సాక్షి, గుంటూరు వెస్ట్: ఎన్నికల కమిషన్ కళ్లుగప్పి ఏదైనా చేయొచ్చనుకుంటే చాలా పొరపాటని.. తాము రాజకీయ పార్టీలను గమనిస్తూనే ఉంటామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి వివిధ రాజకీయ పార్టీలతో ఆయన సమావేశం నిర్వహించారు. రాజకీయ నాయకులు ఎన్నికల నియమావళిని క్షుణ్ణంగా చదవడంతోపాటు తమ కార్యకర్తలకు కూడా వివరించాలన్నారు. ఇక నుంచి ఓట్ల తొలగింపు ఉండదని తెలిపారు. ఈనెల 15 వరకు ఓట్ల కోసం నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తప్పుడు ఫాం–7 దరఖాస్తు చేసిన 11 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఒక అభ్యర్థికి ఒక వాహనమే అనుమతిస్తామని, అది కూడా రిటర్నింగ్ అధికారి వద్ద అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. కాన్వాయ్‌లో 10 వాహనాల వరకు అనుమతి ఉంటుందని, అంతకు మించి వాడితే ఎన్నికల ఖర్చు కింద జమ జేస్తామన్నారు.
అయితే, కాన్వాయ్‌లో ఆటో రిక్షా, టూ వీలర్స్‌ని కూడా లెక్కిస్తామని తెలిపారు.అసెంబ్లీకి రూ.28 లక్షలు, పార్లమెంట్ అభ్యర్థికి రూ.70 లక్షల వరకు ఖర్చు అనుమతి ఉంటుందని చెప్పారు. ఓటర్ల లిస్టు అవకతవకలపై అపోహలొద్దని తెలిపారు. గత రాత్రి నుంచి చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామని, ఇప్పటికే వాహనాలు తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఆర్వో శ్రీలత, వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ ఐటీ విభాగం సమన్వయకర్త కొత్త చిన్నపరెడ్డి, తాళ్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు
ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే సహంచేది లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం సాధారణ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు, సంబంధిత సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్‌ను, మార్గదర్శకాలను, నియమావళిని తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఒక నెల మాత్రమే పోలింగ్‌కు గడువు ఉన్నందున ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.
రానున్న నాలుగురోజుల్లో పరిశీలకులు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల్లో అక్రమాలను నిరోధించడానికి ఎన్నికల సంఘం కొత్తగా రూపొందించిన సీవిజిల్ యాప్ పౌరులతో పాటు పాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను అతిక్రమించే సమయంలో ఎవరైనా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. ఈయాప్‌పై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు వాల్‌పోస్టర్లు, కరపత్రాలు ముద్రించాలంటే ముందుగా అనుమతి తీసుకోవడంపాటు ఆ పత్రాలపై ప్రింటర్, పబ్లిషర్ పేరును తప్పనిసరిగా ముద్రించాలని, దీనిపై ప్రింటర్స్‌కు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు
రూరల్ ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని, అందుకనుగుణంగా అవసరమైన పోలీసు బలగాల కోసం ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. అర్బన్ ఎస్పీ సీహెచ్.విజయరావు మాట్లాడుతూ అర్బన్ పరిధిలోని పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాల్లో పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చేపడుతున్న చర్యలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హిమాన్ శుక్లా, నగరపాలక కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment