జస్టిస్ చంద్రచూడ్‌కు కృతజ్ఞతలు! ‘ప్రజలు తమ దేశభక్తిని బాహాటంగా ఎందుకు ప్రదర్శించాలి’ అంటూ గత మూడేళ్లుగా లక్షలాది మంది అడుగుతూ వస్తున్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఈ ప్రశ్నలోని పదాలను సువర్ణాక్షరాలతో లిఖించవలసి ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వాటిని చూసేలా ప్రత్యేకించి నరేంద్రమోదీ ప్రభుత్వంలోని మంత్రులు, వారి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సహచరులు కూడా చూసేలా వాటిని కొట్టొచ్చేలా కనిపించే ప్రాంతంలో ఉంచాలి. విషాదమేమిటంటే జస్టిస్ చంద్రచూడ్ తోటి న్యాయమూర్తుల్లో కొందరు కూడా వాటిని చూడాల్సి ఉంది.
సినిమా ప్రారంభంలో జాతీయగీతాన్ని తప్పకుండా ఆలపించేలా ఏర్పాటు చేయాలంటూ గత ఏడాది నవంబర్ 30న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాల్సిందిగా తన ముందుకు వచ్చిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ తన అభిప్రాయాన్ని అత్యంత స్పష్టంగా చెప్పారు. ‘జాతీయగీతాన్ని సినిమా హాళ్లలో ఆలపించనట్లయితే మనం దేశభక్తులం కానట్లుగా మనమెందుకు భావించాలి.. మీ దేశభక్తిని నిరూపించుకునేందుకు జాతీయ గీతాన్ని మీరు ఆలపించాల్సిన పనిలేదు... సుప్రీంకోర్టు ద్వారా దేశభక్తిని ప్రజలకు అలవర్చలేము’.
దీనికి పూర్తి భిన్నంగా భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ భావిస్తున్నదేమిటో ఆయన మాటల్లోనే విందాం. ‘మతం, కులం, ప్రాంతంపై ఆధారపడి ఉన్న విస్తృత వైవిధ్యపూరితమైన కారణాల వల్ల, థియేటర్లలో జాతీయగీతాన్ని ప్రదర్శించడం ద్వారా ఒక ఏకీకృత శక్తిని తీసుకురావడం అవసరంగా మారింది. ఆవిధంగా ప్రజలు థియేటర్లలోంచి బయటకు వచ్చినప్పుడు వాళ్లందరూ భారతీయులుగా ఉంటారు’.
అటార్నీ జనరల్ వాదన నన్ను కలవరపెడుతోంది. మనం సినిమా హాల్‌లోకి ప్రవేశించడానికి ముందు, జాతీయ గీతాన్ని ఆలపించడానికి ముందు మనం ఎవరం అని ఆయన భావిస్తున్నారో ఆ మునుపటి హోదా గనుక ఆయనకు అంగీకారయోగ్యమైతే ఆ తరువాత కూడా అది ఎందుకు అంగీకారయోగ్యం కాదు? జాతీయగీతాన్ని ఆలపించినంత మాత్రాన అది మన జాతీయతను లేదా దేశం పట్ల మన ప్రేమను, అభిమానాన్ని మార్చదని వేణుగోపాల్ గ్రహించడం లేదా?
జస్టిస్ చంద్రచూడ్, వేణుగోపాల్ ఇద్దరూ జాతీయగీతాన్ని ఒక ప్రతీకగా ఆమోదిస్తున్నారు. అయితే జాతీయగీతం పట్ల మనం మరీ ఆర్భాటాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదని జస్టిస్ నమ్ముతున్నారు. జాతీయగీతం పట్ల మన మనసులో విశ్వాసం ఉంటే చాలు. మరోవైపున వేణుగోపాల్ అభిప్రాయం ప్రకారం ఒక ప్రతీకగా జాతీయగీతమే సర్వస్వం అన్నమాట. మీ మనసులో ఉన్న దాన్ని బయటకు వ్యక్తపరచాల్సి ఉందని ఆయన భావన. నిజానికి, జాతీయగీతం, జాతీయపతాకం లేదా భారత్ మాతాకి జై వంటి నినాదాలు మన మనోభావాలను వ్యక్తపర్చలేవు.
బహుశా, స్వాతంత్య్రం సిద్ధించిన తొలి రోజుల్లో ఈ ప్రతీకలు అవసరమయ్యే ఉంటాయి. ఆనాడు మన దేశం దుర్బలంగా ఉండేది. కాబట్టే అప్పట్లో అభద్రతతోపాటు జాతికి తనపై తనకు నమ్మకం ఉండేది కాదు. 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆనాటి పరిస్థితి లేదు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్న భారత ప్రజలు తమ దేశభక్తిని నిరూపించుకోవలసిన అవసరంకానీ, విభేదిస్తున్న వారి దేశభక్తిని ప్రశ్నించవలసిన అవసరం కానీ లేవు. వేణుగోపాల్‌ని తీవ్రంగా భయపెడుతున్న భిన్నత్వం అనేది నిజానికి మన బలమే కానీ బలహీనత కాదు. భారతీయులుగా ఉండటంలోని సౌందర్యాన్ని మన వివిధ మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, శరీరచ్ఛాయలు, వంటల రకాల్లో మనం వ్యక్తపర్చగలం. మనకు ఇక అవసరం లేదని దశాబ్దాల క్రితమే వదిలించుకున్న ఒక వాడుకను మళ్లీ తీసుకురావడం ద్వారా గత నవంబర్‌లో సుప్రీం కోర్టు ఘోర తప్పిదానికి పాల్పడింది. ఈ అవివేకపు నిర్ణయానికి కారణమైన ధర్మాసనానికి, ప్రస్తుతం భారత సర్వోన్నత న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తే ఆనాడు నేతృత్వం వహించారు. తన చీఫ్ జస్టిస్ ఆనాడు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా.. నేడు మాట్లాడినందుకు జస్టిస్ చంద్రచూడ్‌ని అభినందిస్తున్నాను.
జాతీయ సంక్షోభం నెలకొన్న సమయాల్లో దేశభక్తి ఒక మనోభావంగా అవసరమని లేక జాతి ఉల్లాస స్థితిని అనుభవిస్తున్న సందర్భాల్లో అది సహజమైనదని అదనంగా జోడిస్తే జస్టిస్ చంద్రచూడ్ తోసిపుచ్చుతారని నేనైతే భావించడం లేదు. కానీ అలాంటి సందర్భాల్లో కూడా దేశభక్తి భావన అప్రయత్నంగా మనలో వ్యక్తం కాకపోతే మీరు దాన్ని బలవంతంగా చొప్పించలేరు. ఇతరత్రా సందర్భాల్లో అది చాలావరకు మనలోని దురభిప్రాయాలకు, విభజనకు సంబంధించిన మొరటు వ్యక్తీకరణగా ముందుకొస్తుంది.
జస్టిస్ చంద్రచూడ్ సంధించిన మహత్తర ప్రశ్నలో.. ‘నీతిమాలినవాడి చివరి నెలవు దేశభక్తి’ అంటూ శామ్యూల్ జాన్సన్ పేర్కొన్న ఆ అమృతోపమానమైన పదాలను కూడా చేర్చుకోవాలి.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net
Comments
Please login to add a commentAdd a comment