అందరి ముఖ్యమంత్రి | YSR Birth Anniversary: Bandaru Dattatreya Writes special Story | Sakshi
Sakshi News home page

అందరి ముఖ్యమంత్రి

Published Wed, Jul 8 2020 1:21 AM | Last Updated on Wed, Jul 8 2020 1:21 AM

YSR Birth Anniversary: Bandaru Dattatreya Writes special Story - Sakshi

ముఖ్యమంత్రిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి  ఎవ్వరికీ భయపడేవారు కాదు. మంత్రులు, అధికా రులు, ఇతరుల మీద ఆధా రపడి రాజకీయ నిర్ణయం చేసే వారు. ఉదాహరణకు 2004లో వారు మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. హిమాయత్‌నగర్‌ నియోజకవర్గంలోని నారాయణగూడ వద్ద డిస్టిల్లరీ చాలా సంవత్సరాల నుండి మూతబడి ఉన్నది. ఒకవైపు భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారు. ఆ స్థలంలో స్థానిక ప్రజలు ఒక పార్కును అభివృద్ధి చేశారు. నేను కేంద్రమంత్రిగా పర్యటిస్తున్నప్పుడు ఆ పార్కును స్థానికులు అభివృద్ధి చేయమని కోరారు. 2002లోనే నేను అప్పటి ముఖ్యమంత్రికి లేఖ ద్వారా దీన్ని విన్నవించాను. అయినా 2003లో ప్రభుత్వం ఆ భూమిని వేలం వేయాలని నిర్ణ యించింది. ఆ నిర్ణయాన్ని వ్యతి రేకించి నిర్ణయాన్ని అబేయన్సు (నిలుపుదల)లో పెట్టించడం జరిగింది.

2004 ఎన్నికల అనంతరం రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రాంత నూతన శాసన సభ్యులు జి.కిషన్‌రెడ్డి ‘ఆ పార్కును అభివృద్ధి చేయ మని నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. మీరూ మాట్లాడితే మీ మాట వింటారని’ అన్నారు. అప్పుడు నేను వైఎస్సార్‌ గారికి ఫోన్‌ చేసినప్పుడు, బాగున్నారా సర్‌ అని నా యోగక్షేమాలు అడిగారు. ఆ పార్క్‌ ఎలాగైనా అభివృద్ధి చేయాలని కోరాను. ఆ ఫైల్‌ ప్రాసెస్‌ అయ్యిందనీ, దానిని మీరు మళ్లీ అబేయన్సులో పెట్టడానికి సంతకం చేస్తున్నా రని తెలిసిందని అంటే, వారు ‘గత ముఖ్యమంత్రి మీ మిత్రులే గదా’ అని అడిగారు. ‘మీరు కూడా పాత ప్రభుత్వ బాటలోనే నడుస్తారా?’ అని ప్రశ్నించాను. వారు నవ్వుతూ, మీరు చెప్పారు కదా, నేను తప్పకుండా చేస్తాననీ, నెల తరువాత మీరే మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయండనీ అన్నారు. నేను ఇప్పుడు పార్ల మెంట్‌ సభ్యుడిని కాదని బదులివ్వగా, మీరే శంకుస్థాపన చేయాలి, మీకు జీఓ కాపీ పంపుతానని హామీ ఇచ్చి, వెంటనే తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆవిధంగా రాజ కీయాలకు అతీతంగా నిర్ణయాలు చేసేవారు. వ్యక్తిగతంగా ఆత్మీయ మైన సంబంధం నెలకొల్పుకునే వారు.

వై.ఎస్‌. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రాణ హిత నది గోదావరి నదిలో కలవక ముందే ఎత్తి పోతల ద్వారా తెలంగాణలో మంచినీటికి, ఐదున్నర లక్షల ఎకరాల సాగునీటికి ఉపయోగించాలని తలపెట్టి ఇందుకోసం పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేయడానికి జీవో 557 విడుదల చేసి, ఖర్చుల కోసం ఒక కోటి 66 లక్షల 40 వేల రూపాయలు విడుదల చేయడం జరి గింది. ఈ ఉత్తర్వులు ప్రాంతీయ విభే దాలకు ఆజ్యం పోసే విధంగా ఉన్నా యని నాటి మాజీ కేంద్రమంత్రి సీహెచ్‌. విద్యాసాగర్‌ రావు (ప్రస్తుత మాజీ గవర్నర్‌) నాకు ఫోన్‌ చేశారు. నేను వెంటనే ప్రభుత్వానికి లేఖ సిద్ధం చేయమనీ, బీజేపీ ప్రతినిధి బృందంతో ముఖ్యమం త్రిని కలుద్దామనీ బదు లిచ్చాను. 

వెంటనే ముఖ్యమంత్రి అపా యింట్‌మెంట్‌ అడ గ్గానే కేటాయిం చారు. మేము వెళ్ళగానే లేచి, పెద్దవారు వచ్చారని ఆత్మీయంగా మమ్మల్ని ఆహ్వానించి, మెమొరాండం మొత్తం చదివారు. ‘అవును నిజమే కదా’ అని కొంత ఆశ్చ ర్యానికి గురై, ఎలా జీవో జారీ చేశారని ఇరిగేషన్‌ కార్యదర్శి శర్మ ఐఏఎస్‌ గారికి ఫోన్‌ చేశారు. బయట మీడియా మిత్రులకు ఏమి చెప్పమం టారని అడిగితే, మీరు కోరినట్లే ప్రభుత్వం అంగీకరించిందనీ, ఐదున్నర లక్షల ఎకరాలకు బదులు పది లక్షల ఎకరాలకు సాగునీరు కొరకు, హైదరాబాద్‌ జంటనగరాలకు తాగునీటికి కేటాయించే విధంగా రెండు రోజుల్లో సవరించిన జీవో విడుదలవుతుందని మాట ఇచ్చినట్లు చెప్ప మన్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఆ విధంగా పార్టీలకు అతీతంగా ప్రజాను కూల నిర్ణయాలు త్వరితగతిన తీసుకునేవారు. 
 
రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రికి అనేక సమస్యల మీద లేఖలు వ్రాయడం ప్రారం భించాను. ఆ లేఖలకు ‘ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ’ అనే పేరు పెట్టాను. హైదరాబాద్‌ నగరానికి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ విషయంలో రంగారెడ్డి జిల్లాలో అనేకమంది రైతుల భూములు కారు చవకగా తీసుకొని నష్టపరిహారం ఎకరానికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేవారు. దానిని రాజశేఖరరెడ్డి ఎకరానికి ఎనిమిది లక్షలు చేశారు. భూమికి భూమి ఇవ్వాలని ఉద్యమించాము. అప్పుడు లేఖలు 100 దాటాయి. ఒకరోజు రైతు సమస్యల మీద ఆయన్ని కలవడానికి వారి నివాసానికి వెళ్ళాము.

ముఖ్య మంత్రి బయటకు వస్తూనే మమ్మల్ని చూసి రండి రండి అని మా వద్దకు వచ్చి మెమొరాండం తీసు కున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వట్టి వసంత కుమార్, బండారు దత్తాత్రేయ గారు మీకు బహిరంగ లేఖలు రాస్తూ మిమ్మల్ని విమర్శిస్తున్నా రని అన్నారు. దానికి వైఎస్సార్‌ చిరునవ్వుతో వారి బాధ్యత వారు నెరవేరుస్తున్నారు. వారు నాకు ఏ లేఖలు వ్రాసినా నేను వాటిని ‘ప్రేమ లేఖలు’గానే భావిస్తానని అదే చిరునవ్వుతో బదులిచ్చారు.  అలా వారు ఏ విషయమైనా స్పోర్టివ్‌గానే తీసుకునేవారు. ప్రజాహితం కోసం సహృదయంతో రాజకీయాలకతీతంగా నిర్ణయం తీసుకునేవారు.  


వ్యాసకర్త: బండారు దత్తాత్రేయ,
హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement