క్రమబద్ధీకరణ సరికాదు
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ మానుకోవాలని హైకోర్టు సూచన
సాక్షి, హైదరాబాద్: నిర్దేశిత విధానం ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ సరికాదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఇక ఇప్పటి నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీ సులను క్రమబద్ధీకరించడం మానుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు గడువు కావాలని అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి కోరడంతో, అందుకు అంగీకరిస్తూ విచా రణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనా థన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మా సనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఫిబ్ర వరిలో జారీ చేసిన జీవో 16ను సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లాకు చెందిన జె.శంకర్, నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్.గోవిందరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇలా క్రమబద్ధీ కరించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధ మని పిటిషనర్ల తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు.