధించే అధికారం కూడా ఈ అధికరణం ద్వారా ప్రభుత్వానికి సంక్రమించింది.
సుస్థిరాభివృద్ధి సాధనలో మూలసూత్రమిదే!
ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 అంశాల సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో తొలి మూడు ఏదో రకంగా పౌష్టికాహారంతో ముడివడి ఉన్నవే! ప్రపం చంలో ఏ మూల, ఏ రూపంలో ఉన్నా పేదరికాన్ని నిర్మూలించాలి. ఎవరి పౌష్టికాహారానికి పేదరికం అవరోధం కాకూడదు. ఇక రెండో లక్ష్యం, ఆకలిని పూర్తిగా నిర్మూలించాలి. ప్రతి తొమ్మిది మందిలో ఒకరు ఆకలితోనే రాత్రి పడక ఎక్కుతున్నారు. ఇక మూడోది.. అన్ని వయసులకు చెందిన ప్రజలంతా ఆరోగ్యంగా, హాయిగా ఉండాలి. ఆరో లక్ష్యం అందరికీ రక్షిత నీరు, పదో లక్ష్యం అసమానతలు తగ్గిం చడం... ఇవన్నీ కూడా పౌష్టికాహార కల్పన వల్ల సాధ్యపడేవే. ప్రజలు అవగాహన పెంచుకోవడమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం, వరుస ప్రభుత్వాలు ఈ కృషిలో మొక్కవోని దీక్షతో ముందుకు కదిలితేనే లక్ష్యం సుసాధ్యం!
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
దిలీప్ రెడ్డి
ప్రాణం నిలిపే పోషణ ఏది?
Published Fri, Feb 7 2020 3:33 AM | Last Updated on Fri, Feb 7 2020 3:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment