రాజ్యాంగబద్ధతే ‘రిజర్వేషన్ల’కు రక్షణ | R Krishnaiah Writes Guest Column On BC Reservation | Sakshi
Sakshi News home page

రాజ్యాంగబద్ధతే ‘రిజర్వేషన్ల’కు రక్షణ

Published Wed, Mar 11 2020 12:41 AM | Last Updated on Wed, Mar 11 2020 12:41 AM

R Krishnaiah Writes Guest Column On BC Reservation - Sakshi

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ విధానాలతో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ రిజర్వేషన్ల గరిష్ట పరిమితిపై ప్రతిసారి న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతున్నాయి. కోర్టులు అడ్డుకుంటున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం చూడవలసిన బాధ్యత అన్ని పార్టీలపై ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. తాజాగా టీడీపీ నేత పిటిషన్‌ కారణంగా రిజర్వేషన్లను హైకోర్టు మళ్లీ తగ్గించినప్పటికీ వైఎస్‌ జగన్‌ స్థానిక ఎన్నికల్లో తన పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పాటించాలని ఆదేశించారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీతోపాటు ఇతర పార్టీలైన, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు పాటించి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ/ఎస్టీ/బీసీల రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తీర్పు చెప్పడంతో రిజర్వేషన్ల సమస్య మరోసారి చర్చకు వచ్చింది. ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఆశతో తెలుగుదేశం–ఇతర  ప్రతిపక్షాలు చూస్తున్నాయే తప్ప ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరి స్తామని ఆలోచించకుండా రాజకీయంగా ఎలా వాడుకుందామని కుట్రలు చేస్తున్నాయి. కానీ ఈ తీర్పు కొత్తదేమీ కాదు. 1993 మండల్‌ కేసు – ఇందిరా సహాని వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం కేసు నుంచి కూడా ఇప్పటివరకు దాదాపు 26 కేసులలో ఇదే తీర్పులు వచ్చాయి. సుప్రీం కోర్టు 2010లో కృష్ణమూర్తి వర్సెస్‌ కర్ణాటక స్టేట్‌ కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత 2010 నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు 50 శాతంకు తగ్గించాయి. 

తెలంగాణ ప్రభుత్వం 2019 ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతంకు తగ్గించి ఎన్నికలు జరి పింది. కానీ ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాలు తగ్గించినప్పటికీ ఈ వర్గాలకు రిజర్వేషన్లు తగ్గరాదనే ఆలోచనతో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారు. దీనికనుగుణంగా 2019 డిసెంబర్‌ 28న జీవో నం.176 జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రతాప్‌ రెడ్డి అనే టీడీపీ నేత సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు సలహా మేరకు దీన్ని విచారించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బీసీ రిజర్వేషన్లను 50 శాతంకు కుదించాలని తీర్పు చెప్పింది. 

టీడీపీ నాయకుడు ప్రతాప్‌ రెడ్డి సవాల్‌ చేయకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అరికట్టగలిగి ఉంటే ఈ పాటికి ఏపీలో 34% రిజర్వేషన్‌లతో ఎన్నికలు జరిగేవి. కానీ చంద్రబాబు అలా చేయకుండా ఈరోజు వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం చేయడాన్ని బీసీలు అసహ్యించుకుంటున్నారు. కాగా, ఈ అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయాలని చంద్రబాబు చేస్తున్న వాదనలో పసలేదు, ఉపయోగం లేదు. ఇంతకు పూర్వం గత ప్రభుత్వాలు చాలాసార్లు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశాయి. కానీ ప్రతి కేసులో కూడా సుప్రీంకోర్టు 50 శాతంకి మించి రిజర్వేషన్లు ఉండరాదని తీర్పు చెప్పింది. అలాంటప్పుడు మరలా సుప్రీం కోర్టుకు వెళితే ఈ తీర్పు పునరావృతం  అవుతుంది. కాలయాపన తప్ప బీసీలకు ఒరిగేదేమీ ఉండదు.

సామాజిక న్యాయం పట్టదా?
సుప్రీంకోర్టు, హైకోర్టులు మొదటినుంచి ఎస్సీ/ఎస్టీ/బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయి. ఇలా కోర్టులు తీర్పులు ప్రకటిం చిన ప్రతిసారీ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి ఎస్సీ/ఎస్టీ/బీసీ రిజర్వేషన్లకు రక్షణ కల్పిస్తూ వస్తున్నారు. మొట్టమొదట రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే 1951లో తమిళనాడుకు చెందిన చంపకం దొరై రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు ఈ వర్గాలకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. దీంతో 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ప్రారంభమయింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో సాగిన సామాజిక న్యాయం కేసుల విషయంలో సుప్రీంకోర్టు సరైన విధంగా స్పందించడం లేదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంపై ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

2010 సుప్రీంకోర్టు తీర్పు రాగానే దేశంలోని స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు అమలులో ఉన్న 25 రాష్ట్రాలలో 24 రాష్ట్రాలలో వెంటనే బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి తగ్గించారు. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న కర్ణాటక, బిహార్, యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ 2013–2014 మధ్యలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18–22 శాతం వరకు తగ్గించారు తప్ప బీసీ రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చట్టాలను తయారు చేయలేదు. కానీ వైఎస్‌ జగన్‌ తనకున్న అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికి బీసీ రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయడానికి మరోసారి జీవో నం.176ను జారీ చేశారు. కానీ టీడీపీ నేత చర్య కారణంగా అంతిమంగా ఏపీ హైకోర్టు కూడా ఈ జీవోకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.

రాజ్యాంగంలో ఏముంది...?
కేంద్ర ప్రభుత్వం 73–74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయత్‌ రాజ్‌ మున్సిపల్‌ చట్టం తెచ్చింది. ఈ రాజ్యాంగ సవరణలో రాజ్యాం గంలోని ఆర్టికల్‌ 243( ఈ–6),  243 ( ఖీ–6) ఆర్టికల్స్‌ పొందుపరిచి బీసీలకు కూడా జనాభా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెట్టాలని, అందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు చేయాలని ఆదేశించింది. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఖరారు చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఇచ్చారు. దీని ప్రకారం 1993లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బీసీలకు 34 శాతం ఖరారు చేసింది. ఈ శాతమే ఇంతవరకు అమలు చేస్తూ వచ్చారు. 1980 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగిన పలు ఉద్యమాల ప్రభావంతో 1992లో వచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆధారంగా నాటి సీఎం విజయభాస్కర్‌ రెడ్డి మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 34 శాతానికి పెంచారు. కొత్తగా గ్రామ పంచాయతీలకు 34% రిజర్వేషన్‌లు పెట్టారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసనసభలకు వదిలిపెట్టడం తప్పితే  స్పష్టంగా రాజ్యాం గంలోనే జనాభా ప్రకారం పెట్టాలని పేర్కొనక పోవడంతో ప్రతిసారి న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి.

దేశంలో ఇంతవరకు ఏ సీఎం కూడా చేయని విధంగా వైఎస్‌ జగన్‌ బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ విధానాలతో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీసీలు, దళితులు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవడం లేదు. జగనన్న వసతి దీవెన–విద్యా దీవెన– అమ్మ ఒడి పథకాలు ఎస్సీ/ఎస్టీ/బీసీలలో చదువుల విప్లవం తీసుకొస్తాయి. దీర్ఘకాలంలో ఈ పథకాల వలన ఎస్సీ/ఎస్టీ/బీసీల మౌలిక జీవన విధానంలో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎస్సీ/ఎస్టీ/బీసీల సమగ్ర అభివృద్ధికి, సాధికారతకు అనేక స్కీములు పెట్టారు. ముఖ్యంగా నామినేటెడ్‌ పదవులలో 50 శాతం కోటా కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. అలాగే కాంట్రాక్ట్‌ వర్క్‌లలో 50 శాతం కోటా, పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా కల్పించి, ఎస్సీ/ఎస్టీ/బీసీల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారు. ఇదొక గొప్ప మలుపు. అలాగే  గత ఏడాది మార్చి నెలలో వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు వైఎస్సార్‌ – పార్టీ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుంది. దేశంలోని 70 కోట్ల మంది బీసీలు ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అభిమానులుగా మారిపోయారు.
పరిష్కారం ఏమిటి?

రిజర్వేషన్ల గరిష్ట పరిమితిపై ప్రతిసారి న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతున్నాయి. కోర్టులు అడ్డుకుంటున్నాయి. దీనికి శాశ్వత పరి ష్కారం చూడవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉంది. దీంట్లో భాగంగా రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించి రాజ్యాంగంలో 9వ షెడ్యుల్‌ రిజర్వేషన్లను పెట్టింది. అదే విధంగా ఇప్పుడు అన్ని పార్టీలు చొరవ తీసుకుని రాజ్యాంగ సవరణ చేయాలి. అలాగే రాజ్యాంగ సవరణ ప్రక్రియకు సమయం తీసుకుంటుంది కాబట్టి తాత్కాలిక పరిష్కారంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో బీసీల జనాభా ప్రకారం జనరల్‌ సీట్లలో బీసీలకు సీట్లు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలి.

గతంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ప్రతిపాదనను అన్ని రాజకీయ పార్టీల ముందు పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర ప్రతిపక్షాలు బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆచరణలో ఈ ప్రతిపాదనను అంగీకరించాలి. జనరల్‌ సీట్లలో బీసీలకు కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. హైకోర్టు రిజర్వేషన్లు తగ్గించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు పాటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఏపీలోని ప్రతిపక్ష పార్టీ టీడీపీతోపాటు ఇతర పార్టీలైన, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు కూడా 34% రిజర్వేషన్లు పాటించి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. 

వ్యాసకర్త: ఆర్‌. కృష్ణయ్య
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు
మొబైల్‌ : 90000 09164

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement