
ఎత్తయిన ప్రదేశం మీద నివాసం ఉంటున్నప్పుడు మనసుని పనిగట్టుకుని ఉన్నతమైన పీఠం మీద ఆసీనం చేయించవలసిన అవసరం ఏముంటుంది?! మనిషి ఏళ్లుగా ఒక ప్రదేశంలో ఉంటున్నప్పుడు మనసు ఆ ప్రదేశంలో ఒక భాగంగా కాక.. మనసే ప్రదేశంగా, ప్రదేశమే మనసుగా కలిసిపోతాయి. ప్రదేశంలోని ఔన్నత్యం మనసును పైకి లాక్కుంటే, మనసులోని ఔన్నత్యం ప్రదేశాన్ని లోపలికి లాక్కుంటుంది. అప్పుడు రాళ్లూ ఇటుకల ఆరామమేదో, సిరలూ ధమనుల శరీరమేదో కనిపెట్టడం శాస్త్ర పరిశోధకులకైనా సాధ్యమయ్యే పనేనా?! ‘నేను కనిపెట్టగలను’ అని వచ్చినట్లుగా వచ్చారు ఆ వేళ నా ఆరామానికి ఒక స్త్రీమూర్తి. ‘‘నేను బీబీసీ నుంచి లామాజీ. రజినీ వైద్యనాథన్ నా పేరు’’ అన్నారు వారు. మనిషి చురుగ్గా, బక్క పలుచగా ఉన్నారు. ఇప్పటివరకు వారి ప్రశ్నలకు లభించిన సమాధానాలేవీ వారి మనసుకు, దేహానికీ సంతృప్తికరమైన పౌష్టికతను ఇవ్వలేక పోయినట్లున్నాయి. పైపైన మాత్రమే మనిషిని కనిపెట్టగలిగిన వారు, పైపై ప్రశ్నలు మాత్రమే వేయగలరు.
‘‘లామాజీ.. అనేకానేకమైన ప్రశ్నలతో నేను మీ దగ్గరకు వచ్చాను. అయితే అవన్నీ కూడా గొప్ప జీవిత పరమార్థాన్ని కాక, మానవ స్వాభావికమైన అల్పత్వాన్ని కలిగి ఉండొచ్చు. నా ప్రశ్నల్లా మీ సమాధానాలు కూడా ఐహిక స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే నేను అర్థం చేసుకోగలనేమో లామాజీ..’’ అన్నారు వారు. ‘‘కింద ఉన్నవారికి పైన ఉన్నవారు కనిపించనప్పుడు, పైన ఉన్నవారే కిందికి చూసి, కనిపించాలి. ఔన్నత్యంలోని అంతరార్థమే ఇది. అమ్మాయీ.. మీరు గమనించారా.. హిమాచల్‌ప్రదేశ్‌లో నింగి ఈ ప్రపంచాన్ని ఎప్పుడూ వంగి చూస్తున్నట్లుగానే ఉంటుంది’’ అని నవ్వాను. వారు అడగడం ప్రారంభించారు. ‘‘ట్రంప్ ఎలాంటి వారు లామాజీ?’’ అన్నారు. ‘‘అమెరికా ఫస్ట్’ అన్నారు ట్రంప్. అది మంచి విషయం. ట్రంప్‌కి విలువల్లేవు. అది చెడ్డ విషయం’’ అన్నాను. ‘మనిషికి విలువల్లేనప్పుడు ఆ మనిషి అవలంబించే విధానాలకు మాత్రం విలువేముంటుంది?’ అన్నట్లు చూశారు వారు! తర్వాత ఇంకో ప్రశ్న అడిగారు. ‘‘శరణార్థుల పట్ల ఐరోపా ఎలా ఉండాలి?’’ అన్నారు. ‘‘రానివ్వాలి. బతకడం ఎలాగో నేర్పించి, తిరిగి వారి స్వదేశానికి పంపించాలి’’ అన్నాను.‘‘బతకడం నేర్చుకున్నాక, అక్కడే ఉండిపోవాలని ఎవరైనా అనుకుంటే?’’ అని వారు అడిగారు.
‘‘అప్పుడు యూరప్ మొత్తం ముస్లింల ఖండం అయిపోదా?’’ అన్నాను. ‘చైనా టిబెట్‌ను ఆక్రమించినప్పుడు మీరూ ఇండియాకు శరణార్థిగా వచ్చిన వారే కదా.. ఇండియా ఇండియా కాకుండా పోయిందా’ అన్నట్లు చూశారు వారు నన్ను! తర్వాత ఇంకో ప్రశ్న అడిగారు. ‘‘మీ తర్వాత, మీ వారసత్వంగా రావాలని మీరు కోరుకుంటున్న మహిళా దలైలామా ఎలా ఉండాలి?’’ అన్నారు. ‘‘ఆకర్షణీయంగా ఉండాలి. చూడాలనిపించేలా’’ అన్నాను. ‘‘ఆకర్షణ అంతస్సౌందర్యంలో కదా కనిపించాలి’’ అన్నారు వారు. ‘‘లోపలా ఉండాలి, బయటా ఉండాలి. రెండూ ఒకదాన్నొకటి ప్రతిఫలించుకుంటూ ఉండాలి’’ అన్నాను.
వారేమీ మాట్లాడలేదు! ‘దలైలామా కూడా బాహ్యసౌందర్యం గురించి మాట్లాడతారా..!’ అన్నట్లు చూశారు. నా మాటల్లోని సూక్ష్మార్థాన్ని వారు సరిగా గ్రహించినట్లు లేరు. దలైలామా అయ్యేవారెవరైనా పసివయసులోనే అవుతారు. పసితనంలో మనిషికొక సౌందర్యం, మనసుకొక సౌందర్యం ఉంటుందా?!