సాక్షి, హైదరాబాద్: ‘ఆప్కోలో గోల్‌మాల్ రూ.600 కోట్లు..?’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. సంస్థ లావాదేవీలకు సంబంధించిన అన్ని వివరాలను తనకు సమర్పించాల్సిందిగా పరిశ్రమల శాఖ కార్యదర్శి, ఆప్కో జేఎండీ, చేనేత విభాగం డెరైక్టర్‌లను ఆదేశించారు. ప్రస్తుతం అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి జూపల్లి... ఆప్కో లావాదేవీలపై సమీక్షించేందుకు ఈ నెల 5వ తేదీన సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
పూర్తి వివరాలతో ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఆప్కో అధికారులకు సూచించారు. అపాయింటెడ్ డే నుంచి జరిగిన ఆప్కో లావాదేవీలపై గతేడాది ఏప్రిల్‌లోనే జూపల్లి సమీక్షించి.. అక్రమాలపై అంతర్గత విచారణకు ఆదేశించారు. అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర ఆ విచారణ బాధ్యతను చేనేత, జౌళి శాఖ డెరైక్టర్ ప్రీతి మీనాకు అప్పగించారు. ప్రీతి మీనా సెలవుపై వెళ్లడంతో అధికారులు దర్యాప్తును అటకెక్కించినట్లు సమాచారం.
ప్రణాళిక మేరకే సేకరణ: జేఎండీ సైదా
చేనేత, జౌళిశాఖ ఆమోదించిన ఉత్పత్తి ప్రణాళికకు అనుగుణంగా లివరీ వస్త్రాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆప్కో తెలంగాణ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ (జేఎండీ) వి.సైదా చెప్పారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంలోని అంశాలపై జేఎండీ గురువారం వివరణ ఇచ్చారు. చేనేత సహకార సంఘాల నుంచి లివరీ వస్త్రం సేకరణ, సరఫరాలో నిధుల దుర్వినియోగం జరగలేదన్నారు. సర్వశిక్షా అభియాన్‌తో పాటు, సంక్షేమ శాఖలకు నిర్దిష్ట కాల పరిమితిలో లివరీ వస్త్రం సరఫరా చేయాల్సి రావడంతో చేనేత సంఘాల నుంచి సేకరణ నిరంతరంగా జరుగుతోందని చెప్పారు. వివిధ శాఖలకు అవసరమైన రంగులు, డిజైన్లలో ప్రాసెస్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా నాణ్యత పరీక్షలు చేయించిన తర్వాతే సరఫరా చేస్తున్నామని... నాణ్యత, మన్నిక విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 195 సంఘాల నుంచి రూ.92 కోట్ల విలువ చేసే వస్త్రాన్ని కొనుగోలు చేశామన్నారు. సర్వశిక్షా అభియాన్‌తో పాటు ఇతర శాఖలకు వస్త్రాల సరఫరా ద్వారా ఆప్కోకు లాభం లేకపోయినా.. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సేకరిస్తున్నామని చెప్పారు.
నేడు చేనేత సంఘాల సమావేశం
ఆప్కోలో అక్రమాలను సాకుగా చూపి కొందరు అధికారులు సంస్థను మూసివేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆప్కో పాలక మండలి సభ్యుడు గడ్డం జగన్నాథం ఆరోపించారు. ఆప్కోలో లావాదేవీలపై విచారణ జరిపేందుకు చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఆప్కోలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఆప్కో కార్యాలయం వద్ద చేనేత సంఘాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆప్కోలో ‘గోల్‌మాల్’పై 5న సమీక్ష
Published Fri, Mar 4 2016 2:46 AM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM
Advertisement
Advertisement