కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ కాంతా రాజాతో తెలంగాణ బీసీ కమిషన్
విశ్లేషణ
బీసీల రిజర్వేషన్లు, సామాజిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం కోసం కర్ణాటక బీసీ కమిషన్ చేసిన కృషి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శనీయంగా నిలుస్తోంది. బీసీ జనాభా గణనలో పూర్తి పారదర్శకతను ప్రదర్శించిన దాని పనితీరు తెలంగాణ బీసీ కమిషన్‌కు కూడా మార్గదర్శకమవుతుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు, సామాజిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయవలసిందిగా బీసీ కమిషన్‌ను ఆదేశించింది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తమిళనాడు తరహాలో తెలంగాణలో బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న దృఢనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే బీసీ(ఇ) గ్రాఫ్‌లో ఉన్న ముస్లింలకు 12% రిజ ర్వేషన్లను ప్రకటించారు. అలాగే బీసీలకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలన్న తలంపులో ఉన్నారు. కర్ణాటకలో బీసీ కమిషన్ చేస్తున్న పనివిధానాన్ని, బీసీల రిజర్వేషన్ల కోసం చేస్తున్న కృషిని అధ్యయనం చేసేందుకు సెప్టెంబర్ 11,12 తేదీలలో బీసీ కమిషన్ కర్ణాటకకు వెళ్లింది. కర్ణాటక బీసీ కమిషన చైర్మన్ కాంతా రాజాతో, కమిటీ సభ్యులతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించింది. ఆ రాష్ట్ర కమిషన్ అనుభవాలు, వాళ్లకెదురైన సవాళ్లను తెలంగాణ బీసీ కమిషన్ తెలుసుకుంది.
కర్ణాటక బీసీ కమిషన్ ఆ రాష్ట్రంలోని అన్ని వర్గాల, కులాల సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ఎంతో శ్రమించింది. ఇందుకోసం ఆ రాష్ట్ర కమిషన్ మునుపటి బీసీ కమిషన్లు చేసిన కృషిని, పురోగతిని సమీక్షించింది. ప్రధానంగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు కమిషన్ వేసే ప్రతి అడుగులో జాగ్రత్తలు తీసుకుంది. బీసీ కమిషన్ చేసే అధ్యయనాన్ని సవాల్ చేస్తూ కొందరు విమర్శలు చేశారు. కానీ కూడా దీక్షతో కర్ణాటక బీసీ కమిషన్ తన నివేదికను పూర్తిచేసింది. కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ సామాజిక, విద్యారంగాలలో మొత్తం కర్ణాటకలోని అన్ని కుటుంబాల దగ్గరకు వెళ్లి సర్వే చేసింది. ఈ సర్వేని 2015లో చేపట్టారు. ఈ సర్వేలో సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికపరంగా బీసీల స్థితిగతులు ఎలాగున్నాయో సమగ్రంగా సమాచారాన్ని సేకరించింది.
మొత్తం సమగ్ర కుటుంబ సర్వేకు కమిషన్ తయారుచేసిన ధరఖాస్తుఫామ్‌ల రూపకల్పనకు ఎంతో శ్రమించారు. జనాభా గణనకు ఈ సర్వే ఫామ్ ప్రాణంలాంటిది. ఇందులో 55 ప్రశ్నలతో ఫామ్ 3ను తయారు చేశారు. ఈ ఫామ్‌లో సర్వేకు సంబంధించి కులాల వారీగా కోడ్‌నెంబర్లు ఇచ్చారు. ఒక వేళ కమిషన్ దృష్టికి రాని కులాలు ఉంటే వాటిపేర్లను ఆ ధరఖాస్తు ద్వారా ఆ లిస్టులో రాతపూర్వకంగా రాయిం చారు. ఫామ్ 3లో 55 ప్రశ్నలను ఆ నేపథ్యంలోనే తయారు చేశారు. సామాజిక, విద్యా, ఆర్థిక, రాజకీయపరమైన వెనుకబాటుతనాలపైన కూడా ప్రశ్నలున్నాయి. ఫామ్ 3లో 1 నుంచి 30 ప్రశ్నల వరకు వ్యక్తిగత సమాచారం, చదువు, వృత్తి, ఉద్యోగం, ఓటర్‌కార్డు, ఆధార్‌కార్డు, వ్యవసాయం, రాజకీయం, సామాజిక అంశాలపై ప్రశ్నలున్నాయి. 40% నుంచి 55% వరకు కుటుంబ వివరాలు, ఏ కుటుంబానికి ఎంత ఆస్తి ఉంది? తదితర వివరాలు ఇందులో ఉన్నాయి.
