కేఎస్‌ఆర్‌తో రెబల్ స్టార్ కృష్ణం రాజు మనసులో మాట
♦ మనసులో మాట
అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజంగా మల్చడంలో చంద్రబాబు నిష్ణాతుడని, పచ్చి నిజాన్ని కూడా అబద్ధం చేయదల్చుకుని ఇప్పుడు బాబే అన్యాయమైపోతున్నాడని కేంద్రమాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు పేర్కొన్నారు. ప్రత్యేకహోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీనే ముద్దని బాబే ఒప్పుకుని ఇప్పుడు అన్యాయం అంటే కుదరదని, వాస్తవానికి ప్యాకేజీలో భాగంగా ఇస్తామని చెప్పిన మొత్తం కంటే రూ.70 వేల కోట్ల అదనపు సహాయం కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. తాను చేసిన తప్పుల్ని ఎక్కడ బయటపెడతారో, వాటిని ప్రజలు ఎక్కడ నమ్ముతారో అనే అభద్రతా భావానికి గురై ‘నన్ను ఏదో చేయాలని చూస్తున్నారు, కేసులు పెట్టబోతున్నారు, ఏమేమో చేయబోతున్నారు’ అని చంద్రబాబు తానే ముందుగా చెబితే అది డిఫెన్సులో పడటమేనన్నారు. చంద్రబాబు చెబితే మోదీకి వ్యతి రేకంగా ఓట్లు పడేటంత సీన్ లేదంటున్న కృష్ణంరాజు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
సినిమా, రాజకీయం వీటిలో మీకు బాగా నచ్చేది?
తొలినుంచి సినిమా అంటే ఆసక్తి ఎక్కువ. నేను సినిమాల్లోకి వచ్చి ఇప్పటికీ 50 ఏళ్లయింది. వాస్తవానికి మా కుటుంబం పూర్తిగా రాజకీయ కుటుంబం. నాన్న స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. మా మామయ్య మూర్తి గతంలో మంత్రిగా పనిచేశారు. అంతకంటే ఎక్కువగా భూదానోద్యమ సమయంలో ఆయన తన 800 ఎకరాల భూమిని ఉద్యమానికి ఇచ్చేశారు. నన్ను సినిమాల్లోకి ప్రోత్సహించింది కూడా ఆయనే.
మోదీని నమ్మకద్రోహి, మోసగాడంటున్న బాబు వచ్చే ఎన్నికల్లో తాను గెలవడంటున్నారు కదా?
పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది మరి. అబద్దాలు చెప్పేవాడికి ఎవరు ఏం చెప్పినా అబద్ధంలాగే కనిపిస్తుంది. చంద్రబాబు తెలి వితేటలు ఏమిటంటే అబద్ధం చెప్పి నిజాన్ని కూడా అబద్ధం చేయదల్చుకుని ఇప్పుడు అన్యాయమైపోయాడు. అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజం చేద్దామని సమయమంతా దానికే వృథా చేసి, దానిమీదే మనసు పెట్టి అన్యాయమైపోబోతున్నాడు.
నాలుగేళ్లు కలిసివుండి ఇప్పుడు తిట్టుకుంటే ఎలా?
మోదీ బాబును ఎక్కడ మోసం చేశారో ఒక్క పాయింట్ చెప్పండి. మోదీ మోసం చేయడమేమిటి? హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ కావాలని ముందుగా ఒప్పుకువు, ఇప్పుడు హోదా అంటే ఎలా?
బాబును అలా మోదీ ఒప్పించి ఉంటారేమో కదా?
అలా ఒప్పించి ఉంటే ఇప్పుడు ఎందుకు బాబు ఒప్పుకోవడం లేదు? ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి కేంద్రం నుంచి అన్నిరకాలుగా సమకూరుస్తున్నారు కదా. నిజానికి ప్యాకేజీలో భాగంగా ఇస్తామని చెప్పిన మొత్తం కంటే రూ.70 వేల కోట్ల అదనపు సహాయం ఇప్పటికే మంజూరు చేశారు. అమరావతిని శాంక్షన్ చేశారు. గుజరాత్‌లోని డోలెరా తరహా పారిశ్రామిక కారిడార్లను మన ఏపీకే మూడు ఇచ్చారు.
బాబు దాడి చేస్తున్నా మోదీ స్పందించలేదే?
నేను బాధపడుతున్నది ఇదే. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు దాన్ని ఒక మంచి పనికి, మంచి విషయాలకి ఉపయోగించకుండా అనవసరమైన విషయాలపైకి ఎందుకు మళ్లిస్తున్నాడు? నిజాల్ని దాచి ఉంచేటప్పుడు బయటపడేది చివరకు అబ ద్ధాలు, అబద్ధాల కోర్లే కదా!
ఎయిర్ ఆసియా ఉదంతంలో ఆ కాల్స్ ఎలా బయటికొచ్చాయి?
ఓటుకు కోట్లు కేసులో వీడియోలు ఎలా బయటకు వచ్చాయి? ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది? అలాగే దీంట్లోనూ వచ్చాయి. ఆరున్నర మిలియన్ డాలర్ల కుంభకోణం.. అంటే 3,600 కోట్ల కుంభకోణం ఎయిర్ ఆసియాలో జరిగిందని కదా చెబుతున్నది. ఈ కుంభకోణంలో చాలాచోట్ల చేతులు మారాయి. అశోక్ గజపతిరాజుకు ఏమీ తెలీదు. నువ్వు అలా చేయి అని ఆయనకు చెప్పారట. మీ చానల్‌లోనే చూశాను.
బాబు భయపడుతుంటే.. అరెస్టులు, కేసులు ఏవీ ఉండవు అనేలా బీజేపీ తీరు ఉంది. ఏది నిజం?
తాను చేసిన తప్పులు ఎక్కడ బయటపెడతారో, వాటిని చూసి ప్రజలు ఎక్కడ నమ్ముతారో.. దాన్ని నమ్మితే మనకు ఇబ్బంది అనే అభద్రతా భావానికి చంద్రబాబు గురై ‘నన్ను ఏదో చేయాలని చూస్తున్నారు, కేసులు పెట్టబోతున్నారు, ఏమేమో చేయబోతున్నారు’ అని తానే ముందుగా చెబితే అది డిఫెన్సులో పడటం కాదా?
బాబును ఇరుకున పెట్టే కేసులు ఏవి?
బాబు ఇంతకు ముందే 23 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు. వీటిపై ఎప్పటికైనా విచారణ తప్పదు కదా?
తెలుగుదేశం కాంగ్రెస్‌తో కలుస్తుందా?
అదే జరుగుతుందని ఓపెన్‌గానే చెబుతున్నాను. నేరుగా అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు కలుస్తానని బాబు చెప్పవచ్చు. బాబు తరహా రాజకీయాల్లో ఏదయినా జరగొచ్చు. మామూలు రాజకీయాల కంటే చంద్రబాబు రాజకీయాలు చాలా తేడాగా ఉంటాయి.
ప్రత్యేక హోదాపై మీ స్పందన?
ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అనేది ఏపీకి ఓవరాల్‌గా చూస్తే అన్యాయమనే చెప్పాలి. కానీ ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం తన పరిధుల మేరకు ఏపీకి అన్ని రకాల సహాయం చేస్తున్నారు. ఏదీ ఎక్కడా తగ్గించలేదు. కానీ నాలుగేళ్లుగా మోసం చేస్తున్నారని బాబు అంటున్నారు. కానీ కేంద్రం ఇచ్చిన దానికి, రాష్ట్రం ఖర్చుచేసిందానికి అన్నింటికీ కాగి తాలు, లెక్కలు ఉన్నాయి కదా. పెట్టిన ఖర్చులకు లెక్కలు సమర్పించకుండా సహాయం చేయలేదంటే ఎలా?
వైఎస్సార్‌పై, వైఎస్ జగన్ పాదయాత్రపై మీ వ్యాఖ్య ఏమిటి?
ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా మంచి మిత్రుడు. ఇక వైఎస్ జగన్ పాదయాత్రపై జనం బాగా వస్తున్నారు. బ్రహ్మాండంగా అభినందిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా జనంలోనే తిరిగి, ధైర్యమిచ్చి ఓట్లు గెల్చుకున్నారు. ఆ తండ్రి వారసత్వం ఇప్పుడు ఎలా వస్తుంది అనేది చూడాల్సిందే.
అమరావతికోసం అన్ని వేల ఎకరాలు అవసరమా?
రాజధానికయితే అక్కరలేదు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తీసుకున్నట్లయితే అభివృద్ధి అంతా ఒకచోటే కేంద్రీకృతమవుతుంది. మళ్లీ అదొక సమస్య.
చివరిగా తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం?
మోదీని నమ్మండి. అన్యాయం చేశారన్న మాట అబద్ధం. ఆ ప్రచారాన్ని నమ్మవద్దు. చేయాలని ఉంది, ఇంకా చేస్తున్నారు, చేయబోతున్నారు. ముందు ముందు ఈ విషయం బోధపడుతుంది. వచ్చే ఆరునెలల్లో మోదీ చాలా గొప్పవారు అని మీరే చెబుతారు. ఆ రకంగా పనులు జరుగుతాయి కూడా. ఇది నా సవాల్.
Comments
Please login to add a commentAdd a comment