- వంద రోజులుగా సమ్మెలో ఆశ వర్కర్లు
- అయినా వారి సమస్యలను పట్టించుకోని సర్కారు
- 25 వేల మంది సమ్మెతో స్తంభించిన గ్రామీణ వైద్యం
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో వివిధ వైద్య సేవల పథకాల అమల్లో కీలకపాత్ర పోషిస్తున్న 25 వేల మంది ఆశ వర్కర్లపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. కనీస వేతనం పెంపు సహా పలు సమస్యలు పరిష్కరించాలంటూ వంద రోజులుగా వారు సమ్మె చేస్తున్నా ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోంది. పల్లెల్లో వైద్య సేవలపై ఈ సమ్మె తీవ్ర ప్రభావం చూపుతోందని... డెంగీ, మలేరియా, విషజ్వరాలతో పల్లెలు విలవిల్లాడుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నా సర్కారు మాత్రం దీన్ని పరిష్కరించే ఆలోచన చేయడం లేదు.
వెట్టిచాకిరీ...
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) మార్గదర్శకాల ప్రకారం పదే ళ్ల కిందట నియమితులైన ఆశ వర్కర్లు కుటుంబ నియంత్రణ, ఆసుపత్రుల్లో కాన్పులు, టీకాలు వంటి వైద్య సేవలతోపాటు కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు. అలాగే 104, 108, ఆరోగ్యశ్రీ పథకాలకు సహకరిస్తున్నారు. హెచ్‌ఐవీ రోగులకు అవసరమైన సేవలు చేస్తున్నారు. కుష్టు, టీబీ రోగులకు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ప్రజలకు వచ్చే వ్యాధులను గుర్తిస్తున్నారు.
అవసరమైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు తీసుకెళ్తున్నారు. అక్కడ వైద్యం లభించకుంటే పై ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఈ పనులన్నింటికీ నామమాత్రపు పారితోషికాలను ప్రభుత్వం ఇస్తోంది. పనిని బట్టి నెలకు ఒక్కో ఆశ వర్కర్‌కు రూ. 400 నుంచి రూ. 2 వేల వరకు మాత్రమే చెల్లిస్తోంది. రోజంతా పల్లెల్లో సేవలందిస్తున్నా వారికి సరైన పారితోషికం ప్రభుత్వం వారిని వెట్టిచాకిరీ చేస్తోంది.
రూ.3 కోట్లు కేటాయించలేరా?
రాష్ట్రంలో పనిచేసే ఆశ వర్కర్ల పారితోషికం, ఇతరత్రా ఖర్చుల కోసం ఎన్‌హెచ్‌ఎం రూ. 30 కోట్లు కేటాయిస్తోంది. అందులో 25 శాతం రాష్ట్రం వాటా... మిగిలిన 75 శాతం కేంద్రం తన వాటాగా భరిస్తోంది. వేతనాల పెంపును తాము నిర్ణయించలేమని... ఈ విషయంపై కేంద్రానికి విన్నవించామని ప్రభుత్వం చెబుతోంది. వేతనాలు పెంచకపోయినా కనీసం పారితోషికం పెంపుపైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి ఇటీవల విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది.
పారితోషికం పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లు కేటాయిస్తే చాలని వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నెల క్రితమే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. కానీ సంబంధిత ఫైలు మాత్రం ముందుకు కదలడంలేదు. కేవలం రూ. 3 కోట్లు చెల్లించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవకాశం ఉంటే ఆశ కార్యకర్తలను ఎలా వదిలించుకోవాలా అన్న ధోరణిలోనే సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.
కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలి...
కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, హర్యానా రాష్ట్రాలు పారితోషకాలతోపాటు నిర్ణీత వేతనాలు ఇస్తున్నాయని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి పేర్కొన్నారు. తమ డిమాండ్లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఇతర అధికారులతో అనేకసార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే పాదయాత్రలు ప్రారంభించామన్నారు.
‘ఆశ’ల సమస్యలు తీరేదెప్పుడు?
Published Sat, Dec 12 2015 4:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM
Advertisement