ఈ సర్వే అంతా ఎన్యుమరేటర్స్ ద్వారా చేశారు. వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చి దానిపై సంతకం చేయాలి. ఆ వ్యక్తిగత సమాచారంతో పాటు ల్యాండ్‌ఫోన్, సెల్ నెంబర్లను కూడా ఈ దరఖాస్తుపై రికార్డు చేశారు. ఇలా తీసుకున్న సమాచారం సరైనదని రూఢీగా చెప్పగలగాలి. అందుకే ఫామ్ 3ను తయారు చేయటం జరిగింది. ఈ సర్వే ద్వారా సమాజాన్ని విభజిస్తున్నారని, కమిషన్ చేపట్టిన జనాభాగణన సక్రమంగా లేదని కూడా కొందరు ఆరోపణలు చేశారు. వీటన్నింటికీ సమాధానంగా కమిషన్ ఫామ్ 3ను ఆధారంగా నిలిపింది.
3 దశల్లో పని విస్తరణ: జనాభా గణనకు, గడపగడప సర్వేను చేపట్టడం కర్ణాటక కమిషన్‌కు కత్తిమీద సాముగా మారింది. దీనికోసం అపాయింట్‌మెంట్, ట్రైనింగ్, ఫీల్డ్ వర్క్ అన్న మూడు దశలలో పనిచేశారు జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్లు, కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈఓలు జిల్లాల్లో జరిగే సమగ్ర కుటుంబ సర్వేకు అగ్రభాగాన నిలిచారు.
ఎన్యుమరేటర్లకు ప్రత్యేక శిక్షణ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిం చిన జనాభాలెక్కల సమాచార సేకరణలో అనుభవమున్న వ్యక్తులను ఎన్యుమరేటర్లుగా నియమించుకోవటంతో పాటు వీరికి ప్రత్యేక శిక్షణనివ్వాలి. వీరిని గైడ్ చేసేందుకు రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో శిక్షణాకార్యక్రమాలు చేపట్టారు.
జనాభా గణనలో టీచర్లే కీలకం: మనదేశంలో జనాభాగణన విషయంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. ఒక ఎన్యుమరేటర్‌కు 120 నుంచి 130 కుటుంబాల వరకు సర్వే చేయాలి. కర్ణాటకలో మొత్తం 1 కోటి 33 లక్షల కుటుంబాలున్నాయి. వీరి కుటుంబాల నుంచి సమాచారం సేకరించేందుకు 1.60 లక్షల మంది ఎన్యుమరేటర్లను ఎంచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన కులగణనను 2015 ఏప్రిల్ 11 నుంచి 30 వరకు కర్ణాటకలో 20 రోజుల్లోనే పూర్తి చేశారు. గ్రామాల్లో కులవృత్తి ద్వారా చేస్తున్న పని, కులానికి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ఈ వర్గాలవారు ఉత్సాహంగా ముందుకొచ్చారు. బెంగుళూరు, మైసూరు, వంటి ప్రధాన పట్టణాలల్లో 3 సార్లు ప్రత్యేకంగా సర్వేచేశారు.
సర్వే ఫామ్‌ల కోసం నిపుణుల కమిటీ: 1,2,3 సర్వేఫామ్‌లు తయారు చేయటానికి కమిషన్ మేధావులతో సమావేశాలు జరిపి నిపుణుల కమిటీలను వేసింది. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఏఏ కులాలు ఎలా వెనుకబడివున్నాయో సమగ్ర సమాచారం సేకరించాలని నిపుణుల కమిటీ కర్ణాటక కమిషన్‌కు సూచిం చింది. అర్బన్‌స్లమ్‌లు, రూరల్ స్లమ్‌లతో పాటు బాగా వెనుకబడిన వర్గాలు, సంచారజాతులపై 7 నుంచి 8 వరకు ప్రశ్నలు రూపొందిం చారు. ఈ సూచనలతోపాటు వెనుకబాటుతనాన్ని ఎలా తేల్చిచెప్పాలన్న దానిపై కర్ణాటక కమిషన్ ప్రజాభిప్రాయసేకరణను కూడా చేపట్టింది.
ప్రాథమిక డేటా, సెకండరీ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ డేటా ఈ రెండిం టిని క్రాస్‌చెక్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ డేటా కోసం పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు సమగ్ర సమాచారం తీసుకోవాలి. సెక్రటేరియట్ దగ్గర నుంచి వివిధ ప్రభుత్వశాఖల నుంచి అన్ని రకాల ఉద్యోగుల సమాచారాన్ని సేకరించాలి. ఇలా సేకరించిన సమాచారంతో ప్రాథమిక డేటాను సెకండరీ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ డేటాతో లెక్కకట్టి చూడాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో జరిపిన సర్వేకు బలం చేకూరుతుంది. ఇలా కర్ణాటక బీసీ కమిషన్ చేసిన కృషికి తుది రూపం వచ్చింది. 2015లో దేవరాజ్ ఆర్స్ జయంతి సందర్భంగా కర్ణాటక బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికనిచ్చింది. ఇపుడు బీసీల కోసం చేసిన సమగ్రమైన నివేదికను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. కర్ణాటక బీసీ కమిషన్ బీసీల జనగణనకోసం చేసిన సర్వే తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలకూ శాస్త్రీయ ప్రాతిపదికను కల్పిస్తోంది.
జూలూరు గౌరీశంకర్
వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు
మొబైల్ : 94401 69896
Comments
Please login to add a commentAdd a comment