
మూగ యువకుడికి కరెంట్ షాక్‌లు
ఒళ్లంతా గాయాలు.. దుండగుల దుశ్చర్య
మెదక్ రూరల్: పుట్టకతోనే మాటలు రాని ఓ యువకుడిపై దుండగులు కరెంట్ షాక్‌లతో చిత్రహింసలకు గురిచేశారు. వివరాలు.. మెదక్ మండలంలో రాయినిపల్లి పంచాయతీ పరిధిలోని మల్కాపూర్ గిరిజన తండాకు చెందిన మేఘావత్ సౌమ్య, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు మేఘావత్ బాబు పుట్టుకతో మూగవాడు. ఈనెల 12న బాబు తన తండ్రి సౌమ్యతో కలసి రాత్రి బోరుబావి వద్దకు కాపలాగా వెళ్లాడు. బోరు నడిపించి అర్ధరాత్రి వేళ బాబు తిరిగి ఇంటికి వెళ్లాడని తండ్రి సౌమ్య పేర్కొన్నారు.
దీంతో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇంటి సమీపం నుంచి బాబును మోటార్‌సైకిల్‌పై, ఓ పొలం వద్దకు తీసుకెళ్లి కరెంట్ షాక్‌లు పెట్టినట్లు, దీంతో బాబు స్పృహ కోల్పోయి చనిపోయినట్లు భావించి అతణ్ని మల్కాపూర్ తండా సమీపంలోని ఓ ట్రాన్స్‌ఫార్మర్ ప్రాంతంలో పడేసి వెళ్లినట్లు వారు చెప్పారు. మర్నాడు తెల్లవారుజామున బాబు రక్తం బట్టలతో ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు వారు తెలిపారు. తమకు అవగాహన లేక ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, అయితే, న్యాయం చేస్తారని గ్రామ పెద్దలకు చెప్పినా పట్టించుకోవడంలేద న్నారు.