సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు
► సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో
► టాపర్ నోయిడా విద్యార్థి రక్షాగోపాల్
► 99.6 శాతం మార్కులు సాధించిన బాలిక
► హైదరాబాద్‌లో 98.7 శాతం ఉత్తీర్ణత
► టాపర్లను అభినందించిన కేంద్ర మంత్రి జవదేకర్
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్షా ఫలితాలను ఆదివారం వెల్లడించారు. సుమారు 11 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. నోయిడాకు చెందిన రక్షా గోపాల్ 99.6 శాతం మార్కులతో టాప్ ర్యాంక్ దక్కించుకుంది. రెండు మార్కుల తేడాతో ఆమె 100 శాతం మార్కులకు దూరమైంది. చండీగఢ్‌కు చెందిన భూమి సావంత్ (99.4) రెండు.. మన్నత్ లూథ్రా, ఆదిత్య జైన్(99.2) సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. పది రీజయన్ల ఫలితాలను కూడా సీబీఎస్‌ఈ ఒకేసారి విడుదల చేసింది. టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభినందించారు.
82 శాతం పాస్..
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ కాస్త తగ్గింది. గత ఏడాది 83.05 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 82 శాతం మంది మాత్రమే పాస్ అయినట్లు సీబీఎస్‌ఈ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 12వ తరగతి ఫలితాల తర్వాత విద్యార్థులు ఎటువైపు వెళ్లాలనే విషయంపై సలహాలు, సూచనలు అందజేసేందుకు 18000118004 టోల్ ఫ్రీ నంబర్‌ను సైకలాజికల్ కౌన్సెలింగ్ కోసం బోర్డు ఏర్పాటు చేసింది. 65 మంది కౌన్సెలర్లు ఈ హెల్ప్ లైన్ నంబర్ ద్వారా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడతారని అధికారులు తెలిపారు.