సరిగ్గా 33 ఏళ్ల క్రితం 1984 డిసెంబర్ 2న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో ‘యూనియన్ కార్బైడ్ కెమికల్స్’ ఫ్యాక్టరీలో నుంచి విషవాయువులు వెలువడి నగరంలోని వేలాదిమంది ప్రజలను నిమిషాలలో మట్టుబెట్టాయి. ఈ ఘోరకలిని అందరూ గుర్తుంచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2ను ‘జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం’గా ప్రకటించింది.
భోపాల్ దుర్ఘటన వల్ల 8 నుంచి 10 వేల మంది మరణించగా, మొత్తంగా 25,000 మంది ఈ గ్యాస్ లీకేజీ అనంతర పరిణామాలతో మరణించినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా పరోక్షంగా 5 లక్షలమందికి పైగా ప్రజలు అనారోగ్యాల బారినపడ్డారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక కాలుష్య ఘోరకలి. అయితే ఈ విషాదాంతం ప్రపంచ దేశాలకు ఒక కనువిప్పు కాగా, భారతదేశంలో మాత్రం ప్రభుత్వాలకు కనువిప్పు కలుగలేదు.
సంఘటన జరిగి నేటికి 33 సంవత్సరాలు కావస్తున్నా, ఇప్పటికీ దాదాపు రెండున్నర లక్షల మంది వైద్యం చేయించుకుంటూనే ఉన్నారు. ఇంకా విషవాయువు వెలువడిన ప్రాంతం చుట్టుప్రక్కల ప్రజలు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. బాధాకరమైన విషయమేమిటంటే సంఘటన జరిగి 33 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో విషపదార్థాల తొలగింపు పూర్తి కాలేదు. అక్కడి భూగర్భ జలాలపై ఇంతవరకు 15 అధ్యయనాలు జరిగినా వ్యర్థాల తొలగింపు, భూగర్భ జలాల శుద్ధి జరగలేదు. నేటికీ ప్రమాద బాధితులు నష్టపరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఈ ప్రమాదానికి కారణమైన ‘‘యూనియన్ కార్బైడ్ కెమికల్స్’’ యజమాని ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తరువాత భారత్‌కు వచ్చాడు. అతడిని 1984 డిసెంబర్ 7న అరెస్ట్ చేశారు. అయితే ఎంత త్వరగా అరెస్ట్ చేశారో అంతే త్వరగా ప్రధాన నిందితుడు వారెన్ అండర్సన్ ‘భారత్‌కు మళ్లీ తిరిగి వస్తానని హామీ ఇచ్చి’ ప్రభుత్వ లాంఛనాలతో అమెరికాకు వెళ్ళిపోయాడు. యూనియన్ కార్బైడ్ సంస్థను యాజమాన్యం మరో కంపెనీకి అమ్మడం వలన బాధితులు ఎవరిని ఆశ్రయించాలో తెలియడం లేదు. ఇంతా చేస్తే బాధితులకు దక్కిన తలసరి నష్టపరిహారం కూడా 15 వేలకు మించలేదు.
ప్రపంచీకరణ పేరుతో అభివృద్ధి చెందిన దేశాలు వర్థమాన దేశాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. విదేశీ కంపెనీలు అభివృద్ధి పేరుతో భారత్ లాంటి వర్థమాన దేశాలలో పరిశ్రమలు స్థాపించి లాభాలు పిండుకొంటున్నాయి. మన ప్రభుత్వాల ఉదాసీనత వలన దేశ ప్రజల ప్రాణాలు, దేశ పర్యావరణాన్ని ఫణంగా పెట్టి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. భోపాల్ దుర్ఘటనలో మరణించినవారంతా పేదప్రజలే కావడంతో ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను లెక్కపెట్టకుండా సామూహికంగా ఖననం చేశారు.
అభివృద్ధి అంటే పర్యావరణ పరిరక్షణ, దేశ ప్రజ లకు పూర్తి రక్షణతో కూడిన అభివృద్ధి ఉండాలి. అంతేకానీ ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి పారిశ్రామిక కాలుష్యానికి కారణమవుతున్న ఇలాంటి దుర్ఘటనలు ఇకనైనా ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలి. దేశంలో ఎన్నో పర్యావరణ చట్టాలున్నా, వాటిని సమగ్రంగా అమలు చేయడం లేదు. ముఖ్యంగా పారిశ్రామిక పర్యావరణ చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఆయా కంపెనీల యాజమాన్యాలకు పూర్తి ఆదేశాలు అందించాలి. అలా చేసినప్పుడే భోపాల్ లాంటి దుర్ఘటనలు మళ్లీ ఉత్పన్నం కాకుండా చూసుకోగలం.
(నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం)
- మోతి రవికాంత్, వ్యవస్థాపకులు
సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ ‘ 99633 24239
Comments
Please login to add a commentAdd a comment