సంకెళ్ల మాటున రెక్కలు | Samanya Kiran Writes on Nagaland Election Result | Sakshi
Sakshi News home page

సంకెళ్ల మాటున రెక్కలు

Published Tue, Mar 6 2018 2:56 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

Samanya Kiran Writes on Nagaland Election Result - Sakshi

ఆలోచనం
వీరి ఒత్తిడికి తలొగ్గిన అసెంబ్లీ మున్సిపల్‌ చట్టానికి సవరణ చేసి రిజర్వేషన్లు కల్పించింది. దీనిని నాగా తెగలకు నాయకత్వం వహించే నాగా హోహో, ఈఎన్‌పీవో తీవ్రంగా వ్యతిరేకించాయి.

మూడు ఈశాన్యరాష్ట్రాలు –నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పినట్టు ఈ మూడింటిలో విల క్షణ చరిత్ర కలిగిన నాగాలాండ్‌ పైన నా దృష్టి కేంద్రీకరించాను. అణచివేత ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకొని, స్వేచ్ఛకి అత్యంత ప్రాముఖ్యమిచ్చే నాగాల వ్యక్తిత్వం నా ఆసక్తికి ఒక కారణం కాగా, ఆ అసెంబ్లీలో మహిళా ప్రాతినిధ్యం గురించి జరుగు తున్న చర్చ ఇంకొక కారణం.

1963లో రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుండి 2013 వరకు జరిగిన 12 అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క మహిళా అభ్యర్థి కూడా గెలుపొందలేదు. ఈ పన్నెండు ఎన్నికలలో 19 మంది మహిళలు మాత్రమే పోటీ చేశారు. 60 మంది శాసనసభ్యులు ఉన్న ఆ అసెంబ్లీకి ఈసారి 253 నామినేషన్లు దాఖలు కాగా, వారిలో మహిళలు ఐదుగురే. ఇప్పటి అధికార నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ మాతృక యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ పార్టీకి అధ్య క్షురాలిగా పనిచేసిన రానో ఎం షైజా 1977లో లోక్‌ సభకు ఎన్నిక కావడం మినహా చట్టసభలకు నాగా మహిళల ప్రాతినిధ్యం శూన్యం.

ఈ విషయం గురించి జర్నలిస్ట్‌ ఈప్సిత చక్రవర్తి ‘ఇదొక ఆసక్తికరమైన అభాస. ఎందుకంటే నాగా మహిళలు పురుషులతో పాటు సాయుధ పోరాటంలో చేయీ చేయీ కలిపి పోరాడారు, శాంతి ప్రక్రియలో భాగమయ్యారు, వివిధ పౌర సంఘాల్లో కూడా ఎంతో సంఘటితంగా పనిచేస్తున్నారు’ అంటారు.
ఇతర ప్రాంతాలతో పోలిస్తే మహిళా అభివృద్ధి సూచికలలో నాగాలాండ్‌ ముందుంది.

2011 సెన్సస్‌ ప్రకారం దేశంలో చైల్డ్‌ సెక్స్‌ రేషియో 914 ఉంటే, నాగాలాండ్‌లో 943గా ఉంది. మహిళల్లో అక్ష రాస్యత దేశ సగటుకంటే పది శాతం పాయింట్లు ఎక్కువగా, 76% ఉంది. మహిళలపై జరిగే నేరాలు అతి తక్కువ. వీరి సాంప్రదాయక చట్టాల ప్రకారం రేపిస్ట్‌ని కొట్టి చంపవచ్చు. అత్యున్నత స్థాయి బ్యూరో క్రాట్‌లలో కూడా మహిళలు 305 వరకూ ఉన్నారు. అయితే నాగా మహిళా సామాజిక అభివృద్ధికి దోహదం చేసిన సంస్కృతీ సంప్రదాయాలే నేడు వారి రాజకీయ ఆకాం క్షలకు అడ్డంకిగా మారాయి.

దేశంలోని వివిధ రాష్ట్ర అసెంబ్లీలలో మహిళా ప్రాతినిధ్యం సగటు శోచనీయంగా, 9% మాత్రమే. 73, 74 రాజ్యాంగ సవరణల తర్వాత స్థానిక సంస్థ లలో మాత్రం 33% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. నాగాలాండ్‌ స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్ల గురించి పెద్ద యుద్ధమే జరుగుతున్నది. ఇందుకు నాగా మదర్స్‌ అసోసియేషన్‌ ఎన్నో ఏళ్లుగా  పోరాడు తున్నది. వీరి ఒత్తిడికి తలొగ్గిన అసెంబ్లీ మున్సిపల్‌ చట్టానికి సవరణ చేసి రిజర్వేషన్లు కల్పించింది. దీనిని నాగా తెగలకు నాయకత్వం వహించే నాగా హోహో, ఈఎన్‌పీవో తీవ్రంగా వ్యతిరేకించాయి.

అలాంటి చట్టాలు, రిజర్వేషన్లు అవసరం లేదని వారు వాదిం చటం మొదలుపెట్టారు. వీరి ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం నాగాలాండ్‌కి ఆర్టికల్‌ 371 ఇచ్చిన వెసులుబాటుని ఉపయోగించుకొని 73, 74 రాజ్యాంగ సవరణలు తమ సంస్కృతీ సంప్రదాయాలకు విఘాత మని తీర్మానించింది. అయితే మున్సిపాలిటీలు ఆధు నిక వ్యవస్థలని నాగా మదర్స్‌ అసోసియేషన్‌ వాదన. సుప్రీంకోర్టు ఈ వాదనతో ఏకీభవిస్తూ ఎన్నికలు నిర్వ హించమని ఆదేశించింది. ఎన్నికలు హింసాత్మకం కావడం, ఇద్దరు మరణించడం, ముఖ్యమంత్రి రాజీ నామా కారణంగాను ఎన్నికలు నిలిచిపోయాయి.

ఈ మొత్తం పరిణామాల గురించి చర్చిస్తూ హెచ్‌సీయూ పొలిటికల్‌ సైన్స్‌ అధ్యాపకులు యువాన్‌ హాసింగ్‌ ఒక విషయం చెప్పారు. ప్రభుత్వం, యూన్‌ఎన్‌డీపీ నిర్వ హించిన సర్వేల ప్రకారం దాదాపు 805 మంది మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నారనీ పెద్ద మనుషుల పితృస్వామ్య భావజాలమే అసలు అడ్డంకి అనీ హాసింగ్‌ వ్యాఖ్యానించారు. దీనితో స్థానిక సంస్థల విషయం అటుంచితే ఈసారి అసెంబ్లీకి ఒక్క మహిళ అయినా గెలుస్తుందనే ఆశ కలిగింది. మోన్‌ జిల్లా అబోయి నియోజకవర్గం నుండి బరిలో ఉన్న అవాన్‌ కోన్యాక్‌ మొదట ఆధిక్యత కనబరిచినా చివరికి ఓడిపోయారు.

నాగా ప్రతిఘటనకి మొట్టమొదటి రూపం నాగా క్లబ్‌. 1927లో సైమన్‌ కమిషన్‌కి ఇచ్చిన నివేదికలో వీరు ‘మమ్మల్ని మాకే వదిలి వేయండి. ఆదిమ కాలంలో ఏ విధంగా జీవించామో ఆ విధంగా జీవించ  డానికి అవకాశం ఇవ్వండి’ అని అభ్యర్థించారు. నాగా ప్రతిఘటనోద్యమం విస్తరించడానికీ, తలల వేట వంటి ఆచారాలతో అనైక్యంగా ఉన్న  తెగల, గ్రామాల మధ్య సామరస్యం నెలకొల్పి జాతీయవాదాన్ని పెంపొందించడానికీ క్రిస్టియానిటీ ఉపయోగపడింది.

నాగాలాండ్‌లో వాహనాల మీద ‘జీసస్‌ సేవ్స్‌’ అనే నినాదం ఉంటుంది. కరుణామయుడూ, ప్రగతిశీ లుడూ, ప్రియమైన విప్లవకారుడూ, అసాధారణ అమ రవీరుడూ, పునరుత్థానం తరువాత మొదట మహిళకే దర్శనం ఇచ్చిన యేసుక్రీస్తును ఆకాశంలో సగమైన మా మహిళలకు అవనిలోనూ సగం, అసెం బ్లీలలోనూ సగం, పార్లమెంట్‌లోనూ సగం ఇవ్వమని వేడుకొను చున్నాను. ఆమెన్‌!

సామాన్య
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
80196 00900

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement