కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తేలేనా?
జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌లలో వేలల్లో ఖాళీ పోస్టులు
- కాంట్రాక్టు క్రమబద్ధీకరణ కుదరదన్న హైకోర్టు
- సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం చేకూరేనా?
- కాంట్రాక్టు పోస్టుల్లో 5,027 మంది లెక్చరర్లు
- అయినా మరో 2350 పోస్టులు ఖాళీయే
- కాంట్రాక్టు అంశం తేలకున్నా భర్తీకి వీలుగా 2,650 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను హైకోర్టు కొట్టివేయడమే కాకుండా కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ కుదరదని స్పష్టం చేయడంతో ప్రభుత్వం గందరగోళంలో పడింది. డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తే కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తామని, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెబుతోంది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం చేకూరదేమోనన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లోనూ ఉంది. సుప్రీంకోర్టు ధర్మాసనం రెండు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులు, వివరణలతో కూడిన మార్గదర్శకాల ప్రకారమే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కుదరదని హైకోర్టు స్పష్టం చేయడమే అందుకు కారణం.
రెగ్యులరైజేషన్ ఎలా చేయాలనుకున్నారంటే..
రాష్ట్ర విభజన, ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసేందుకు ప్రొహిబిషన్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఇర్రెగ్యులర్ అపాయింట్‌మెంట్స్ (యాక్టు 2/1994) చట్టాన్ని సవరించింది. ఇందుకు అనుగుణంగా 2016 ఫిబ్రవరి 26న జీవో 16 తెచ్చింది. 2014 జూన్ 2 నాటికి ముందు నుంచీ పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేసేలా చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా కాలేజీలవారీగా పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు నిరుద్యోగులు హైకోర్టులో పిల్ దాఖలు చేయగా కాంట్రాక్టు క్రమబద్ధీకరణ విషయంలో స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్రమబద్ధీకరణ కుదరదంటూ జీవోను హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లినా రెగ్యులరైజేషన్ అనేది సాగదీతే తప్ప సాధ్యం కాదని అధికారులే పేర్కొంటున్నారు.
మిగిలిన పోస్టులను భర్తీ చేయొచ్చు
కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ వ్యవహారం ఇప్పట్లో తేలకపోయినా ప్రభుత్వం తలచు కుంటే ఇప్పటికిప్పుడు 2,650 పోస్టులను భర్తీ చేసే వీలుంది. కాంట్రాక్టు లెక్చరర్లుగా పని చేస్తున్న జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లోని 5,027 పోస్టులు కాకుండా మిగిలిన ఆ ఖాళీలను భర్తీ చేయవచ్చని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అ«ధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ కాలేజీలవారీగా పరిస్థితి...
- జూనియర్ లెక్చరర్ పోస్టులు మొత్తం 5,905 ఉండగా అందులో 900 పోస్టుల్లో రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. మిగిలిన 5,005 ఖాళీల్లో 3,638 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తుండగా మరో 1,367 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- డిగ్రీ కాలేజీల్లో మొత్తం 2700 పోస్టులు ఉన్నాయి. అందులో 1,600 మంది రెగ్యులర్ అధ్యాపకులు పని చేస్తున్నారు. మరో 924 పోస్టుల్లో కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. 176 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే కాంట్రాక్టు అధ్యాపకుల్లో 117 మందికే నిర్ణీత అర్హతలు ఉండగా మిగిలిన 807 పోస్టులతోపాటు ఖాళీగా ఉన్న 176 పోస్టులను కలుపుకొని 983 పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయవచ్చు.
- పాలిటెక్నిక్ కాలేజీల్లో 465 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉంటే మంజూరైన ఖాళీలు 165 మాత్రమే ఉన్నాయి. అయితే కాలేజీల్లో అవసరాల మేరకు పోస్టులు లేకపోయినా కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు చేపట్టి కొనసాగిస్తున్నారు. మిగతా 300 పోస్టులను సృష్టించి భర్తీ చేయాల్సి ఉంది.