దేశ ప్రధానిగా మాత్రమే కాదు.. మహా మేధావిగా, బహుభాషా కోవిదుడిగా, పాలనాదక్షుడిగా, రచయితగా పేరుప్రఖ్యాతులు గడించిన స్వర్గీయ పీవీ నరసింహారావు ఆదినుంచీ సంస్కరణాభిలాషి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యామంత్రిగా పనిచేసినప్పుడే ఆయన ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చి ఆ రంగంపై తనదైన ముద్ర వేశారు. ఆ సంస్కరణల వల్ల నిరుపేద వెనుకబడిన వర్గాలకు కూడా నాణ్యమైన గురుకుల విద్య అందుబాటులోకి వచ్చింది. అనంతరకాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలోనే తొలిసారి భూసంస్కరణలు అమలు చేశారు. ఆ రోజుల్లో ఆ చర్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
ఒక పాలకుడు తనంత తాను భూసంస్కరణలు అమలు చేసే సాహసం ఎక్కడా చేయలేదు. రాజకీయాలను శాసించే భూస్వామ్య వర్గాలకు ఆగ్రహం కలిగితే సమస్యలొస్తాయని వారు భావించారు. కానీ పీవీ భిన్నమైన రాజకీయ నాయకుడు. ఆయన జాతీయోద్యమంలో కార్యకర్తగా పనిచేసినవాడు. వందేమాతరం గీతాన్ని ఆలపించి కళాశాల నుంచి బహిష్కరణకు గురైనవాడు. ఆ తర్వాతకాలంలో రహస్య జీవితంలోకి వెళ్లి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించడం, తోటి యువకులకు తుపాకీ కాల్చ డంలో శిక్షణనీయడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఆయన ప్రధానిగా మాత్రమే కాదు...మహామేధావిగా, పాలనా దక్షుడిగా, బహుభాషా కోవిదుడిగా, రచయితగా అందరికీ గుర్తుండిపోతాడు. ప్రతిభాపాటవాల్లో తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు దీటైన నేత. తెలంగాణ మట్టిలో పుట్టిన మాణిక్యం. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి తన ప్రతిభతో ఎదుగుతూ, 1957లో మొదటిసారి మంథని నుంచి ఎంఎల్‌ఏగా ఎన్నికైనారు.
మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీ నమ్మినబంటుగా వుండి, శ్రీమతి ఇందిరాగాంధీ ఆంతరంగిక వర్గంలో ఒకరిగా మెలిగిన పీవీ అనుకోని పరిస్థితులలో యాదృచ్ఛికంగా ప్రధాని అయ్యారు. అప్పుడు కాంగ్రెస్‌కి పార్లమెంటులో చాలినంత బలం లేదు. ప్రభుత్వాన్ని నడపడం కత్తిమీద సాము. దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయి, మన బంగారం నిల్వ లను విదేశాలలో కుదువ పెట్టి అప్పు తెచ్చుకుం టున్న పరిస్థితి. ఈ పరిస్థితులలో ప్రధాని పదవి ఒక ముళ్ళకిరీటం. ఆ కిరీటాన్ని పీవీ ధరించి, చాణక్య నీతితో ప్రతిపక్షాలను కలుపుకుపోతూ మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతూ, దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది విదేశాలలో కుదువ పెట్టిన బంగారాన్ని తిరిగి తెప్పించి దేశ ప్రతిష్టను కాపాడడమే కాక కాంగ్రెస్ పార్టీని బతికించారు.
ఇంత చేసినా కాంగ్రెస్ నాయకులకే పీవీ మీద గౌరవ మర్యాదలు లేవు. ప్రధానిగా వున్నప్పుడే కుట్రలు, కుతంత్రాలు పన్నారు. ప్రధానిగా ఆయన ఐదేళ్ళ పదవీకాలం జయప్రదంగా పూర్తి చేసుకుంటే ఓర్వలేకపోయారు. ఆయనపై చిల్లర మల్లర కేసులు పెట్టించి, కోర్టుల చుట్టూ తిప్పించారు. కష్టకాలంలో ఒక్కరూ అండగా నిలువలేదు. మరణానంతరం కూడా ఒక ప్రధానిగా పనిచేసిన వ్యక్తి పార్థివదేహానికి లభించవలసిన గౌరవాలు ఆయనకు దక్కనివ్వలేదు. దేశ రాజధానిలో ఆయన స్మృతి చిహ్నానికి ఒప్పుకోలేదు. కనీసం పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయం ప్రాంగణంలోకి కూడా రానివ్వలేదు. పార్థివ దేహాన్ని హైదరాబాద్ తెచ్చి దహన సంస్కారాలు చేశారు. ఇక ఆయనను మర్చిపోయారు. ఆయన గురించి ప్రస్తావించడమే మహా నేరంగా భావించారు కాంగ్రెస్ పెద్దలు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014 జూన్‌లో తెలంగాణ బిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే భూస్థాపితమైన పీవీ ప్రతిష్టను పునరుద్ధరించారు. ఆయన మేధా సంపదను, రాజనీతిజ్ఞతను లోకానికి చాటారు. ఆయన వారసత్వాన్ని కాపాడుకోవలసిన అవసరం ప్రతి తెలంగాణ వ్యక్తికి ఉందని చాటారు. ప్రతి సంవత్సరం ఆయన జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించడం ప్రారంభించారు. ఏడాదిపాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే శతజయంతి ఉత్సవాలను జూన్ 28న ప్రారంభించారు. నగరాలు, పట్టణాలలో పీవీ శతజయంతి ఉత్సవ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. 54 దేశాలలో ఈ ఉత్సవాలను ఇంతే ఘనంగా నిర్వహించడానికి అక్కడి తెలుగు సంఘాల ప్రతినిధులతో చర్చించి ఏర్పాటు చేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇది తెలంగాణ బిడ్డగా పుట్టి జాతిరత్నంగా ఎదిగిన ఒక మహనీ యునికి ఇస్తున్న ఘననివాళి.
కోలేటి దామోదర్
వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్
మొబైల్ : 98491 44406
Comments
Please login to add a commentAdd a comment