దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్‌సీపీ అధినైత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర బుధవారం నగరంలో కొనసాగింది. పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల బుధవారం ఉదయం చిలకలగూడ గాంధీ చౌక్‌కు చేరుకున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం దూద్‌బావి పెంతికోస్థు చర్చి ఫాదర్ డేవిడ్‌రాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అక్కడి నుంచి సీతాఫల్‌మండి మీదుగా మాణికేశ్వరినగర్‌కు వెళ్లారు. డా. వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక 2009లో మాణికేశ్వర్‌నగర్‌లో బొంత సత్తయ్య(35), బోదాసు నర్సమ్మ(65) గుండె పోటుతో మృతి చెందారు. వీరి కుటుంబాలను షర్మిల ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. షర్మిల పరామర్శతో బాధిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
కాగా, బుధవారం సాయంత్రం ఎల్బీనగర్ కామినేని చౌరస్తాకు చేరుకున్న షర్మిలకు స్థానికులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చౌరస్తాలో వైఎస్సార్ విగ్రాహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చింతల్‌కుంటలో షాపూర్ శంకర్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. శంకర్ భార్య లలితకు ధైర్యం చెప్పారు. తర్వాత దిల్‌షుక్‌నగర్‌లో రోడ్డు షో నిర్వహించారు.