ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడో కొత్తగాలి వీస్తోంది. పలువురి భయ–సందేహాలను తుడిపేస్తూ, సరికొత్త ఆశల్ని చిగురింప చేస్తూ పిల్ల తెమ్మెరలా మొదలైన ఆ గాలి రోజురోజుకూ బలపడుతోంది. మార్పులకు వాకిళ్లు తెరుస్తోంది. రాజకీయంగానే కాక ఆ గాలి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకూ సంకేతాలిస్తోంది. దాన్ని గుర్తించడం, అంగీకరించడం, ఆహ్వానించడం ఇప్పుడు ప్రధానం! ఎన్నికల ముందు తానిచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలుపరుస్తున్న తీరు, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలి... ఈ కొత్తగాలికి కారణం. అక్రమ నిర్మాణాల్లో తలదాచుకునగోరే ‘దశాబ్దాల అనుభవం’ కన్నా, నేలతో, అడవితో, అట్టడుగు మట్టి మనుషులతో మమేకమైన ‘నెల యోధుడి’ చొరవనే సరైన పాలనకు సంకేతమని జనన్నినాదం!
రాజకీయాల్లో మార్పు రావాలన్నది చాలా కాలంగా ప్రజల ఆశ. అనేకుల ఆకాంక్ష. కవుల కల్పన. కళా ప్రక్రియల్లో వస్తువు. ప్రసంగాల్లో ఆదర్శం. కానీ, ఆచరణలో లోపం! ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడో కొత్తగాలి వీస్తోంది. పలువురి భయ–సందేహాలను తుడిపేస్తూ, సరికొత్త ఆశల్ని చిగురింప చేస్తూ పిల్ల తెమ్మెరలా మొదలైన ఆ గాలి రోజు రోజుకూ బల పడుతోంది. మార్పులకు వాకిళ్లు తెరుస్తోంది. రాజకీయంగానే కాక ఆ గాలి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకూ సంకేతాలిస్తోంది. దాన్ని గుర్తించడం, గుర్తించడం కన్నా ముఖ్యంగా అంగీకరించడం, అంతకన్నా ప్రధానంగా ఆహ్వానించడం ముఖ్యం! ప్రముఖ కవి, రచ యిత, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న మాటల్లో చెప్పాలంటే.... ‘‘పార్టీ పిరాయింపులు మంచిది కాదని నేనీ సినిమాలో పాట రాసిన, కవులు పాటలు రాస్తరు, ఊహ చేస్తరు, ప్రజాస్వామ్యవాదులు, దార్శనికులు, దర్శకులు ఉన్నతమైన ఊహ చేస్తరు... కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఆచరించి చూపాడు, అది ముఖ్యం..’’ అన్నారు.
ఇంకో పార్టీ తరపున ఎన్నికై తమ పార్టీలోకి వస్తా మంటే వారిని తాము చేర్చుకోమని, ఫిరాయింపుల్ని ప్రోత్సహించబో మని, పదవులకు రాజీనామా చేయాల్సిందే... అన్నారంటూ ఆ సంద ర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా గురించి మాట్లాడుతూ వెంకన్న ఈ వ్యాఖ్య చేశారు. దేశంలో పార్టీ ఫిరాయింపులొక ప్రహసనంగా మారి మార్కెట్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నపుడు, చట్టసభ వేదిక నుంచి ఏపీ ముఖ్యమంత్రి ఓ చరిత్రాత్మక ప్రకటన చేశారు. ‘...ఏమరుపాటుగా ఎవరైనా అలా పార్టీ మారి సభ కొచ్చినా... మీ అధికారాన్ని వినియోగించి ఆ సభ్యుల్ని అనర్హులుగా ప్రక టించండి’ అని స్పీకర్‌ను స్వయంగా కోరారు. పార్టీలకతీతంగా, విలు వలతో నడవాల్సిన స్పీకర్ స్థానపు ఔన్నత్యాన్ని అలా గుర్తు చేశారు. స్పీకర్ ఎన్నిక సందర్భంలో మాట్లాడుతూ ఈ సాహసోపేతమైన విలు వను సీఎం ప్రకటించారు. కానీ, ఈ చొరవకు జాతీయ మీడియాతో సహా ప్రసార మాధ్యమాలు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. పేరున్న ఇంగ్లీష్ పత్రికలు కూడా సాదాసీదాగానే రాశాయి. పార్టీ ఫిరాయింపులతో రాజ కీయ విలువలు దిగజారుతున్న ఈ తరుణాన వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి చూపిన చొరవ విస్తృతస్థాయిలో చర్చ జరగాల్సింది.
