‘ఒంటరి’తనంతోనే పరాజయం | Vittal Writes on CPI Loss in Elections | Sakshi
Sakshi News home page

‘ఒంటరి’తనంతోనే పరాజయం

Published Tue, Mar 6 2018 2:50 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

Vittal Writes on CPI Loss in Elections - Sakshi

రెండో మాట
విశ్లేషణ
దేశవ్యాప్తంగా తమ ప్రత్యేకతలను గుర్తించే నిజమైన సమాఖ్య వ్యవస్థ కావాలన్న కోరిక బలమవుతోంది. బీజేపీ తన అఖండ భారత్‌ నినాదాన్ని, ఏక శిలా సదృశమైన హిందూ జాతి అనే నినాదాన్ని వదిలి, తమ తమ ప్రత్యేక హక్కులను కాపాడాలంటున్న వారితో ఎన్నికల స్నేహం చేస్తోంది. కానీ ఒక వ్యక్తికి అన్యాయం జరిగితేనే పోరాడాల్సిన కమ్యూనిస్టు పార్టీ.. ఒక ప్రాంతం ప్రాంతానికే అన్యాయం జరుగుతుంటే, ఆ ప్రజల సరైన భావోద్వేగాలకు విలువ ఇవ్వకుండా సమైక్య నినాదంతో ముందుకెళ్లి ‘ఒంటరి’ అయింది.

ఇటీవల ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో, త్రిపురలో వామపక్ష కూటమి ఓటమి ప్రత్యేకించి సీపీఎం పార్టీ వారికే కాదు.. సహజంగా వామపక్ష ప్రజాతంత్ర శక్తులను, వ్యక్తులను కొంత ఆవేదనకు, నిరాశకు గురి చేసింది అనడంలో అవాస్తవం లేదు. ఎందుకిలా జరిగిందని నన్ను చాలా మంది ఫోన్‌లో అడిగారు. నాకు సైతం మాణిక్‌ సర్కార్‌ నేతృత్వంలో ఉన్న త్రిపుర ప్రభుత్వ ఓటమి ఓ పట్టాన మింగుడు పడలేదు.

నిజానికి అందుకు తక్షణ కారణాలేమిటి? ప్రజలలో ఆ పాలన పట్ల వచ్చిన వ్యతిరేకతే ప్రధాన కారణమా? 20 ఏళ్లు అవిచ్ఛిన్న పాలన పిదప అక్కడి ప్రజలు ‘మోదీ షా’లు చేసిన మార్పు నినాదానికి భ్రమపడ్డారా? ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. అదే సమయంలో డబ్బు వెదజల్లడం వంటి అప్రజాస్వామిక ధోరణిలో సాగుతున్న ధనికస్వామ్య ప్రభావం అని సరిపుచ్చుకోలేకపోతున్నాను. అలాగే కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన ఓట్లు చాలా తక్కువ (కేవలం 2 శాతం) కనుకఆ ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయా? అయితే కాంగ్రెస్‌ అలా బీజేపీకి మద్దతిచ్చే ప్రసక్తి ఉండదనిపిస్తున్నది.

ఏదేమైనా.. దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరిలో నిరాడంబరుడు, అవినీతిరహితుడు, ఇంకో మాటలో చెప్పాలంటే అత్యంత పేదవాడు, సౌమ్యుడిగా దేశవ్యాప్తంగానే గౌరవాభిమానాలు పొందిన ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ప్రభుత్వ ఓటమి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఔన్నత్యమే. ప్రజల జీవితాలను మెరుగుపర్చడం ఈ పార్లమెంటరీ వ్యవస్థకున్న పరిమితుల్లో సాధ్యమా అన్న ప్రశ్న రావడంలోనూ ఆశ్చర్యం లేదు. అంతే కాదు అస్తుబిస్తుగా ఉన్న ఈ ‘అవ్యవస్థ’ కూడా నేటి ‘మోదీ షా’ల పాలనలో మృగ్యమవుతున్నది.

భౌతిక వాస్తవికత విస్మరిస్తే ఎలా?
మన దేశంలో కమ్యూనిస్టుల వైఫల్యాలను గురించి ఆ పార్టీ నేతల్లో వారినో, వీరినో విమర్శించి సరిపుచ్చుకుంటే తప్పు చేసినవారమవుతాం. వ్యక్తుల తప్పుల పేరుతో భౌతిక వాస్తవికతను విస్మరించజాలం. కార్ల్‌మార్క్స్‌ తన కమ్యూనిస్టు మేనిఫెస్టో ఆరంభంలోనే ‘ఈ మేనిఫెస్టో ఇంగ్లాండ్‌ వంటి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలకు వర్తిస్తుంది. కానీ, అన్ని దేశాలూ ఇదే మానిఫెస్టోను యధాతథంగా అమలు జరపకుండా తమతమ దేశాల భౌతిక వాస్తవిక పరిస్థితిలో తగు మార్పులు చేసుకుని అన్వయించుకోవాల్సి ఉంటుంద’ని స్పష్టంగా పేర్కొన్నారు.

కనుక ముందుగా మన కమ్యూనిస్టు పార్టీలు, మార్క్సిజాన్ని మన దేశ భౌతిక వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా అన్వయించ గలుగుతున్నాయా? అన్నది మొదటి ప్రశ్న. అలాంటప్పుడు మన దేశ ప్రత్యేక భౌతిక వాస్తవం ఏమిటి? వర్ణ (కుల) వ్యవస్థ పేరుతో వర్గదోపిడీ, వర్ణ (కుల) అణచివేత అంటే సామాజిక, సాంస్కృతిక అణచివేత పడుగుపేకల్లా కలిసే ఉన్నాయి. కనుక ఆ రెండు విధాల దోపిడీ అంతం కానిదే సోషలిజం సాధన మాట అటుంచి, కనీస పురోగమన చైతన్యం కూడా సాధించలేం. దీనిపై కమ్యూనిస్టులలో, బహుజనుల్లోనూ పునరాలోచన సాగుతోంది.

అయితే, భారతదేశంలోని మరో ప్రధానమైన ప్రత్యేకత అయిన జాతీ యత అంశంపై మేధావుల్లో చర్చ జరగలేదు. దేశంలో విభిన్న రాష్ట్రాలు ఉన్నాయి. వాటిని భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటున్నాం. నిజానికి అవన్నీ వివిధ జాతుల సముదాయం అనడం సవ్యంగా ఉంటుంది. కానీ, ఇది అఖండ భారత జాతి’  అనీ, ‘ఏక శిలా సదృశమైన భారతజాతి’ అనీ, అఖండ హిందూ జాతి అని వాదించే జాతీయ ఉన్మత్తులు, మతతత్వవాదులు కూడా ఉన్నారు.

అలాగే బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర సంగ్రామాన్ని భారత జాతీయోద్యమం అని మామూలుగా అంటుంటాము. కానీ వాస్తవానికి అది భారత జాతుల ఉద్యమం అనడం శాస్త్రీయంగా, వాస్తవికంగా ఉంటుంది. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా వివిధ తరహాల ప్రజానీకం వివిధ పోరాట రూపాలను ఎంచుకున్నారు. భగత్‌సింగ్, చంద్రశేఖర్‌ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, గదర్‌ వీరులు, వీరపాండ్య కట్టబ్రహ్మన్, టిప్పుసుల్తాన్‌.. ఇలా ఎంతోమంది వైవిధ్య భరితంగా పోరాడారు.

అలాగే గిరిజనులు ఆదివాసీలు, వివిధ జాతులకు చెందినవారు తమ జీవన భద్రతకే కాక ఆత్మగౌరవం కోసం కూడా పోరాడారు. పైగా వివిధ రాజ్యాల పాలకులు కూడా కొన్ని చోట్ల జనంతో కలిసి పోరాడారు. సిపాయిల తిరుగుబాటు దీనికి ఒక చక్కని ఉదాహరణ. మతాలు వేరైనా, వలస బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా హిందూ, ముస్లిం వీరులు ఐక్యంగా పోరాడారు. కార్మికవర్గ తిరుగుబాట్లు, నావికా తిరుగుబాటులో మన సైని కులు.. వీటన్నింటి సమష్టి కృషి వల్లే స్వతంత్ర భారత్‌ ఆవిర్భవించింది. ఈ పోరాటాలన్నింటినీ పూర్వపక్షం చేస్తూ ఏక శిలాసదృశమైన భారత జాతీయ పోరాటం అనడం, ఆయా పోరాటాల ప్రభావాన్ని, ప్రజల ధైర్యసాహసాలను త్యాగనిరతిని మరుగుపర్చినట్లే అవుతుంది.

మతం జాతికి ప్రాతిపదిక కానే కాదు
కమ్యూనిస్టులు ప్రత్యేకించి గుర్తుంచుకోవలసిన అంశం ఒకటుంది. జాతికి మార్క్సిస్టు దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ స్టాలిన్‌ ఒక నిర్వచనం లాంటిది చెప్పారు. ‘జాతి అంటే ప్రధానంగా ఒకే భాష, కుడిఎడంగా ఒకే భౌగోళిక వాతావరణం, ఒకే జీవన విధానం సారూప్యంగా ఉండే సాంప్రదాయ వ్యవహార శైలి ఉండేది జాతి’. కానీ మనదేశంలో ప్రధాని, రాష్ట్రపతి తమ తమ మాతృభాషల్లో ప్రసంగిస్తే నూటికి 50 మందికి పైగా మన దేశ ప్రజానీకానికి అర్థం కాదు. ఇక్కడ వివిధ రకాల భౌగోళిక వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇక ఆహార అలవాట్ల వైవిధ్యం చెప్పనక్కర్లేదు.

ఇంత వైవిధ్యం, ప్రాంత భిన్నత్వం గల జాతుల సముదాయంగా ప్రపంచంలో మరే దేశమూ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కెంపులు, నీలాలు, పచ్చలు ఇలా నవరత్నాలు పొదిగి ఉన్న స్వర్ణాభరణంలో శోభాయమానమైన వివిధ జాతుల సముదాయం మన దేశం. దాన్ని మొత్తాన్ని కరిగించి ఒకే వెండికడ్డీలాగా పోత పోయడం మాదిరి, ఒక ఏకశిలా సదృశ్యమైన భారత జాతి అనడం అశాస్త్రీయమే కాదు అవాంఛనీయం కూడా.

నిజానికి మతం జాతికి ప్రాతిపదిక కానేకాదు. స్టాలిన్‌ 1951లోనే నేటి తూర్పు పాకిస్తాన్, పాకిస్తాన్‌లను మత ప్రాతిపదికన ఒకటి చేశారు కానీ తూర్పు పాకిస్తాన్‌లోని వంగ జాతి పాకిస్తాన్‌ నుంచి విడిపోయి వేరే దేశంగా ఏర్పడుతుంది అన్నారు. మరో 22 సంవత్సరాల్లో ఆ జోస్యం నిజమైంది. ఆ విధంగా మతం జాతికి ప్రాతిపదిక కాదని రుజువైంది.

త్రిపురలో మార్క్సిస్టుల ఓటమి సందర్భంగా ఈ జాతుల ప్రస్తావన దేనికి? అనే ప్రశ్న రావచ్చు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే అప్పటి కమ్యూనిస్టు పార్టీ ఈ జాతుల విషయంలో ఒక తీర్మానం చేసుకుంది. తత్పర్యవసానమే సుందరయ్యగారి విశాలాంధ్రలో ప్రజారాజ్యం రచన. బెంగాల్‌ కమ్యూనిస్టు పార్టీ ‘సోనార్‌ బంగ్లా’ కూడా అదే. కేరళలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ ‘సుందర కేరళ’ అన్నది ఆ కోవలోనే. దేశంలోని వివిధ జాతుల ప్రజానీకం తమ తమ ప్రత్యేక రాజ్యాంగాలతో తమతమ నూతన ప్రజాస్వామ్య పాలనను సాధించుకోవాలనీ కేంద్ర ప్రభుత్వం అనేది రక్షణ, రవాణా, కరెన్సీ, విదేశీ వ్యవహారాలు వంటివాటికే పరిమితమైన ఫెడరల్‌ –సమాఖ్య– వ్యవస్థ ఏర్పడాలని నాటి కమ్యూనిస్టు పార్టీ (1943–44) తీర్మానం.

నిజమైన సమాఖ్య వ్యవస్థకు పెరుగుతున్న డిమాండ్‌
త్రిపురలో ఎన్నికల అనంతరం బీజేపీతో కలిసి పోటీచేసి వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించిన మర్నాడే బీజేపీ మిత్రపక్షం (గిరిజనుల ప్రాతినిధ్య సంస్థ) ఐపీటీఎఫ్‌ తాను బీజేపీతో కలిసి పోటీ చేసినా.. గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తమ దశాబ్దాల డిమాండును మాత్రం విడిచిపెట్టబోమని, బీజేపీ ప్రభుత్వం అలా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి తీరాలని ప్రకటించింది. నిజానికి దేశ వ్యాపితంగా తమ ప్రత్యేకతలను గుర్తించే, రాజ్యాంగబద్ధమెన నిజమైన సమాఖ్య వ్యవస్థ కావాలన్న కోరిక బలమవుతోంది.  

ఎన్నికల గెలుపు కోసం బీజేపీ తన అఖండభారత్‌ నినాదాన్ని, ఏక శిలా సదృశమైన హిందూ జాతి అనే నినాదాన్ని వదిలి, దానికి వ్యతిరేకంగా తమ తమ ప్రత్యేక హక్కులను కాపాడాలంటున్న వారితో ఎన్నికల స్నేహం చేస్తోంది. ఒక విధమైన జాతీయవాదం ఇప్పుడు ప్రబలుతోంది. ఇంతెందుకు, ప్రత్యక తెలంగాణ డిమాండ్‌ కూడా అలాంటి సదృశమైన ఉద్యమమే. కానీ ఒక వ్యక్తికి అన్యాయం జరిగి తేనే పోరాడాల్సిన కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రాంతం ప్రాంతానికే అన్యాయం జరుగుతుంటే, ఆ ప్రజల సరైన భావోద్వేగాలకు విలువ ఇవ్వకుండా సమైక్య నినాదంతో ముందుకెళ్లి ‘ఒంటరి’ అయింది.

తెలంగాణ న్యాయమైన పోరాటాన్ని సరైన రీతిలో నిర్వహించేందుకు కమ్యూనిస్టు పార్టీ పోరాడినట్లయితే ఎంతో ఘనమైన చరిత్ర గల కమ్యూనిస్టు పార్టీ ఇలా తిరిగి తమ ప్రాభవం కోసం కష్టపడి తంటాలు పడాల్సి ఉండేది కాదు. అస్సాం, కశ్మీర్‌ ఇలా కేవలం ఎన్నికల విజయం కోసం తమ అఖండ భారతాన్ని పక్కన పెట్టి తానే విచ్ఛిన్నకులుగా పేరు పెట్టిన వారితో ఎన్నికల ఒప్పందాలు కుదుర్చుకుని, అదంతా తన బలుపు అని బీజేపీ చూపిస్తోంది. కానీ కమ్యూనిస్టు పార్టీలు మాత్రం మా దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానివ్వం అన్న నినాదాలను ఒక కొసకు లాగి ఆయా జాతుల, ఉపజాతుల ప్రజల న్యాయమైన కోరికలకు సైతం మద్దతు ఇవ్వలేక వారినుంచి ఒంటరి అవుతున్నాయి.

ఇప్పుడు మూడో ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ వంటివారి ప్రయత్నాలకు నిజానికి బీజేపీ ఆశాస్త్రీయ, నిరంకుశ పాలనే ప్రధాన కారణం. అంతమాత్రాన కాంగ్రెస్‌ సమాఖ్య స్వరూపాన్ని నిలిపిందని కాదు. కమ్యూనిస్టులు గతంలో బతకడం, తమ వ్యూహమైన వామపక్ష ప్రజాతంత్ర సంఘటన పేరుతో నేడు అవసరమైన ఎత్తుగడలకు ప్రాధాన్యత ఇవ్వకుపోవడం అనేది దేశాన్ని ఆర్థిక రాజకీయ, సాంస్కృతిక దాస్యంలో మగ్గిపోయిన మధ్యయుగాల పాలన వంటి దుస్థితికి దారితీస్తుంది. నిజానికి ఈశాన్య ప్రాంత ప్రజల న్యాయమైన డిమాండ్లను కమ్యూనిస్టు పార్టీలే తీసుకుని ప్రజాపోరా టాన్ని పెంచి ఉంటే ఆ పోరాటం అభివృద్ధి నిరోధక శక్తుల ఆధిపత్యంలోకి పోకుండా కొంతమేరైనా నియంత్రించగలిగేవారు.

వాస్తవానికి 1947లో స్వాతంత్య్రం రాకముందే నాగాలాండ్‌ తనను తాను ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించుకుని ఎన్నికలలో గెలిచి ఆనాటి రాజు నాయకత్వాన ప్రభుత్వాన్ని ఏర్పర్చుకుంది. అందులో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన భాగస్వామి కూడా. నిజంగా విచ్ఛిన్నకర పార్టీలను ఎదుర్కోవాలంటే, ప్రధాన శత్రువును గుర్తించి ఆయా ప్రాంత ప్రజల న్యాయమైన డిమాండ్లను బలపరుస్తూ ప్రతి అంశాన్ని అఖిల భారత స్థాయిలో కాకుండా స్థానికంగా ఉండే పార్టీలకు, స్థానిక నాయకత్వానికి స్థానిక ఉద్యమాలకు కమ్యూనిస్టులు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ దిశలో కమ్యూనిస్టు పార్టీ, బహుజనుల మధ్య ఐక్యత, మైత్రి బలపడాలి.

డాక్టర్‌ ఏపీ విఠల్‌
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్‌ : 98480 69720

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement