
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు అసలు సూత్రధారులను పక్కన పెట్టి, కేవలం డీల్ కుదిర్చిన మధ్యవర్తులనే అరెస్టు చేశారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెనుక చక్రం తిప్పిన బడా వ్యాపారి ప్రమేయాన్ని, రాజకీయ జోక్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శుక్రవారం నరసరావుపేటలో మీడియా మాట్లాడుతూ ప్రధాన నిందితులను అరెస్టు చేయకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో అసలైన దోషులను తప్పించి కేవలం మధ్యవర్తులుగా వ్యవహరించిన వారినే అరెస్టు చేయడం హేయమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. అసలైన నిందితులను అరెస్టు చేయకపోతే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. శుక్రవారం పట్టణంలోని రామ్‌కీ ఫౌండేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులో పోలీసులు నామమాత్రపు దర్యాప్తు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
రెవెన్యూ అధికారులు, కిడ్నీ దాతలకు మధ్యవర్తులుగా వ్యవహరించిన వారినే అరెస్టు చూపించారంటే పోలీసుల దర్యాప్తు ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేసులో రెవెన్యూ అధికారుల తప్పుందని, పెద్ద నాయకులు సిఫారస్ చేస్తేనే తహసీల్దార్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారని స్వయంగా ఎస్పీనే చెప్పారన్నారు. రెవెన్యూ అధికారులకు తెలియకుండా ఏవిధంగా అనుమతులు లభించాయనేది స్పష్టం కావాల్సిఉందన్నారు. నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఆర్డీవో కార్యాలయంలో మూడుపత్రాలు తీసుకున్నట్లు సాక్ష్యాలు కూడా కార్యాలయంలో ఉన్నాయన్నారు. కపలవాయి విజయకుమార్ అనే వ్యాపారి కాల్ చేసినందునే సర్టిఫికెట్లు ఇచ్చామని తహసీల్దార్, జిల్లా ఎస్పీలు ఇద్దరూ చెప్పారన్నారు. వీరందరినీ వదిలేసి కేవలం దళారులనే బాధ్యులుగా చేయడం సరికాదన్నారు.
నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం అక్రమాలకు కేంద్రంగా మారిందని, కిడ్నీ రాకెట్ వ్యవహారం ముగియకముందే ఎన్నికల కమిషన్ బీఎల్వోలకు ఇచ్చే పారితోషికం చెల్లింపుల్లో అవకతవకలు బయటపడ్డాయన్నారు. వారికి ఇవ్వాల్సిన డబ్బులను రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు స్వాహా చేశారని విమర్శించారన్నారు. ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే ఎకరానికి రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. భూమి అడంగల్‌లో ఎక్కించాలంటే దానికొక ఫీజు నిర్ణయించి వసూలుచేస్తున్నారన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి కాకుమాను సదాశివరెడ్డి, మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డి , జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా తదితరులు ఉన్నారు.