
రాజ్యసభకు వచ్చి ఐదేళ్లు దాటింది. ఆరేళ్లు నిండకుండా మధ్యలోనే బయటకి వెళ్లిపోతానంటే బాగోదేమో. వద్దు మొర్రో అంటున్నా వినకుండా ప్రతిభా మేడమ్ నన్ను ప్రపోజ్ చేశారు. అప్పటికింకా క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. నా ఆట నన్ను ఆడుకోనివ్వండి అన్నాను. ‘‘ఎన్నాళ్లలా ఆడతావ్, చిన్నపిల్లాడిలా! పెద్దల సభకు వచ్చేసెయ్’’ అన్నారు మేడమ్. వచ్చేశాను. ఏమైంది? సభకు రెగ్యులర్‌గా రావడం లేదని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు!
మొన్న ఆగస్టులో నేను çసభలోకి వచ్చి కూర్చోగానే ఆయనెవరో లేచి నిలబడ్డాడు! ‘ఇలాంటి వాళ్లను సభలోకి రానివ్వకూడదు’ అన్నాడు. ‘రాక రాక వచ్చిన వాళ్లని రానివ్వకూడదంటావేంటి?’ అన్నట్లు ఆయన వైపు కోపంగా చూశారు రేఖా మేడమ్. వెంటనే ఆయన రేఖా మేడమ్ వైపు తిరిగి, ‘ఇలాంటి వాళ్లను కూడా..’ అన్నట్లు చూశారు.
రేఖా మేడమూ నేనూ రెగ్యులర్‌గా రాజ్యసభకు రావడం లేదట. వచ్చినా ఒక్క ముక్క మాట్లాడ్డం లేదట. ‘మనమైనా వీళ్లను పంపించేయాలి, వీళ్లైనా వాళ్లంతట వాళ్లు వెళ్లిపోవాలి’ అన్నాడు.. మా ఇద్దరి వైపు చూస్తూ!
పార్లమెంట్ హాల్ బయటికి వచ్చాక జయా మేడమ్‌ని అడిగాను.. ‘ఎవరు మేడమ్ ఆయన?’ అని. నగేశ్ అగర్వాల్ అట. సమాజ్‌వాదీ పార్టీ. జయా మేడమ్‌ది కూడా ఆ పార్టీనే అన్నట్లు గుర్తు నాకు. అందుకే అగర్వాల్‌ని నేనేం కామెంట్ చెయ్యలేదు.
రాజ్యసభకు వచ్చాక నేను రెండు విషయాలు గ్రహించాను. ఒకటి క్వొశ్చన్ అవర్. ఇంకోటి జీరో అవర్. క్వొశ్చన్ అవర్‌లో ఇష్టమొచ్చినట్లు క్వొశ్చన్ చెయ్యడానికి లేదు. జీరో అవర్‌లో ఏదిబడితే అది క్వొశ్చన్ చెయ్యొచ్చు. కానీ నా దగ్గర క్వొశ్చన్లు లేవు, నన్ను ఆన్సర్‌లు అడిగే క్వొశ్చన్లు సభలోనూ లేవు. ఇంక నేను మాట్లాడడానికి ఏముంటుంది? ఊరికే.. ‘మాట్లాడ్డం లేదు.. మాట్లాడ్డం లేదు’ అని అంటుంటారు గానీ!
వీళ్ల పోరు పడలేక ఏదో ఒకటి మాట్లాడదామని ఫస్ట్ టైమ్ మొన్న గురువారం సభలో లేచి నిలుచున్నాను. మాట్లాడ్డం కోసమే స్పెషల్‌గా వైట్ షర్ట్, నెహ్రూ జాకెట్ వేసుకొచ్చాను. మాట్లాడుతుంటే ఎవరూ పట్టించుకోలేదు. మన్మోహన్‌ని మోదీ ఏదో అన్నారని కాంగ్రెస్‌వాళ్లు బీజేపీవాళ్లను ఇంకేదో అంటున్నారు! అప్పటికీ వెంకయ్య నాయుడు చెబుతూనే ఉన్నారు.. ‘సచిన్‌ని మాట్లాడనివ్వండి. భారతరత్నను మాట్లాడనివ్వండి. ఫస్ట్ టైమ్ మాట్లాడుతున్నాడు మాట్లాడనివ్వండీ. ఇంపార్టెంట్ ఇష్యూ మీద మాట్లాడతాడట మాట్లాడనివ్వండి..’ అని అంటూనే ఉన్నారు. ఆయన మాటను కూడా ఎవరూ పట్టించుకోలేదు. నేనలాగే నిలబడిపోయాను. జయా మేడమ్ నావైపు చూసి, కూర్చోమన్నట్లు కళ్లతో సైగ చేశారు. కూర్చున్నాను. మాట్లాడదామని మళ్లీ ఒకసారి ట్రై చేశాను. మాట్లాడ్డం తర్వాతి సంగతి, కనీసం నిలబడే చాన్స్ కూడా రాలేదు!
రాజ్యసభ సీటు వచ్చినంత ఈజీ కాదేమో, రాజ్యసభలో మాట్లాడే అవకాశం రావడం!
-మాధవ్ శింగరాజు