న్యూయార్క్: మానవ శరీరంలోని ఎముకలు, కండరాలు గట్టిగా, దృఢంగా ఉండాలంటే శరీరంలో చాలినంత డీ విటమిన్ ఉండడం తప్పనిసరి. శరీరంలోని కాల్షియం, ఫాస్పేట్, న్యూట్రియంట్ల పాళ్లను క్రమబద్ధీకరించడంలో డీ విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది. సూర్యరశ్మి నుంచి ఉచితంగా లభించే ఈ డీ విటమిన్ వల్ల ఇంతకుముందు అంచనా వేసిన వాటికన్నా మరెన్నో ఉపయోగాలున్నాయని ప్రపచంవ్యాప్తంగా నిర్వహించిన పలు తాజా పరిశోధనల్లో తేలింది. డీ విటమిన్ లోపం వల్ల పిల్లల్లో డయాబెటీస్ ఒకటవ రకం వస్తుంది. డీ విటమిన్ ఎక్కువ వున్న వారికంటే డీ విటమిన్ తక్కువ ఉన్న యువకులలో పెద్దవాళ్లలో గుండె జబ్బులు, కార్డియో వాస్కులర్ డిసీజ్‌లు వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువ.
డీ విజమిన్ లోపం క్యాన్సర్‌కు కారణం అవుతుందని తేలింది. డీ విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ను తగ్గించవచ్చా అన్న అంశంలో మాత్రం ఇంకా ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంది. డీ విటమిన్ ట్యాబ్లెట్లను వాడడం వల్ల గుండె జబ్బులు తగ్గాయన్న అంశం ఇప్పటికే రుజువైంది. డీ విటమిన్ల వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో బ్యాక్టరీ ఇన్‌ఫెక్షన్లను కూడా సమర్థంగా ఎదుర్కొనవచ్చు.
శిశుప్రాయంలో డీ విటమిన్ సప్లిమెంట్లను తరచుగా ఇవ్వడం వల్ల 90 శాతం మంది పిల్లల్లో డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గిందని ఫిన్‌లాండ్‌లో 30 ఏళ్లపాటు నిర్వహించిన సర్వేలో తేలింది. డీ విటమిన్ కండరాల నొప్పులు రాకుండా నిరోధిస్తుంది. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో రోజుకు ఒక మనిషి 15 గ్రాముల డీ విటమిన్ తీసుకోవాలి. నేడు డీ విటమిన్ లోపమన్నది ప్రపంచ సమస్య. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది ప్రజలు డీ విటమిన్ లోపం వల్ల బాధ పడుతున్నారు.
సూర్య కిరణాలు ఎక్కువలేని ప్రాంతాలే కాదు, సంవత్సరం పొడవున సూర్య కిరణాలు ప్రసరించే దేశాల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. నల్ల వాళ్లుండే ఆఫ్రికా దేశాల్లో మరి ఎక్కువగా ఉంది. మాంసం, గుడ్లు, చేపల్లో లభించే డీ విటమిన్, శాకాహారమైన ఒక్క పాలల్లో మాత్రమే లభిస్తుంది. అందుకని ఎక్కువ మంది డీ విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం ఎండల్లో డీ విటమిన్ ఉచితంగా లభిస్తుందిగానీ కొన్ని దేశాల సంప్రదాయ దుస్తులు సూర్య కిరణాలు చర్మాణికి సోకకుండా అడ్డు పడతాయి.