ఒక వైద్యశాలలో జరుగుతున్న చికిత్స సరైంది కాకపోతే, మరొక వైద్యశాలకు వెళ్లాలంటే, అసలు తనకు ఏం జరిగిందో తెలియాలి. ఏ చికిత్సో వివరించాలి. పూర్తిగా రోగి జీవితం ఈ చికిత్సా సమాచారంపై ఆధారపడి ఉంటుంది.
ఏదైనా తెలిసి కొంటేనే మన స్వేచ్ఛకు విలువ– తిండైనా, చికిత్స అయినా. వృత్తి ప్రమాణాలను రక్షిం చడానికి వైద్యమండలిని భారతవైద్యమండలి చట్టం ద్వారా పార్లమెంట్ 1956లో రూపొందించింది. ఈ చట్టం కింద మార్చి 11, 2002న వైద్య రికార్డుల గురించి ఒక రెగ్యులేషన్ జారీ చేసింది. దీన్ని డిసెంబర్ 2010లో సవరించారు. సెక్షన్ 33(ఎం) కింద కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితో భారత వైద్యమండలి కింద నమోదయిన వైద్యులకోసం వృత్తి పరమైన ప్రవర్తన, నైతికవిలువలకు సంబంధించిన నియమావళిని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం మెడికల్ రికార్డులను సక్రమంగా నిర్వహించడం, వాటిని రోగులకు అందుబాటులో ఉంచడం వైద్యుల బాధ్యత.
మెడికల్ రికార్డ్స్ నిర్వహణ : 1.3.1 చికిత్స మొదలైన తేదీనుంచి ఆస్పత్రిలో చేరిన రోగి చికిత్స పత్రాలను మెడికల్ కౌన్సిల్ అనుబంధం 3లో పేర్కొన్న నిర్ణీత ప్రమాణాల ప్రకారం మూడేళ్లపాటు కాపాడాలి. 1.3.2. రోగి కాని అతను అధికారం ఇచ్చిన ఇతర వ్యక్తి గానీ, లేదా చట్టపరమైన అధికారులు గానీ అడిగితే ఆ రికార్డులను 72 గంటలలోగా ఇచ్చి వేయాలి. ప్రతి వినియోగదారుడికి ఉత్పత్తి గురించి లేదా తాము కొనుక్కున్న సేవల గురించి పూర్తి సమాచారం ఇవ్వవలసిందే. తనకు ఏ ప్రమాణాలతో కూడిన వస్తువులు, సేవలు ఏ ధరకు దొరుకుతాయో ముందే తెలియజేస్తే కొన్నవి ముందే చెప్పిన ప్రమాణాల ప్రకారం ఉన్నాయా ఏవైనా లోపాలు ఉన్నాయా పరిశీలించే హక్కు, లోపాలు ఉంటే పరిహారం కోరే హక్కు ఉందని ఒజైర్ హుస్సేన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఏడీ సింగ్, ఎం ముద్గల్ నిర్ధారించారు.
కొన్న ఆహారంలో జంతులేశాలుంటే ఉత్పత్తిదారులు తమంత తామే తెలియజేయాలని కోరుతూ ఒజైర్ çహుస్సేన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మన సంవిధానంలో ఆర్టికల్ 19(1)(ఎ) కింద భావవ్యక్తీకరణ స్వేచ్ఛ రెండు ప్రధాన ఆశయాలను సిద్ధింపజేయాలి. 1. వినియోగదారుడికి కొనబోయే ఉత్పత్తుల నిజాలు తెలుసుకునేందుకు సహకరించాలి. తాను కొన్న ఆహారంలో జంతు, పక్షి, చేప, ఇతర జలచరాలు, గుడ్ల భాగాలు ఉన్నాయా చెప్పాలి. 2. శాకాహారిగా కొనసాగే హక్కును, విశ్వాసాన్ని కాపాడుకునేందుకు ఉత్పత్తిదారులు సహకరించాలని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది.
యూరప్ మానవ హక్కుల ఒప్పందంలోని ఆర్టికల్ 10 ప్రకారం ప్రతి వ్యక్తికి భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉంది. భారతదేశం ఈ ఒప్పందం పైన సంతకం చేసింది. ‘‘ఆనోభద్రా క్రతవో యంతు విశ్వతః’’ అని రుగ్వేద వాక్యం.
విశ్వం నలుమూలలనుంచి మనకు సదాలోచనలు అందాలని దీని అర్థం. అనేక భావాలను అన్ని వైపులనుంచి ఆహ్వానించాలన్నదే ఆర్యోక్తి. ఇతరులనుంచి అభిప్రాయాలు వినే హక్కు లేకపోతే సొంతంగా అభిప్రాయం ఏర్పడటం కష్టం, అప్పుడు వ్యక్తం చేయడానికి కూడా ఏమీ ఉండదు. వైద్య చికిత్సపై నిర్ణయానికి రావాలంటే ముం దస్తు సమాచారం ఉండాలి. ఒక వైద్యశాలలో జరుగుతున్న చికిత్స సరైంది కాకపోతే, మరొక వైద్యశాలకు వెళ్లాలంటే, అసలు తనకు ఏం జరిగిందో తెలియాలి. ఏ చికిత్సో వివరించాలి. తన పరిస్థితికి మరే వైద్యం అవసరమో అదెక్కడ దొరుకుతుందో దాని ఖరీదు ఎంతో తెలియకుండా ఆ వ్యక్తి గానీ అతని బంధువులు గానీ ఏ నిర్ణయమూ తీసుకోలేరు. పూర్తిగా అతని జీవితం ఈ చికిత్సా సమాచారం పైన ఆధారపడి ఉంటుంది. తీసుకునే తిండి విషయంలో చికిత్స విషయంలోనూ సమాచారం ముందే లేకపోతే అతని బ్రతుకుకే ప్రమాదం.
ఢిల్లీ హైకోర్టు ఈ అంశం గురించి వివరిస్తూ, ఆహార పదార్థాలు, మందులు, అలంకరణ వస్తువుల గురించి వాటి ప్యాకెట్ల మీద పూర్తి వివరాలు లేకపోతే, ఆ ఉత్పత్తులలో ఉన్న పదార్థాల గురించిన సమాచారం తెలియకపోతే, వాటిని కొని వాడాలో వద్దో నిర్ణయించుకోవడం అసాధ్యమవుతుంది. వినియోగదారులు స్వయంగా ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం జీవన స్వేచ్ఛ, నిర్ణయ స్వేచ్ఛ, అభిప్రాయ స్వేచ్ఛకు సంబంధించిన అంశం. రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు చెందిన విషయం. ఒకవేళ తను కొనబోయే ఆహారపదార్థం శాకాహారమా లేక మాంసాహారమా తెలియకపోతే, తెలియకుండానే అది తింటే, ఒకవేళ అతను శాకాహారి అయి ఉండి తిన్నది మాంసాహారమైతే అతని స్వేచ్ఛను, సమాచార హక్కును, జీవన విధానాన్ని ఎంచుకునే హక్కును మతభావాలను కూడా దెబ్బతీసినట్టు అవుతుంది. అంటే ఆర్టికల్ 19(1)(ఎ), 21, 25 కింద హామీ ఇచ్చిన హక్కుల ఉల్లంఘన జరిగినట్టే అని ఢిల్లీ హైకోర్టు వివరించింది.
మందులు, డ్రగ్స్ విషయంలో కూడా అవి జంతువుల నుంచి తీసినవా లేక మొక్కలనుంచి తీసిన పదార్థాలా తెలియజేయాల్సిన బాధ్యత ఉత్పత్తి దారుల పైన ఉంది. ఆకుపచ్చ రంగులో శాకాహారమని తెలియజేయాలి. మాంసాహారమైతే ఆ విషయం స్పష్టంగా తెలియజేయాలి. ఆహార పదార్థాల విషయంలో ఇచ్చిన ఈ తీర్పు, సూత్రప్రాయంగా అన్ని రకాల వస్తువులకు, సేవలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా వైద్యసేవలపై పూర్తి సమాచారం పొందేహక్కును ఇది గుర్తించింది.
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment