
ఉత్తమ కవికి ప్రతి రచనా ఒక సృజన సూర్య బింబం. అందులో ప్రయోగశీలతకు బ్రాండ్ అంబాసిడర్ శ్రీశ్రీ. 2018 వారి నూట ఎనిమిదో జయంతి వత్సరమే కాకుండా 35వ వర్ధంతి ఏడాది కూడా. ఇరవయ్యో శతాబ్దాన్ని పెనవేసుకుని తన రచనలను, ప్రపంచ గతులపై పెరిగే అవగాహనతో, దాదాపు పందొమ్మిది భిన్న ప్రక్రియల్లో రాసిన వారు శ్రీశ్రీ. వచనంలోనూ, పద్యం లోనూ కొత్త పోకడలు, పదాల సృష్టి, దేశాదేశాల్లో కవిత్వం ఎలా కొత్త పుంతలు తొక్కిందో తాను ఆకళింపు చేసుకుంటూ, తెలుగు సాహిత్యం లోనికి ఆయా ధోరణులను ప్రవేశ పెట్టడంలో నిత్య క్రియాశీలత, ఇవీ శ్రీశ్రీ మార్కు విక్రమార్క పరాక్రమాలు. రచనల్లో వారు ప్రస్తావించిన దేశ కాలాల నామ సూచి ఒక చోట చేర్చి, వాటి సాంస్కృతిక, చారిత్రిక, మనో వైజ్ఞానిక, శాస్త్రీయ, నాటక రంగ, అలాగే ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు, స్థలాలు, పుస్తకాలు, సంఘటనలు, భౌగోళిక విశేషాలు ఇవన్నిటి నామావళి సచి త్రంగా వివరిస్తే, అదే ఒక వెయ్యి పేజీలకు మిం చిన శ్రీశ్రీ మేధో మాపనం అవుతుంది. తృతీయ సహస్రంలో, ఒక రచయిత బుద్ధి కొలతకు నూతన కొలబద్దలెన్నో ఏర్పడుతున్నాయి. అందులో అత్యంత ఉపయోగకరమైనది ఈ మేధో మాపనం.
విశాఖలో శ్రీశ్రీ కళ్ళూ, కవితల వాకిళ్లూ నిత్యం కొండలు, కడలి సాక్ష్యంగా సజీవాలు. మహాప్రస్థానం బెంగాలీలో రచన అయితే, ఈ పాటికి డిజైనర్ ఎడిషన్ వేసేవారు. మహా ప్రస్థానం కలిగించే ఒక లోకోత్తర అనుభవానికి, ఇంకా మనం దూరంగానే ఉన్నాము. టాగూర్ 150వ జయంతికి మమతా బెనర్జీ, రాష్ట్ర ముఖ్యమంతి, టాగూర్ ఫోటో చేత ధరించి నివాళి యాత్రలో ముందు నడిచింది, గురజాడ, శ్రీశ్రీ ఎవరికీ మనం ఇలా గౌరవాలు ఇవ్వము. శ్రీశ్రీలో ఎందరో ఇంజనీర్లు, డాక్టర్లూ, పదులకొద్దీ ప్రొఫెసర్లూ, భాషావేత్తలు, భిన్న వయస్కుల పౌర సమాజం, ప్రపంచం అంత నిండుగా ఉన్నారు. అందుకే ఆయన రచనలు, కొత్త నిర్మాణాలు చేస్తాయి భావనాలోకంలో.
రచయిత్రి జగద్ధాత్రి చేసే పరిశోధన ప్రస్తావనతో విశాఖలో, మహాకవి నూతన లభ్య రచనల పరిచయ సభ జరుగుతున్నది. విశాఖ శ్రీశ్రీ జన్మస్థలంగా, మహాప్రస్థాన మాతృభూమిగా, ఈ కొత్త రచనల కాంతిలో శ్రీశ్రీ సృజన సూర్య బింబ దీప్తులు, మరింత వర్ణ సంభరితం కావాలన్న ఉత్పాదక యాత్రలో, తెలుగు వారి ఆకాంక్షలు, ఆశీస్సులు కోరుతున్నాము. జూన్ 14 సాయంత్రం ఆరు గంటలకు, విశాఖ పౌర గ్రంథాలయంలో, మొజాయిక్ సాహిత్య సంస్థ నిర్వహణలో జరుగనున్న సభలో ఈ నూతన రచనలను, రాష్ట్ర సీపీఐ నాయకులు జె.వి.సత్యనారాయణమూర్తి లోకార్పణ చేస్తారు. పలు రంగాల ప్రముఖులు పాల్గొనే సభలో వక్తలు ఈ రచనల పరి చయం చేస్తారు.
రామతీర్థ, ప్రముఖ కవి, రచయిత
మొబైల్ : 98492 00385