జగన్ హెచ్చరికలతో కదిలిన ప్రభుత్వం | agan Alerts With Have shaken Government | Sakshi
Sakshi News home page

జగన్ హెచ్చరికలతో కదిలిన ప్రభుత్వం

Published Thu, Jul 30 2015 3:24 AM | Last Updated on Mon, Feb 17 2020 5:16 PM

జగన్ హెచ్చరికలతో కదిలిన ప్రభుత్వం - Sakshi

జగన్ హెచ్చరికలతో కదిలిన ప్రభుత్వం

33 రైతు కుటుంబాలకు పంపిణీచేసిన పరిహారం రీయింబర్స్
* తొమ్మిది నెలలుగా కలెక్టర్ ప్రతిపాదనలను పట్టించుకోని ప్రభుత్వం
* ప్రతిపక్ష నేత హెచ్చరికతో దిగొచ్చిన బాబు సర్కార్
* మిగతా రైతు కుటుంబాలకు పరిహారం అందించేందుకు మార్గం సుగమం
* ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షలు మాత్రమే పరిహారం మంజూరు
* రూ.5 లక్షలు పరిహారం ఇస్తామంటూ జారీ చేసిన జీవో-62ను బేఖాతరు
* రైతు కుటుంబాలను మళ్లీ మోసం చేస్తున్న చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తక్షణమే పరిహారం విడుదల చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని, తమ ప్రభుత్వం రాగానే రూ.ఐదు లక్షలు చెల్లిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత, విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది.

తొమ్మిది నెలలుగా తొక్కిపట్టిన ఫైలుకు మోక్షం కలిగిస్తూ... ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వంతున 33 రైతు కుటుంబాలకు చెల్లించిన రూ.49.50 లక్షల పరిహారాన్ని రీయింబర్స్‌మెంట్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించి రూ.1.50 లక్షలే పరిహారం మంజూరు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
బాబు సర్కారు మళ్లీ మోసం..
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2004లో అధికారంలోకి వస్తూనే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి మానవీయ కోణంలో పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. బకాయిలు తీర్చడానికి రూ.50 వేలు, రైతు కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం రూ.లక్షను కేటాయిస్తూ 2004 జూన్ ఒకటిన ఉత్తర్వులు (జీవో 421)ను జారీ చేశారు. శవపరీక్ష నివేదికలతో నిమిత్తం లేకుండా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారాన్ని అందించి ఆదుకున్నారు.

పదేళ్ల క్రితంతో పోల్చితే ప్రస్తుతం రైతుల పరిస్థితి మరింత దిగజారింది. వరుస కరువుల వల్ల ఆర్థికంగా కుంగి కుదేలైపోయారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం అందించాల్సిన అవసరముందని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. అప్పులు తీర్చడానికి రూ.1.50 లక్షల.. రైతు కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రూ.3.5 లక్షలు మొత్తం రూ.ఐదు లక్షల వంతున పరిహారం అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల వంతున పరిహారాన్ని మంజూరు చేస్తూ ఫిబ్రవరి 19న ఉత్తర్వులు (జీవో 62) జారీ చేశారు.

రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో వందలాది మంది రైతులు బలవన్మరణం చెందారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 83 మంది కర్షకులు ఆత్మార్పణం చేసుకున్నారు. కానీ వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయశాఖ ఏడీ సభ్యులుగా ఉన్న కమిటీ అర్హులుగా తేల్చిన రైతు కుటుంబాలకు పరిహారం అందించడానికి కూడా నానా సాకులు చెప్తూ ఆలస్యం చేసింది. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 33 రైతు కుటుంబాలకు చెల్లించిన పరిహారం రీయింబర్స్‌మెంట్ చేస్తే మిగతా వారికి అందిస్తామని కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను తొమ్మిది నెలలుగా తొక్కిపట్టింది.

జిల్లాలో మూడో విడత రైతు భరోసా యాత్ర చేస్తోన్న విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి బాధిత కుటుంబాలు ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. తక్షణమే పరిహారం మంజూరు చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున 33 రైతు కుటుంబాలకు రూ.49.50 లక్షలను పరిహారంగా మంజూరు చేస్తున్నట్లు బుధవారం జీవో-690 జారీ చేసింది. అయితే రూ.5 లక్షలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన జీవోనే బేఖాతరు చేస్తూ రూ.1.50 లక్షలు మాత్రమే మంజూరు చేయడంపై అధికారవర్గాలే మండిపడుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement