ప్రణాళికతో ప్రాజెక్టులు పూర్తి
వ్యవసాయంపై చర్చాగోష్టిలో సీఎం చంద్రబాబు
సాక్షి, రాజమండ్రి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రణాళికాయుతంగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎత్తిపోతల పథకాలన్నింటికీ మరమ్మతులు చేయిస్తున్నామని అన్నారు. ‘వ్యవసాయం-అనుబంధ రంగాలు’ అనే అంశంపై శనివారం రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 18.2 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఇప్పటివరకూ 2.70 లక్షల భూసార కార్డులను పంపిణీ చేశామన్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో చెరకుపై వ్యాట్ లేదని, రాష్ట్రంలో కూడా దీన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆనం కళాకేంద్రం ఆవరణలో పశుసంవర్థక, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, డ్రిప్ ఇరిగేషన్ అంశాలపై స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటిని సీఎం చంద్రబాబు, మంత్రి పుల్లారావు సందర్శించారు. అలాగే విజయ డెయిరీ ఏర్పాటు చేసిన స్టాల్‌లో విజయామృతం, పూతరేకులు, సుగంధి పాలు, పాలకోవా ఉత్పత్తులను సీఎం ఆవిష్కరించారు.
భక్తులు క్రమశిక్షణ పాటించాలి: సీఎం
రాజమండ్రి క్రైం: పుష్కర రద్దీ నియంత్రణకు విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాజమండ్రి పోలీస్ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమండ్రిలోని ఘాట్లలో రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా.. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల శివారు ప్రాంతాల్లో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, వాటిల్లో యాత్రికులు రెండు మూడు గంటలు ఉండగలిగే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
రిసెప్షన్ సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పుష్కర భక్తులు క్రమశిక్షణతో మెలగాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. క్యూ పాటించి తొక్కిసలాట లేకుండా ప్రతి ఒక్కరూ స్నానం చేసి వెళ్లేలా సహకరించాలని కోరారు. పుష్కర విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి ఈ నెల 26న ఉత్తమ పురస్కారాలు అందించి సన్మానిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.
22న మంత్రివర్గ సమావేశం: సీఎం
సాక్షి, రాజమండ్రి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 22న నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాజమండ్రిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం గోదావరిలో డ్రెడ్జింగ్ చేపడతామన్నారు. శనివారం రాత్రి రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథిగృహంలో సీఎం మీడియాతో మాట్లాడారు.
జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభిస్తున్న దృష్ట్యా పుష్కరాలు ముగిసేంతవరకు టోల్‌గేట్ల వద్ద టోల్ వసూలు నిలిపేయాలని ఆదేశించినట్లు చెప్పారు. గోదావరిలో పుష్కరస్నానం చేయడానికి గవర్నర్ నరసింహన్ ఈ నెల 20న రాజమండ్రి రానున్నట్లు తెలిపారు.