ఒకటి, రెండు కాదు...
గత నెలాఖరున ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన నుంచి ఒకటొ కటిగా జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకట నలు, వెల్లడిస్తున్న అభిప్రాయాలు తెలుగువాళ్లను ఎంతగానో ఆకట్టుకుం టున్నాయి. ఒక రకమైన సంతృప్తి వెల్లువ ఇపుడు రాష్ట్రమంతా అలుము కొని ఉంది. సామాన్య ప్రజానీకం నుంచి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, ఆలోచనాపరుల వరకు అందరూ తాజా పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. గతంతో పోల్చి చూసుకొని, ఏదో తెలియని ‘హాయి’ని పొందుతున్నారు. గిట్టని వాళ్లు, వారి అను‘కుల మీడియా’ పుణ్యమా అని లోగడ ఎంత దుష్ప్రచారం జరిగింది? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రత్యర్థి రాజకీయ వర్గాల్లోని వారికీ, తాజా స్థితి కొంత ఆశ్చర్యంగానే ఉంది.
ఎన్నికలకు ముందు ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు, కల్పించిన భరోసా, ప్రకటించిన హామీలు క్రమ క్రమంగా ఆచరణలోకి వస్తున్న తీరు అధికుల్ని విస్మయ పరుస్తోంది. ఏ హంగూ, ఆర్భాటం, నాటకీయత లేకుండా... ఇంత సహజంగా కార్యా చరణ సాధ్యమా? అన్నది వారి ముందొక పెద్ద ప్రశ్న. ఇది విలువల రాజకీయాల్ని పరిచయం చేస్తున్న కొత్తగాలి అనేది వారి భావన. తొలి సంతకం నుంచి ‘అమ్మ ఒడి’ ఇంటర్ విద్యార్థులకు వర్తింపజేస్తామన్న గురువారం నాటి ప్రకటన వరకు... జనహితంలో ఎన్నెన్ని నిర్ణయాలో! బడుగు బలహీన వర్గాలకు సమున్నత స్థానం కల్పిస్తూ మంత్రివర్గాన్ని కూర్చిన తీరు సంచలనమే అయింది. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన దానికన్నా పిసరంత ఎక్కువే తప్ప లోపం లేదు. డొల్లతనం లేదు, నాన్చుడు లేదు, డొంక తిరుగుడు అంతకన్నా లేదు.
‘ఆశా’కార్యకర్తల జీతాలు వృద్ధి, హోంగార్డులు, పారిశుధ్య పనివారల వేతనాల పెంపు, ఉద్యోగుల సీపీఎస్ రద్దు–ఐ.ఆర్ ప్రకటన, రైతు పెట్టుబడి సహాయాన్ని ముందుకు జరపడం, పోలీసుల వారంతపు సెలవు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం... ఇలా చెప్పుకుంటూ వెళితే జాబితా పెద్దదే! ఇదొక ఆత్మీయ ప్రభుత్వంలా ఉంది. ఓదార్పు, ప్రజాసంకల్ప పాదయాత్ర, దీక్షలు... ఏదయితేనేం, పార్టీ స్థాపించక ముందు నుంచి నేటికీ, నిరంతరం ఆయన ప్రజల్లో ఉండటం వల్లనేమో ‘కొత్త సీఎం’ అన్న భావనే ప్రజలకు కలగటం లేదు. సీఎంని, ఆయన ప్రభుత్వాన్ని తమ నిజమైన ప్రతినిధిగా పౌరులు భావిస్తున్నారు. కొత్త శాసనసభ తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు చెబుతూ, ‘ఎన్నికల వరకే రాజకీయాలు... గెలిచాక తరతమ భేదాల్లేవు, మనం ప్రజలందరికీ ప్రతినిధులం, జవాబు దారులం’ అన్న సీఎం మాటలు విశ్లేషకులకు తరచూ గుర్తొస్తున్నాయి.
కుటుంబపెద్దను చూస్తున్న యంత్రాంగం
స్వల్ప కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు తమ రాజకీయ పెద్ద దాదాపు అర్థమైపోయాడు. నస లేదు, సోది ప్రసంగాలకు తావే లేదు. ఏదైనా... లోతైన పరిశీలన, అధ్యయనంతోనే మాట్లాడటం. అదీ, ఆత్మీ యంగా! మర్యాదకు ఎక్కడా లోటు లేదు. ముక్కుసూటిగా, ముక్తసరిగా తన మనోభావాల్ని వ్యక్తం చేయడం. ఏది వద్దో చెప్పడం, ఏది కావాలో విస్పష్టంగా అడగటం, ఇది వారికీ బాగుంది. సాంకేతికాంశాలపైన కూడా సాధికారతతో సీఎం జరిపిన పోలవరం రివ్యూని పలువురు ఇంజనీరింగ్ సీనియర్లు మననం చేసుకుంటున్నారు. ఇదివరకటి చేదు అనుభవాల దృష్ట్యా, ఇప్పుడు ముఖ్యమంత్రి సమీక్షల్లో పాల్గొంటున్న ఉన్నతాధికారులు భిన్నమైన వాతావరణం చూస్తున్నారు. గంటల తర బడి వేధింపుల పర్వం లేదు. లోపలొకటి బయటొకటిగా కాకుండా ఉన్న దున్నట్టుగా మాట్లాడుతూ, తమకు ఇరకాట పరిస్థితి కల్పించని నాయ కత్వం అనే భావన వారిలో వ్యక్తమౌతోంది.
‘పాలకులం కాదు, ప్రజా సేవకులం...’ అన్న ముఖ్యమంత్రి సందేశం అధికారులకు బోధపడింది. ‘మాకు ఓటు వేయని వారికి కూడా మన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందాలి. వారు అర్హులైతే చాలు! అదే ప్రాతిపధిక .... కాల క్రమంలో వారే ఆత్మవిమర్శ చేసుకొని, తమ వైఖరి మార్చుకోవాలి’ అంటూ కలెక్టర్ల సమావేశంలో వెలిబుచ్చిన అభిప్రాయంలోనే సీఎం కార్యాచరణ ఎంతటి విశాల దృక్పథంతో చేపట్టిందో అధికార గణానికి అర్థమైంది. ‘చిన్న వయసులో ఇంతటి పరిపక్వత ఊహించలేద’న్న సీని యర్ అధికారి అభిప్రాయం వాస్తవిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఒక భేటీతోనే రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాబోయే రోజు లెలా ఉంటాయో అర్థమైపోయింది. పనిపై శ్రద్ద పెట్టి ఫలితాల ద్వారా తమ సత్తా చూపించుకోవడానికి ఈ పరిస్థితినొక అవకాశంగా వారు పరిగణిస్తున్నారు.
తండ్రి పంథా తనయునికో వరం
జన హృదయాలు గెలిచిన నాయకుడిగా దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డికున్న మంచి పేరే కాక, ఆలోచనలూ ఆయన తనయుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ప్రభావితం చేస్తున్నాయి. విశాల జనహితం కోరే వైఎస్ పంథా నేటికీ పరిపాలనకు దారులు పరు స్తోంది. వైఎస్సార్ తన పాతికేళ్లకు పైబడ్డ రాజకీయ ప్రస్తానంలో చూసిన, చేసిన పలు ఆర్థిక, రాజకీయ, సామాజికాంశాల్లోని ప్రయోగాలు ఇప్పు డీయన మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. ఆయా ప్రయోగాల తర్వాత, సందేహాలకతీతంగా దృవపడ్డ విధానాలను ప్రస్తుత సీఎం నేరుగానే చేప డుతున్నారు. అవసరాన్ని బట్టి, అదనపు అంశాల్నీ చేర్చి మరింత మెరు గుపరుస్తున్నారు.
