ఉరికి కూడా రిజర్వేషన్లు కోరుకుంటున్నారా?
న్యూఢిల్లీ: ఉరి శిక్ష విషయంలో కూడా రిజర్వేషన్లు కోరుకుంటున్నారా అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. బుధవారం సమావేశాల నేపథ్యంలో పార్లమెంటుకు వచ్చిన ఆయన ఇటీవల ఉరి తీసిన యాకుబ్ మెమన్ ఉరి విషయంలో కొందరు వ్యక్తులు భిన్నరకాల అభిప్రాయాలు వెలువరిస్తుండటంపై మీడియా వెంకయ్యనాయుడిని ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. 1993నాటి ముంబయి పేలుళ్ల కేసులో మెమన్ను గత వారం ఉరితీసిన విషయం తెలిసిందే. నాటి దాడిలో మొత్తం 257మంది చనిపోయారు కూడా. ఈ నేపథ్యంలో వెంకయ్య మాట్లాడుతూ..
'మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల రోజు చాలామంది వేరే అంశంపై దృష్టిని నిలిపారు. ఇక కొన్ని మీడియాలైతే ఎంతమందిని ఇప్పటివరకు ఉరి తీశారు. ఏ వర్గం వారిని ఉరి తీశారనే సంఖ్యలను ఇచ్చారు. వాస్తవానికి ప్రజలు మాత్రం ఈ విషయాలు అంతగా పట్టించుకోవడం లేదు. గతంలో 36మందిని ఉరితీశారు. వీరిలో మక్బూల్ భట్, అఫ్జల్ గురు, కసబ్తోపాటు ఇతరులు కూడా ఉన్నారు. ఈ సమయంలో నేను ఏ వర్గానికి చెందిన వారనే విషయంపై మాట్లాడను. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని ఉరితీశారనే విషయంలో స్పష్టమైన వివరాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇలా చేయడం ఎంతవరకు సబబు. ఉరితీసే విషయంలో మీరేమైనా రిజర్వేషన్లు కోరుకుంటున్నారా?ఈ విషయం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను' అని వెంకయ్య మీడియాకు బదులిచ్చారు.