ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతు ఆత్మహత్యలు
-త్వరలో జేఏసీ కార్యాచరణ
-ఎన్ కౌంటర్ ను వ్యతిరేకిస్తున్నాం
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై టీజేఎసీ చైర్మన్ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరంలోని నాంపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన జేఏసీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష వైఖరి వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్య సంఖ్య విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైంది కాదన్నారు. మరో వైపు సీఎం కేసీఆర్ కు, తమకు మధ్య గ్యాప్ ఉందని అనుకోవడం లేదన్నారు. రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ను వ్యతిరేకిస్తున్నట్టు ఆయన తెలిపారు. మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపినట్టు అనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 30 న రిటైర్ అవుతున్నట్టు కోదండరాం వెల్లడించారు. రిటైర్డ్ అనంతరం కూడా పూర్తిస్థాయిలో జేఏసీకి సమయం కేటాయిస్తానన్నారు. 2,3 రోజుల్లో జేఏసీ కార్యాచరణ ప్రకటిస్తుందని తెలిపారు.