మరణిస్తే వాసన ఎందుకు?
మనిషి బతికున్నపుడు అనేక సెంట్లు, ఫెర్ఫ్యూములు వాడతాడు. కానీ, చనిపోగానే దుర్గంధం రావడం మొదలవుతుంది. దీనికి కారణం ఏంటంటే? శరీరంలో ఉండే బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలు సూక్ష్మ జీవులు. ఇవి పరపోషితాలు. ఇతర జీవులపై ఆధారపడి జీవనం సాగిస్తాయి. మనిషి బతికి ఉన్నంత కాలం మనిషిలో చేరి మన శరీరంలోని ఆహార పదార్థాలని తింటూ జీవిస్తాయి. బ్యాక్టీరియాలు మనిషిలోని ఆహార పదార్థాలను వాటికనుకూలంగా మార్పు చేసుకుని తింటాయి.
ఈక్రమంలో కొన్ని రకాల రసాయనాలు కూడా విడుదలవుతాయి. మనిషి బతికి ఉన్నపుడు ఎలాంటి రసాయనాలు విడుదలైనా మనలో ఉండే రక్షణ వ్యవస్థ వాటిని ఎప్పటికప్పుడు నిర్మూలిస్తుంది. కానీ, మరణించాక రక్షణ వ్యవస్థ పనిచేయదు. దీనివల్ల బ్యాక్టీరియాలు శరీరంలో వివిధ రకాల రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. దీంతో దుర్గంధం బయటికి వస్తుంది. అందుకే మనిషి లేదా జంతువులు మరణించినపుడు దుర్వాసన వస్తుంటుంది.