హైదరాబాద్ను సర్వనాశనం చేస్తున్నారు: హైకోర్టు
హైదరాబాద్ : అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ విషయంలో తెలంగాణ సర్కార్ వైఖరిని ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ పథకాలను తీసుకురావడం ద్వారా నగరాన్ని నాశనం చేస్తున్నారంటూ హైకోర్టు మండిపడింది. అసలు అక్రమంగా నిర్మించిన వాటిని ఎలా క్రమబద్దీకరిస్తారని నిలదీసింది. క్రమబద్దీకరణకు అనుసరిస్తున్న విధి విధానాలు ఏమిటని ప్రశ్నించింది. ఈ పథకం ముసుగులో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా బిల్డర్లు, యజమానులు చేసే నిర్మాణాలను తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హైకోర్టు తేల్చి చెప్పింది.
అసలు ఏ నిర్మాణాలను క్రమబద్దీకరించాలనుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ చట్టానికి కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా సవరణలు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, అన్ని రకాల అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వాలు ఎప్పటికిప్పుడు అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ పథకాలను పొడిగిస్తూ వస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెట్ బ్యాక్‌లు లేని, ఎత్తు విషయంలో నిబంధనలు పాటించని నిర్మాణాలను, అగ్నిమాపక నిబంధనకు విరుద్ధంగా నిర్మించిన వాటిని ఇలా ప్రతీ అక్రమ నిర్మాణాన్ని క్రమబద్దీకరిస్తున్నారని తెలిపారు.
ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ, పిటిషనర్ ఆర్డినెన్స్‌ను సవాలు చేశారని, అయితే ఆ ఆర్డినెన్స్ ఇప్పుడు లేదని, అది ఇప్పుడు చట్ట రూపం దాల్చబోతోందన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదించిందని కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇటువంటి పథకాల ద్వారా నగరాన్ని నాశనం చేస్తున్నారంటూ మండిపడింది. అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణకు ఎటువంటి విధి విధానాలను అనుసరిస్తున్నారని, ఎటువంటి నిర్మాణాలను క్రమబద్దీకరించాలని నిర్ణయించారో చెప్పాలంది. దీనికి ఏజీ స్పందిస్తూ, బీపీఎస్ పథకంలోని నిబంధనలను చదివి వినిపించారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, అనుమతించిన ప్లాన్ లేకుండానే నిర్మాణాలు చేపడితే వాటిని క్రమబద్దీకరించడానికి వీల్లేదని ఈ నిబంధనల్లో ఉన్నట్లు గుర్తించింది.
దీనికి శివరాజు స్పందిస్తూ, లే అవుట్‌కు అనుమతి ఉండాలని, అనుమతి లేని లేఔట్‌లలో చేసిన నిర్మాణాలను సైతం ప్రభుత్వం క్రమబద్దీకరిస్తోందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యాలు తేలేంత వరకు ఏ ఒక్క అక్రమ నిర్మాణాన్ని క్రమబద్దీకరించడానికి వీల్లేదని, అందుకు తాము ఏ విధంగానూ అనుమతించబోమని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు తెచ్చారని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో దానిని సవాలు చేయాలని, అందుకు సంబంధించి సవరణలతో అనుబంధ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. మరోవైపు అసలు ఎటువంటి నిర్మాణాలను క్రమబద్దీకరించాలని నిర్ణయించారు.. అందుకు అనుసరించనున్న విధి విధానాలను తమ ముందుంచాలని ఏజీకి స్పష్టం చేసిన ధర్మాసనం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.