కులం రగిలిస్తున్న రక్తచరిత్ర | TS Sudhir Article On Honour Killings In India | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 19 2018 1:43 AM | Last Updated on Wed, Sep 19 2018 11:05 AM

TS Sudhir Article On Honour Killings In India - Sakshi

ఉడుమల్‌ పేట ప్రేమికులు శంకర్‌–కౌసల్య , మిర్యాలగూడ ప్రేమికులు ప్రణయ్‌–అమృత

ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తమిళనాడులో కౌసల్య, తెలంగాణలో అమృత వంటి అమ్మాయిలకు పౌరసమాజం ఇంతటి కఠిన శిక్షలు వేయడాన్ని బట్టి చూస్తే మనం ఎక్కడున్నాం? అనే ప్రశ్న తలెత్తుతోంది. కులం రాతిపై చెక్కిన బొమ్మలా నిలబడిపోయింది. ఓ పక్క కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నా, తమిళనాట రాజకీయంగా శక్తిమంతమైన వెనుకబడిన, అగ్రకులాలు తమ పిల్లలు దళితులతో సంబంధాలు పెట్టుకోవడాన్ని సహించడం లేదు. ఇప్పుడు అమృత జీవితం ఎటు తిరుగుతుంది? ఆమెకూడా కౌసల్య మార్గంలోనే పయనించబోతోంది. ప్రణయ్‌ మరణం మతిమాలిన రక్తపాతానికి పాల్పడకూడదనే సందేశం ఇవ్వాలని అమృత కోరుకుంటోంది.

కౌసల్య, అమృత–ఇద్దరూ దళిత యువకు లను ప్రేమించి పెళ్లాడారు. వారి తిరుగుబాటు ఫలితంగా వారి భర్తలు ప్రాణాలు కోల్పో యారు. తమిళనాడులోని ఉడుమలపేటలో జరిగిందే తెలంగాణ మిర్యా లగూడలో పునరావృతమైంది. తమకంటే ఉన్నత కులంగా భావించే దేవర్‌ వర్గానికి చెందిన కౌసల్యను దళిత ఇంజనీర్‌ శంకర్‌ 2016 మార్చిలో పెళ్లిచేసుకున్నాడు. తిరుపూర్‌ జిల్లా ఉడుమలపేట మార్కెట్‌ సెంటర్‌లో అతన్ని పొడిచి చంపారు. కౌసల్య కళ్లముందే జరిగిన ఈ హత్య సీసీటీవీలో రికార్డయింది. అల్లుడిని చంపడానికి కిరాయి హంత కులను పంపిన కౌసల్య తండ్రికి కిందటి డిసెంబర్‌లో తిరుపూర్‌ కోర్టు మరణశిక్ష విధించింది. శుక్రవారం మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్‌ అనే దళిత యువకుడిని కిరాయి హంతకుడు నరికి చంపాడు.

వైశ్య కులా నికి చెందిన తిరునగరి అమృత వర్షిణిని పెళ్లాడటమే 23 ఏళ్ల ప్రణయ్‌ చేసిన పాపం. ఆస్పత్రి ముందు జరిగిన ఈ హత్య కూడా సీసీటీవీలో నమోదయింది. తండ్రి మారుతీరావే ప్రణయ్‌ను చంపించాడని అమృత ఆరోపించింది. ప్రణయ్‌ను కత్తితో తల నరికి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బిహార్‌కు చెందిన సుభాష్‌ శర్మ అనే ఈ హంతకుడిని వినియోగించి ప్రణయ్‌ను చంపడానికి  కోటి రూపాయలు ఖర్చుచేశారని తెలుస్తోంది. ప్రణయ్, అమృత జనవరిలో వివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. పెళ్లిని వ్యతిరేకించిన ఆమె తండ్రి గర్భస్రావం చేయించుకోమని ఒత్తిడి తేగా అందుకు అమృత అంగీక రించలేదు.

