-బబ్లింగ్ సరిగా చేయలేదన్న సాకుతో ఆన్సర్‌షీట్‌ను దిద్దరా?
-ఇది ఎంత మాత్రం సరికాదు
-అలాంటి వారందరి పత్రాలను మూల్యాంకనం చేయండి
-కోర్టును ఆశ్రయించలేనివారి ఆన్సర్‌షీట్లను కూడా మూల్యాంకనం చేయండి
-ఆ తరువాత ఫలితాలను వెల్లడించండి
-ఎస్‌ఎస్‌సీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ : సమాధానపత్రాల మూల్యాంకనం విషయంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుబట్టింది. పోటీ పరీక్షల్లో టెస్ట్ ఫాం నెంబర్ (టీఎఫ్‌ఎన్) తదితరాలను బబ్లింగ్ (పెన్సిల్‌తో గళ్లను పూరించడం) చేయకపోవడం వంటి అప్రధాన తప్పిదాలను సాకుగా చూపుతూ ఏకంగా సమాధానపత్రం మొత్తాన్ని మూల్యాంకనం చేయకుండా పక్కనపెట్టడం సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. టెస్ట్ ఫాం నెంబర్‌లో రెండు నెంబర్లను బబ్లింగ్ చేయకుండా మర్చిపోయినందుకు మూల్యాంకనం చేయకుండా పక్కనపెట్టిన ఓ అభ్యర్థి సమాధానపత్రాన్ని వెంటనే మూల్యాంకనం చేసి ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించాలని ఎస్‌ఎస్‌సీని ఆదేశించింది.
హాల్ టిక్కెట్ నెంబర్, రోల్ నెంబర్ నమోదు చేసి బబ్లింగ్ చేయడం మర్చిపోయారన్న కారణంతో మూల్యాంకనం చేయకుండా ఎవరి సమాధానపత్రాలనైతే పక్కన పెట్టారో ఆ అభ్యర్థులందరి సమాధానపత్రాలను మూల్యాంకనం చేయాల్సిందేనని ఎస్‌ఎస్‌సీకి తేల్చింది. పోటీ పరీక్షల్లో చూడాల్సిన అభ్యర్థి ప్రతిభ తప్ప, ఇటువంటి అప్రధాన తప్పిదాలను కాదని ఎస్‌ఎస్‌సీకి హైకోర్టు హితవు పలికింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ నూతి రామ్మోహనరావు, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఇలాంటి అప్రధానమైన తప్పిదాలతో ఎవరి సమాధానపత్రాలైతే మూల్యాంకనానికి నోచుకోలేదో, వారు న్యాయస్థానాలను ఆశ్రయించి ఉత్తర్వులు పొందకపోయినప్పటికీ, వారి సమాధానపత్రాలు మూల్యాంకనం చేయాల్సిందేనని ఎస్‌ఎస్‌సీని ధర్మాసనం ఆదేశించింది.
ఇదీ వివాదం..
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌కు ఎస్‌ఎస్‌సీ 2014లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి విజయవాడకు చెందిన గూడూరు రాజ సూర్య ప్రవీణ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. రెండు దశలలో జరిగిన ఈ పరీక్షలో మొదటి పరీక్ష రాజస్థాన్ అజ్మీర్‌లో జరిగింది. ఇందులో 138 మార్కులతో 609 ర్యాంకు సాధించారు. రెండో దశ పరీక్ష ఢిల్లీలో జరిగింది. రెండో దశ పరీక్షలో రెండు పేపర్లుంటే, ప్రవీణ్ మొదటి పేపర్‌లో 155 మార్కులు సాధించారు. అయితే అధికారులు రెండో పేపర్‌ను మూల్యాంకనం చేయలేదు. రెండో పేపర్‌లో టెస్ట్ ఫాం నెంబర్‌ను సరిగా బబ్లింగ్ చేయకపోవడం వల్ల మూల్యాంకనం చేయలేదని అధికారులు చెప్పారు. దీనిపై అతను కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. వాదనలు విన్న క్యాట్ ప్రవీణ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు నేతత్వంలోని ధర్మాసనం విచారించింది. పూర్తిస్థాయిలో వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. టెస్ట్ ఫాం నెంబర్‌ను బబ్లింగ్ చేయకపోవడం సమాధానపత్రం మూల్యాంకనానికి ఏ విధంగానూ అడ్డుకాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కంప్యూటర్ ద్వారా నిర్దేశిత ప్రోగ్రాం ద్వారా సమాధానాలను మూల్యాంకనం చేస్తారే తప్ప, టెస్ట్ ఫాం నెంబర్‌ను కాదన్నారు. పరీక్ష రాస్తున్న సమయంలో ఆతృత, ఆందోళన వల్ల కొన్ని సందర్భాల్లో అప్రధాన తప్పులు దొర్లుతుంటాయని, అలాగే ఈ కేసులో కూడా ప్రవీణ్ టెస్ట్ ఫాం నెంబర్‌లో రెండు గడులను బబ్లింగ్ చేయలేదని ధర్మాసనం తెలిపింది. ఈ కారణంతో మొత్తం సమాధాన పత్రాన్నే మూల్యాంకనం చేయకుండా పక్కన పడేయటం సరికాదంది.
స్థోమత లేనంత మాత్రాన న్యాయం అందకుండా పోదు...
'ఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహణ లక్ష్యం పరీక్ష రాసిన వారిలో ప్రతిభావంతులను ఎంపిక చేయడమే. ఇందులో భాగంగా ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో కంప్యూటర్ ద్వారా మూల్యాంకం చేయిస్తున్నారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చే విషయంలో అభ్యర్థి ఆ సమాధానం గడిని పూరించకుండా వదిలేసినంత మాత్రాన మొత్తం సమాధాన పత్రాన్ని పక్కన పెట్టలేరు కదా. ఈ కేసులోనూ అంతే. ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హులందరికీ సమానావకాశం పొందే హక్కును రాజ్యాంగం కల్పించింది. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరూ ఆ హక్కును కాలరాయలేరు. అందులోనూ పిటిషనర్ వంటి ప్రతిభావంతుడిని ఇలా అడ్డుకోవడం ఎంత మాత్రం సరికాదు. ఈ విషయంలో ఎస్‌ఎస్‌సీ నిర్ణయం ఎంత మాత్రం సహేతుకమైంది కాదు.
పిటిషనర్‌లాగే సమాధాన పత్రాలు మూల్యాంకనం విషయంలో సమస్యలు ఎదుర్కొంటూ కోర్టుకు రాలేని అభ్యర్థులు ఎంతో మంది ఉంటారు. న్యాయవాదులను పెట్టుకునే స్థోమత వారికి ఉండకపోచ్చు. అయితే న్యాయం పొందడానికి ఇది ఎంత మాత్రం అడ్డుకాదు. ఖర్చుతో నిమిత్తం లేకుండా న్యాయం అందరికీ అందాలన్నది న్యాయవ్యవస్థ మౌలిక సూత్రాల్లో ఒకటి. ప్రస్తుత యువతలో చాలా మందికి కోర్టుకు వచ్చే పోరాడేంత ఆర్థిక వనరులు అందుబాటులో ఉండకపోవచ్చు. కోర్టుకు వస్తేనే పిటిషనర్‌లా న్యాయం దక్కుతుందని అనుకోనక్కరలేదు. కోర్టుకు రాని అభ్యర్థుల విషయంలో పిటిషనర్‌కు ఇచ్చిన ఆదేశాలను ఎస్‌ఎస్‌సీ వర్తింప చేయాలి. అప్రధాన తప్పిదాలతో వారి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయకుండా పక్కన పెట్టి ఉంటే వెంటనే వాటిని మూల్యాంకనం చేసి ఫలితాలను వెల్లడించాలి' అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీరును తప్పుబట్టిన హైకోర్టు
Published Sat, Dec 26 2015 5:43 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement