
‘5 నెలల్లో చార్మినార్ ఫుట్‌పాత్ ప్రాజెక్టు’
హైదరాబాద్: చార్మినార్ పాదచారుల ప్రాజెక్టును వచ్చే ఐదు నెలల్లోపు పూర్తి చేయనున్నట్టు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఆ ప్రాంతంలో త్వరలో బ్యాటరీ వాహనాలు, బ్యాటరీతో నడిచే బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టును 1993లో మొదలు పెట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదంటూ గురువారం ఉదయం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మజ్లిస్ సభ్యులు అక్బరుద్దీన్, ముంతాజ్‌ఖాన్, పాషాఖాద్రి ప్రశ్నించారు.
దీనికి మంత్రి స్పందిస్తూ... 1993లో పథకానికి రూపకల్పన జరిగినా పనులు మొదలైంది మాత్రం 2007 లోనే అని పేర్కొన్నారు. పనుల్లో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. గుల్జార్‌హౌస్‌లో 50 శాతం పనులు పూర్తయ్యాయని, లాడ్‌బజార్‌లో ప్రత్యామ్నాయంగా లూప్ రోడ్స్ వేస్తామని పేర్కొన్నారు. చార్మినార్ వద్ద వెంటనే తాత్కాలిక టాయిలెట్ ఏర్పాటు చేస్తామని, పత్తర్ ఘట్టి కమాన్‌లను శుభ్రం చేసేందుకు రూ.50 లక్షలు, దుకాణాలకు ఒకే రకమైన బోర్డుల ఏర్పాటుకు రూ. 25 లక్షలు ఖర్చయ్యాయన్నారు.