శంకర్‌ హత్య జరిగిన కొద్ది రోజులకు కౌసల్యను కలిశాను. అప్పు డామె తన అత్తవారింట్లో శంకర్‌ నాయనమ్మ, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి ఉంటోంది. అది ఒకే గది ఉన్న పూరిల్లు. కన్నవారింట్లో మరింత సౌఖ్యంగా కౌసల్య బతికింది. ‘‘శంకర్‌ లేకుండా బతకలేను. చాలా ఒంట రినయ్యా’’ అని కౌసల్య చెప్పింది. కులం సజీవంగా ఉన్న తమిళనా డులో దళితుడిని చంపి జైలుకెళ్లడాన్ని గర్వపడే చర్యగా పరిగణిస్తారు. తన భర్తను చంపిన కిరాయి హంతకుడు చేసిన గాయాల గుర్తులను దాచుకునేందుకు తన తలకు కౌసల్య గుడ్డ కట్టుకుంది. ఇలాంటి పరువు హత్యల వల్ల ప్రయోజనం లేదంటూ రక్తానికి కులం ఉంటుందా? అని ప్రశ్నించింది. ‘‘తల్లిదండ్రులు పెద్ద మనసు చేసుకుని పిల్లలను ఇష్ట ప్రకారం పెళ్లిచేసుకోనివ్వాలి. ఇలా చంపడం వల్ల ఏం సాధిస్తారు?

నా సంగతే చూడండి. శంకర్‌ను చంపేశారు. నా తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు. నేనేమో ఒంటరినై ఇక్కడున్నాను’’ అని కౌసల్య బాధపడుతూ చెప్పింది. ఇప్పుడు అమృత మాటలు వింటుంటే కౌసల్య మరోసారి మాట్లాడినట్టే అనిపిస్తుంది. బిడ్డను కనాలనే పట్టుదలతో ఉన్న అమృత తన భర్త ప్రణయ్‌కు న్యాయం చేయాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. ‘‘కులాంతర పెళ్లిళ్లతోనే మనం కుల వ్యవ స్థను నిర్మూలించగలం. కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తూ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశించినట్టు దీన్ని సాధించాలి. అమానుష కుల వ్యవస్థను మనం సవాలుచేయాలి’’ అని అమృత చెప్పింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కౌసల్య, అమృత వంటి అమ్మా యిలకు పౌరసమాజం ఇంతటి కఠిన శిక్షలు వేయడాన్ని బట్టి చూస్తే మనం ఎక్కడున్నాం? అనే ప్రశ్న తలెత్తుతోంది. కులం రాతిపై చెక్కిన బొమ్మలా నిలబడిపోయింది. ఓ పక్క దళితుల కోసం ప్రగతిశీల ఉద్య మాలు నడుస్తూ కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నా తమిళనాట రాజకీయంగా శక్తిమంతమైన వెనుకబడిన, అగ్రకులాలు తమ పిల్లలు దళితులతో సంబంధాలు పెట్టుకోవడాన్ని సహించడం లేదు. తమ మాట వినని పిల్లలు దళితులను పెళ్లాడితే పెద్ద అవమానం జరిగినట్టు భావించే ఈ పెత్తందారీ కులాలు దళితులపై దాడులకు దిగుతున్నాయి. పైకి సాత్వికులుగా కనిపించే వ్యక్తులు ఇలాంటి పెళ్లిళ్ల కారణంగా హంత కులుగా మారుతున్నారు. దళితులను పెళ్లాడిన తమ కూతుళ్లు ఏదేమైనా తిరిగి తమ ఇళ్లకే తిరిగి రావాలని అమృత, కౌసల్య తండ్రులు కోరు కున్నారు. అది తాము విధించే పరిమితుల్లోనే కుమార్తెలు బతకడమే వారు ఆశించింది. తండ్రుల మాటే అక్కడ చెల్లుతుంది. కోర్టు తీర్పు వచ్చిన రోజున కూడా తండ్రి ముఖం చూడటానికి కౌసల్య నిరాకరిం చింది. అమృత తన తండ్రికి మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తోంది. కులభేదం కారణంగా తండ్రీకూతుళ్ల అందమైన బంధం నాశనమైంది.

