పదిరోజులు సెలవుల అనంతరం బుధవారం నుంచి నాగార్జున యూనివర్సిటీ కళాశాలల తరగతులు, వసతి గృహాలు ప్రారంభం కానున్నాయి.
గుంటూరు: పదిరోజులు సెలవుల అనంతరం బుధవారం నుంచి నాగార్జున యూనివర్సిటీ కళాశాలల తరగతులు, వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. రిషితేశ్వరి మృతికి కారకులైన వారిని శిక్షించాలని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన నేపథ్యంలో యూనివర్సిటీకి పదిరోజుల సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
సెలవుల్లో విచారణ చేయటాన్ని పలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో రుషితేశ్వరి ఘటనపై బాల సుబ్రహ్మణ్యం కమిటీ వర్సిటీలో మరోసారి విచారణ చేపట్టనుంది. కాగా బయట వ్యక్తులు వర్సిటీలోకి రాకుండా ప్రధాన ద్వారం వద్ద ఆంక్షలు విధించారు. గుర్తింపు కార్డు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. విద్యార్థులు కూడ ఆందోళన ఉధృతం చేసే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా రుషితేశ్వరి మృతికి కారణమైన వారందరిపై కేసు నమోదు చేసి, శిక్షించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.