
సందర్భం
సమాజంలో స్త్రీలకు పురుషులతోపాటు సమాన హక్కులు, అవకాశాలు కావాలని.. నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం కావాలని, వనరులు, భూములు, నివాసం, ఉత్పత్తి సాధనాలపై తమ వాటా కోసం పోరు బాటలో నడవటమే మహిళా ఉద్యమాల లక్ష్యం.
ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) గత నాలుగు దశాబ్దాలకు పైగా మహిళలపై జరిగే అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా మహిళా హక్కుల సాధన కోసం పోరాడుతోంది. మహిళా ఉద్యమాలతోపాటు అనేక పోరాటాలను నిర్వ హించి రాష్ట్రంలో బలమైన సంఘంగా గుర్తింపు పొందింది. స్త్రీలపై జరిగే అన్ని రకాల దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పీవోడబ్ల్యూ మహిళా కార్యకర్తల్ని రాజకీయంగా అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో, శ్రామికవర్గ మహిళా ఉద్యమాన్ని నిర్మించే ఆశ యంతో భద్రాద్రి కొత్తగూడెంలో అక్టోబర్ 21, 22, 23 తేదీలలో తెలం గాణ రాష్ట్ర 2వ మహాసభలను నిర్వహించుకోబోతోంది.
సమాజంలో స్త్రీలకు పురుషులతోపాటు సమాన హక్కులు, అవ కాశాలు కావాలని.. నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం కావాలని పీవోడబ్ల్యూ పోరాడుతోంది. వనరులు, భూములు, నివాసం, ఉత్పత్తి సాధనాలపై తమ వాటా కోసం, నిజమైన స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం కృషి చేస్తోంది. బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, హత్యలు, లైంగిక దాడులు, సామాజిక అణచివేతలకు, రాజ్యహింసకు వ్యతిరే కంగా దృఢతరమైన పోరాటాన్ని సాగిస్తున్నది. శ్రామిక మహిళా విముక్తి లక్ష్యంగా, గ్రామీణ, ఏజెన్సీ మహిళా ఉద్యమ నిర్మాణం ప్రాథమికమైన దిగా భావించి ఆ వర్గాల మహిళలను పోరాటాలలో సమీకరించడానికి కృషి చేస్తున్నది. విద్యార్థినులు, ఉద్యోగినులు, పట్టణ, నగర మధ్య తర గతి మహిళలు తదితర అన్ని సెక్షన్ల మహిళలు ఎదుర్కొనే సమస్యలపై స్పందించి పోరాటాలను నిర్మిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అనేక వాగ్దానాలతో ప్రజ లను నమ్మించి టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వా మ్యాన్ని కాపాడుతానని, నక్సలైట్ ఎజెండాను అమలు పరుస్తానని, మహి ళల సంక్షేమాన్ని అమలు చేస్తానని కేసీఆర్ ప్రమాణం చేశారు. సీఎం అయిన తర్వాత ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కనీసం ఒక్క మహిళకు కూడా క్యాబినెట్‌లో చోటు కల్పించలేదు. షీ టీమ్స్ పేరుతో ఊదరగొడుతూ మహిళల భద్రతను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. బంగారు తెలంగాణ పేరుతో ఇక్కడి వనరులను, భూములను, సంపద లను ఏవీ వదలకుండా గుంజుకుంటున్నారు. తమ హక్కుల కోసం పోరా డుతున్న ఉద్యమకారులపై లాఠీచార్జీ చేయించి, అక్రమ కేసులు బనాయిం చారు. ప్రజాస్వామిక వాతావరణాన్ని దెబ్బ తీశారు. ఆదివాసీ ప్రాంతాల్లో వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలపై అణచివేత, లైంగిక దాడులు, హింస పెరుగుతోంది.
గత మూడున్నరేళ్లుగా హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో లక్షల ఎకరాలకు నీరివ్వలేదు. వేల ఉద్యోగాలూ ఇవ్వలేదు, ఒక కొత్త పరిశ్రమ స్థాపించలేదు. కానీ మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ బడ్జెట్‌ను లోటు బడ్జెట్‌గా మార్చి వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణను పోరాడి సాధించుకున్న ప్రజలు అనన్య త్యాగాలు చేశారు. ఆ త్యాగాలను నేడు బూడిదలో పోసిన పన్నీరుగా మార్చే ప్రయత్నం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రాజ్యహింస పెచ్చరిల్లిపోయి తెలంగాణలోని ఆదివాసులు, దళితులు, ప్రజాస్వామికవాదులు బతకలేని పరిస్థితి కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాల మీద విపరీతమైన నిర్బంధం ఏర్పరిచింది. దీనిపై ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు వీరోచిత పోరాటం చేస్తున్నా, ప్రభుత్వం మరింత నిర్బంధం పెంచుతున్నది.
ఇందులో భాగంగానే నేరెళ్లలోని దళితులను చిత్రహింసలకు గురిచేయడం. మంతెన మధుకర్ ఘటన, జనగామ నరేష్ సంఘటన, భోంపల్లి శ్యామల ఉదంతం... ఇలా దళితులపై జరు గుతున్న దాడులకు పరాకాష్ట దశను చూస్తున్నాం. తాడ్వాయి మండలం లోని జలంచ గ్రామంలో ఆదివాసీలను చెట్టుకు కట్టేసి కొట్టారు. వారికి నిలువ నీడ లేకుండా చేసి, తిండి పదార్థాలను బుగ్గిపాలు చేసారు. గొత్తి కోయలను వెంటాడి తరుముతూ వారిని ఈ దేశ పౌరులుగా కూడా పరిగణించడం లేదు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో పాటు ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేలా ధర్నాచౌక్ ఎత్తివేసి రాజ్యాంగ, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. మహిళలపైనే కాకుండా సమాజం లోని అన్ని వర్గాల ప్రజలపై సాగుతున్న ప్రభుత్వ దమనకాండకు వ్యతి రేకంగా సమైక్య పోరుకు పిలుపునిస్తున్నాం.
(కొత్తగూడెంలో అక్టోబర్ 21, 22, 23 తేదీలలో పీవోడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభల సందర్భంగా)
వి. సంధ్య
వ్యాసకర్త పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ‘ 98490 18471
Comments
Please login to add a commentAdd a comment