డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు.. ఇతర ఉల్లంఘనలను తగ్గించేందుకు ట్రాఫిక్ విభాగం మరింత కఠిన చట్టాలు తెచ్చే యోచనలో ఉంది
డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు.. ఇతర ఉల్లంఘనలను తగ్గించేందుకు ట్రాఫిక్ విభాగం మరింత కఠిన చట్టాలు తెచ్చే యోచనలో ఉంది. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రతి నిత్యం ప్రత్యేక డ్రైవ్ లు చేపడుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. త్వరలో డ్రైవర్లే టార్గెట్ గా వివరాలు సేకరిస్తున్నారు.
మామూలుగా మద్యం తాగి డ్రైవ్ చేసే వారు పట్టుబడితే.. వాహనం నంబర్ ని నమోదు చేసుకుని ఫైన్ లేదా, శిక్ష విధిస్తున్నారు. దీనివల్ల డ్రైవర్లు తప్పించుకునే వీలు ఉండటంతో.. ఇకపై డ్రైవర్ వివరాలు సేకరించాలని డిసైడ్ చేశారు. దీని ద్వారా.. ఒకటి కంటే ఎక్కువ సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కిన వారిని గుర్తించడం తేలికైతుందని అధికారులు అంటున్నారు. పదే పదే పట్టుబడే వారిపై కఠిన చర్యలు తీసుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు.
రహదారులపై ఉల్లంఘనలకు పాల్పడే వారిని పట్టుకుంటున్న క్షేత్రస్థాయి ట్రాఫిక్ పోలీసులు... ఈ వాహనం నంబర్ ఆధారంగా జరిమానా విధిస్తున్నారు. దీంతో పదేపదే చిక్కుతున్న వాహనాల డేటాబేస్ రూపొందుతోంది. అయితే అసలు తప్పు వాటిని డ్రైవ్ చేసిన వ్యక్తులదని తెలిసినా పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని గుర్తించడం సాధ్యం కావట్లేదు. దీంతో ఎన్నిసార్లు ఉల్లంఘనలకు పాల్పడినా ఒకే తరహాలో జరిమానా విధిస్తున్నారు.
నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనల నమోదును వాహనం నుంచి డ్రై వర్ ఆధారంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల అమలవుతున్న ఈ విధానం త్వరలో నగర వ్యాప్తంగా అమలులోకి రానుంది. దీని ఆధారంగా రూపొందే డేటాబేస్ ద్వారా పదేపదే పట్టుబడే వారిని గుర్తించడం, ఆర్టీఏ, న్యాయస్థానాల సహకారంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు పూర్తి చేశారు.
పీడీఏ మిషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు...
ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఉపయోగిస్తున్న మిషన్లలో కొన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాహనచోదకుడి వద్ద ఒరిజినల్ డ్రైవింగ్ లెసైన్స్ ఉంటే దాన్ని రీడ్ చేసే పరిజ్ఞానం జోడించారు. ప్రతి ఉల్లంఘనుడు తన డ్రైవింగ్ లెసైన్స్‌తో పాటు మరో గుర్తింపు కార్డును చూపడం తప్పనిసరి చేయనున్నారు. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ తదితరాల్లో ఏదో ఒకటి అదనపు చూపించాల్సిన విధానం అమలులోకి తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఉల్లంఘనులకు సంబంధించిన డేటాబేస్ రూపొందుతుంది.
ఫోన్ నంబర్..
సిటీలో పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్ల సంఖ్య సైతం భారీగానే ఉంటోంది. పోలీసులు ఎస్సెమ్మెస్‌ల రూపంలో రిమైండర్స్ ఇస్తున్నా సదరు వ్యక్తికి చేరటం లేదు. ఒక్కో సారి వాహనాలు చేతులు మారిపోవడం, అసలు యజమాని దగ్గరే ఉన్నా ఆయన ఫోన్ నంబర్లు మార్చేయడంతో ఈ సమాచారం వారికి చేరట్లేదు.
వీటిని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు వైలేషన్స్‌ను డ్రైవర్ కేంద్రంగా నమోదు చేయడంతో పాటు వారి నుంచి ఫోన్ నంబర్లనూ తీసుకోనున్నారు. దీనితో పాటు.. వన్ టైమ్ పాస్ వర్డ్ విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ కొత్త విధానంతో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడం తేలికవుతుందని ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. రిపీటెడ్ వైలేటర్స్ డేటాబేస్ ఆధారంగా ఆర్టీఏ ద్వారా లెసైన్స్ సస్పెండ్ చేయించడం, కొన్ని రకాలైన ఉల్లంఘనుల్ని కోర్టు ద్వారా జైలుకు తరలించడం తదితర కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.