జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన బకాయిల మొత్తం ఎంత..?
సాక్షి, హైదరాబాద్ : ‘గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) వసూలు చేసే ఆస్తిపన్నులో మీకు రావాల్సిన వాటా ఎంత..? మీరు చేపట్టే అభివృద్ధి, విస్తరణ కార్యక్రమాలకు జీహెచ్‌ఎంసీ నుంచి వచ్చే వాటానే ఆధారామా..? అది రాకపోవడం వల్ల ఎక్కడెక్కడ.. ఎంత విలువ చేసే పనులు నిలిచిపోయాయో చెప్పండి.’ అని హైకోర్టు సోమవారం జలమండలిని ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని జలమండలి మేనేజింగ్ డెరైక్టర్‌కు స్పష్టం చేసింది.
తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ వసూలు చేస్తున్న ఆస్తి పన్ను నుంచి జలమండలికి 30 శాతం వాటా రావాల్సి ఉందని, 2009 నుంచి జీహెచ్‌ఎంసీ ఈ వాటాను చెల్లించడం లేదని, వీటినే జలమండలి బకాయిలను చెల్లించేలా జీహెచ్‌ఎంసీని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన జె.ఆర్.కరుణాకర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.