కులాంతర పెళ్లిళ్లకు సర్కారీ ప్రోత్సాహం!
కులాంతర వివాహాల ప్రోత్సాహానికి తాను చేయాల్సిందంతా చేస్తున్నా నని భారత ప్రభుత్వం చెబుతోంది. వధూవరుల్లో ఒకరు దళితులైతే కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ రెండున్నర లక్షల రూపా యలు ఇస్తోంది. పైకి ఇంత చేస్తున్నట్టు కనిపిస్తున్నా రాజకీయ నాయ కులు తమ కార్యక్షేత్రాల్లో కులాంతర వివాహాలు ప్రోత్సహించడం లేదు. సంపన్న వన్నియార్, దేవర్, గౌండర్‌ కుటుంబాలకు చెందిన ఆడపిల్ల లను ఆకర్షించడానికి దళిత కుర్రాళ్లు రోమియోల్లాగా దుస్తులు ధరిస్తున్నా రని పీఎంకే నేత, వన్నియార్ల నాయకుడు డాక్టర్‌ ఎస్‌.రాందాస్‌ కొన్నేళ్ల క్రితం ఆరోపించారు. ఈ మూడు ఓబీసీ కులాలూ తమిళనాట రాజ కీయంగా శక్తిమంతమైనవి. అనేక బీసీ కులాల నేతలు రాందాస్‌ అభిప్రాయంతో ఏకీభవించారు.

గౌండర్‌ కులానికి చెందిన సీకే నాగ రాజ్‌ తమ వర్గం కోసం కొంగు జన నాయక పార్టీ స్థాపించి 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేశారు. రాందాస్‌ మాదిరిగానే కులాంతర వివాహాలను నాగరాజ్‌ తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారు. ‘‘అమ్మాయి వెనకాల ఒకటి రెండు నెలలు తిరుగుతారు. ఆ పిల్ల ప్రేమలో పడినాక ఆమెను తీసుకుపోతారు. ఆ అమ్మాయి పుట్టింటి నుంచి డబ్బుతోనో బంగారంతోనో వస్తుంది. లేదా ఆ యువతిని తిరిగి తమ ఇంటికి రప్పించడానికి ఆమె తల్లిదండ్రులు ఎంత సొమ్మయినా చెల్లించడానికి సిద్ధమౌతారు’’ అంటూ దళిత యువకులు బీసీ, అగ్రకులాల యువతులను వలవేసి పట్టుకుంటారని నాగరాజ్‌ వివ రించారు.  

దళితులతో ఇలాంటి పెళ్లిళ్లు మాకు అవమానం!
దళిత కుర్రాళ్లతో పైన చెప్పిన ఓబీసీ కులాల యువతుల ప్రేమ పెళ్లిళ్ల గురించి నాగరాజ్‌ చర్చిస్తూ ‘‘ఇలాంటి పెళ్లిళ్లు మా కుటుంబానికి పెద్ద అవమానం. ఈ వివాహం జరిగాక యువతి తల్లిదండ్రులు వీ«ధుల్లో తిరగలేరు. మరో కూతురు ఉంటే ఆ అమ్మాయిని కులంలో ఎవరూ పెళ్లా డరు’’అంటూ చెప్పుకొచ్చారు. పెద్దగా ఆస్తిపాస్తులు లేని కుటుంబాలు కూడా కులానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కోయంబత్తూరులోని మారియమ్మన్‌ గుడిలో వాచ్‌మన్‌గా పనిచేసే ముత్తుస్వామి గౌండర్‌ను కలిశాను. కులాంతర వివాహాలను మీరు సమర్థిస్తారా? అని ఆయనను ప్రశ్నించాను. ‘‘నా కొడుకు ఓ దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను అతనికి తండ్రిని కాకుండా పోతాను. నా కొడుకు జీవితం నాశనమైతే నేనెలా సంతోషంగా ఉంటాను?’’ అని గౌండర్‌ అడిగాడు.

కులం పరువే ముఖ్యమన్న మారుతీరావు!
మిర్యాలగూడలో తన కూతురు పెళ్లాడిన దళిత యువకుడు ప్రణయ్‌ను చంపించిన మారుతీరావు కూడా పైన చెప్పినట్టే మాట్లాడాడు. తనకు కులం పరువే ముఖ్యమని మిర్యాలగూడ పోలీసులకు ఆయన చెప్పాడని తెలుస్తోంది. మారుతీరావుకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. జిల్లా రాజకీయ నాయకులందరితో అతనికి మంచి సంబంధాలున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా తమను బెదిరించారని అమృత చెప్పింది. అయితే, ఈ ఆరోపణపై పోలీసులకు ఆధారాలు లభించలేదు. తమిళనాడులో 2013–2016 మధ్య 80 వరకూ పరువు హత్యలు జరిగినట్టు వార్తలొచ్చాయి. ప్రభుత్వం మాత్రం అన్ని జరగ లేదని చెబుతోంది. తెలంగాణలో 2014 జూన్‌ నుంచి 19 పరువు హత్యలు జరిగాయని దళిత ఉద్యమకారులు చెప్పారు. ఈ హత్యలు తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో అంటే పెద్దపల్లి నుంచి నల్లగొండ వరకూ జరిగాయి.

కుల స్పృహ ఎంత ఎక్కువగా ఉందో దీన్ని బట్టి అర్థమౌ తోంది. మీడియా, ప్రజల దృష్టి అమృత–ప్రణయ్‌ కేసుపై నిలిచి పోవడంతో పోలీసులు ఈ కేసులో బాగా కష్టపడి నేరస్తులను గుర్తించ డానికి ప్రయత్నించారు. తెలంగాణలోని అన్ని పార్టీల నేతలూ సహజం గానే  కుల హింసను ఖండిస్తున్నారు. ప్రణయ్‌ హత్యను ఐటీ మంత్రి కె.తారక రామారావు ఖండిస్తూ, ఇది క్రూరమైన నేరమనీ, న్యాయం జరిగేలా చూస్తామని ట్విట్టర్‌లో తెలిపారు. ఈ హత్యపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడకపోవడంపై దళిత ఉద్యమకారులు అసం తృప్తితో ఉన్నారు. ఇలాంటి హత్యలు సహించేది లేదని కేసీఆర్‌ బాహా టంగా ఈ విషయంపై మాట్లాడితే ప్రజలకు ఇది బలమైన సందే శమౌతుందనే వాదన వినిపిస్తోంది.

ముఖ్యమంత్రి మౌనం కారణంగా  ఇలాంటి దారుణ హత్యలు చేయడానికి కొందరికి ధైర్యం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమృత జీవితం ఎటు తిరుగు తుంది? ఆమె కౌసల్య మార్గంలోనే పయనించబోతోంది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరడంతో పాటు కుల హింసపై జరిగే సమావేశాల్లో మాట్లాడే అవకాశాలు లెక్కలేనన్ని వస్తాయి. ప్రణయ్‌ మరణం మతి మాలిన రక్తపాతానికి పాల్పడకూడదనే సందేశం ఇవ్వాలని అమృత కోరుకుంటోంది. ఇండియాలో పెళ్లిసంబంధాలు, రాజకీయాలు సైతం కులం ప్రాతిపదికనే జరుగుతున్నందున బాగా పాతుకుపోయిన కుల భేదాలు తొలగించడం అంత తేలిక కాదు.

వ్యాసకర్త : టీఎస్‌ సుధీర్‌, సీనియర్‌ జర్నలిస్టు

ఈ–మెయిల్‌ : tssmedia10@gmail.com
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement