
యాకూబ్‌ను కాదు.. టైగర్‌ను పట్టుకోండి: సల్మాన్
యాకూబ్ మెమన్ ఉరితీతపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా స్పందించారు. యాకూబ్ సోదరుడు టైగర్ మెమన్‌ను పట్టుకుని ఉరితీయాలి....
యాకూబ్ మెమన్ ఉరితీతపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా స్పందించారు. యాకూబ్ సోదరుడు టైగర్ మెమన్‌ను పట్టుకుని ఉరితీయాలి, కానీ యాకూబ్‌ను కాదంటూ ఆదివారం ట్వీట్ చేశారు. ‘ఆయన సోదరుడిని కాదు, టైగర్‌ను పట్టుకుని, ఉరితీయండి. ఈ విషయంపై ట్వీట్ చేయాలని రెండుమూడు రోజులుగా అనుకుంటున్నా. కానీ భయపడి ఊరుకున్నా. కానీ ఇది ఒక వ్యక్తికి, ఆయన కుటుంబానికి చెందిన విషయం. అందుకే స్పందిస్తున్నా. సోదరుడిని ఉరితీయద్దు. పారిపోయిన ఆ నక్క(టైగర్ మెమన్)ను పట్టుకుని ఉరితీయండి.
ఒక అమాయకుడిని చంపడం అంటే మానవత్వాన్ని చంపడమే’ అంటూ సల్మాన్ వరుసగా ట్వీట్స్ చేశారు. టైగర్ మెమన్‌ను భారత్‌కు అప్పగించాలని పాక్ ప్రధాని షరీఫ్‌ను కోరారు. అనంతరం తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో వాటిని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించి, బేషరతు క్షమాపణలు తెలిపారు. మెమన్ చేసిన నేరాన్ని సమర్థించడం తన ఉద్దేశం కాదన్నారు. తప్పుడు అభిప్రాయం వ్యక్తమయ్యేలా ఉన్నందున ఆ ట్వీట్స్‌ను ఉపసంహరించుకోవాలని తన తండ్రి సలీమ్ కోరారన్నారు.
అంతకుముందు సల్మాన్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సల్మాన్ ఇంటిముందు బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు. కారుతో ఢీకొట్టి ఒకరి మృతి కారణమైన కేసులో సల్మాన్‌కు బెయిల్‌ను రద్దు చేయాలని బీజేపీ, శివసేన డిమాండ్ చేశాయి. సల్మాన్ వ్యాఖ్యలు దేశ న్యాయవ్యవస్థను అవమానించేలా ఉన్నాయని ముంబై పేలుళ్ల ప్రత్యేక ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. అవి సల్మాన్ వ్యక్తిగత అభిప్రాయాలని యాకూబ్‌కు ఉరిశిక్ష విధించిన టాడా కోర్టు జడ్జి పీడీ కోడె అన్నారు. సల్మాన్ భావాల్ని అర్థంచేసుకునేందుకు ప్రయత్నించాలంటూ శతృఘ్నసిన్హా సల్మాన్‌కు అండగా నిలిచేం దుకు ప్రయత్నించారు. సల్మాన్‌కు ట్విటర్లో 1.3కోట్లమంది ఫాలోవర్లు ఉన్నారు.