అమ్మ ఒడి, తొమ్మిది గంటలు పగటిపూటే ఉచిత విద్యుత్తు యత్నం వంటివి ఆ కోవలోవే! అనేక విషయాల్లో పెద్దాయన ఆలోచనలూ తనయుడ్ని ప్రభావితం చేస్తున్నాయి. విధానాల్లో, నిర్ణ యాల్లో, సాధనలో... అవి ప్రతిబింబిస్తున్నాయి. మచ్చుకు, నిన్నటి ఎన్ని కల్లో వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లు సాధించడమే ఓ నిదర్శనం! 1999 ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పదిరోజుల్లోనే, ఒక రాత్రి భోజన భేటీలో మేం ముగ్గురు జర్నలిస్టులం డా‘‘ వైఎస్సార్‌తో ఉన్నాం. సీనియర్ నాయకుడు మణి శంకర్ అయ్యర్ తనతో అన్న మాటల్ని వైఎస్సార్ గుర్తు చేసుకున్నారు. ‘ప్రచార సమయంలోనే మీరు గెలిచినంత పని చేశారు. ఆ ఊపు చూసి బెంబేలెత్తిపోయిన సీఎం చంద్ర బాబు అతిజాగ్రత్తకు వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, వాజ్‌పేయ్‌పై ఉన్న సానుభూతి, కార్గిల్ యుద్ద ప్రభావం వల్ల వారి ఉమ్మడి ఓటింగ్ శాతం పెరిగింది. మీ ఓటింగ్ శాతం తగ్గి ఓటమి తప్పలేదు’ అని అయ్యర్ విశ్లేషించినట్టు చెప్పారు. ‘..ఎదుటి వారి పొత్తులు, జిత్తులెలా ఉన్నా... 50 శాతానికి పైబడి ఓట్లు సాధించడం లక్ష్యంగా పనిచేస్తేనే విజయం ఖాయమవుతుంది’ అని వైఎస్ తన సంకల్పం చెప్పారు. అది తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో నిరూపించారు.
కూల్చివేత ఓ సంకేతం
అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. ఆచరణను ప్రజలు గమనిస్తున్నారు. ఇదే సమ యంలో, కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణం ‘ప్రజావేధిక’ కూల్చివే తకు ప్రభుత్వం తలపెట్టడాన్ని కొందరు మేధావులు చర్చకు తెస్తున్నారు. ‘ఇవేం వందల ఏళ్లనాటివి కావు, కోట్ల రూపాయల వ్యయంతో ఇటీవలే కట్టిన భవనాలు, అయినా కూలుస్తారా?’ అంటున్న మేధావులకొక ప్రశ్న. కృష్ణా నది కరకట్టపై నిర్మాణాలన్నీ త్వరలోనే కూల్చేస్తాం....’ అని స్థానిక అధికార టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి నాటి మంత్రి పలికినా మాట్లా డని మీ మౌనం దేనికి సంకేతం? కొద్ది ఖర్చుతో కట్టుకునే పేదల ఇళ్ల యితే కూల్చొచ్చు! పెద్ద ఖర్చుతో ప్రభుత్వం కట్టే అక్రమనిర్మాణాలు కూల్చొద్దా? ‘ఇకపై బాక్సైట్ తవ్వకాలుండవని ప్రకటిస్తూనే, గంజాయి సాగువద్దు అడవి బిడ్డలారా, మీకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు చూపుతామం’టున్న ప్రస్తుత ముఖ్యమంత్రి విచక్షణ ఓ కొత్త గాలి. అక్రమ నిర్మాణాల్లో తలదాచుకునే ‘దశాబ్దాల అనుభవం’ కన్నా, నేలతో, అడవితో, అట్టడుగు మట్టి మనుషులతో మమేకమైన ‘నెల యోధుడే’ సరైన పాలకుడన్నది జనన్నినాదం!
-దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment